మనం కూడా ఇల్లు కట్టుకుందామండీ’’ అన్నాను ఒకరోజు ఉదయాన్నే కాఫీ కప అందిస్తూ.పేపరు చదవడంలో లీనమైనాయనల్లా ఒక్కసారి ఉలిక్కిపడి నావైపు కోపంగా చూసి మళ్లీ పేపరు చదవడం ప్రారంభిస్తూ నా చేతిలోని కాఫీ కప తీసుకుని తాగుతూ మధ్యలో ఒకసారి నీ పనయ్యింది, ఇక వెళ్ళచ్చు అన్నట్లు నావైపు చూశారు. అయినా నేను కదలలేదు. నర్మద గుర్తుకు వచ్చింది. నర్మద భర్త శాయి. మావారి దగ్గర అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. మా కళ్లెదుట అంచెలంచెలుగా ఎదిగిపోయాడు, స్వంత ఇల్లు కట్టుకొని. మేము మాత్రం గొర్రెతోక బెత్తెడు అన్నట్లు ఇంకా అద్దెకొంపలోనే వుంటున్నాము. నర్మదా వాళ్లు ఎపడూ నాలుగు వందలలోనే అద్దె ఇల్లు చూసుకునేవారు. మేము మాత్రం రెండు వేలు అద్దె. పైన కరెంటు ఖర్చూ ఎక్కువే అయ్యేది. ఫ్యాన్లు, గీజరు, ఫ్రిజ్‌, కూలరు. ఇలా వగైరా వగైరా అధిక ఖర్చుతో గడిపేస్తున్నాము. కొత్త ఇల్లు, కొత్త ఫర్నిచరుతో వాళ్ళ ఇల్లు చూస్తే కడుపు నిండినట్లయింది నాకు. అంతకుముందు ఒక బిందె, ఒక స్టవ్‌, రెండు కంచాలు, ఒక చాప, రెండు దుప్పట్లు. ఇలా జాగ్రత్తపడి పొదుపు చేసి ఇపడు ఎంతో ఎత్తుకెదిగిపోయారు. నా బుర్రలో దొలుస్తున్న ఆలోచనల నుంచి బయటపడ్డాను. ఏమైనా సరే స్వంత ఇల్లు కట్టుకోవాలన్న పట్టుదల, వాళ్ళకంటే ఒక అంతస్తు ఎక్కువే వెయ్యాలన్న కోరిక ఇవన్నీ నన్ను చుట్టుముడుతున్నాయి.‘‘మిమ్మల్నే, మనం కూడా ఇల్లు కట్టుకుందామండీ’’ అన్నాను, విక్రమార్కుడి చెల్లిలా!‘‘నన్ను సాధిస్తావేంటే బాబూ’’ అన్నారు చికాగ్గా, అక్కడికి నేనేదో అనకూడని మాటలంటున్నట్లుగా నావైపు చూస్తూ...‘‘అదికాదండి మనం..’’ నా మాట పూర్తికానివ్వకుండా‘‘ఇల్లు కట్టుకోవలసినంత తొందర దేనికి?’’ అన్నారు, విసుగ్గా ముఖకవళికలు మార్చేస్తూ.

‘‘ఏం మనం ఇల్లు కట్టుకోకూడదా? అలా అని ఏ సిద్ధాంతి చెప్పాడు. అయినా మీకూ రిటైర్మెంటు దగ్గరపడుతోంది. ఇంకా అద్దె ఇంటికోసం తిరగడం శ్రమ కాదా? మనం నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ ట్యాంకరు వచ్చేముందే క్యూలో నిలబడలేక ఆ నీళ్ళు పట్టుకునేవరకు నానా అవస్థలు పడుతున్నాను. తలచుకుంటేనే భయంగా వుంది. నాకిక ఓపిక లేదు’’ అంటూ నేను పడే బాధలు ఏకరువుపెట్టాను.దానికి సమాధానంగా ఆయన - ‘‘నీకీ యిల్లు నచ్చకపోతే చెప ఇంకొక రెండు వందలు వేసి వేరే మంచి యిల్లు చూస్తాను’’ అన్నారు మొండిగా.‘‘అద్దె ఇంటికోసం తిరిగే ఓపిక మీకుందేమోగానీ, సామాను పేక్‌ చెయ్యడం, మళ్ళీ ప్యాకింగ్‌ విప్పి కొత్తింట్లో సర్దడం, అన్నీ నేనే చూసుకోవాలి. మీకంటే ఎక్కువ శ్రమపడేది నేనే. మీకేం ఎన్నైనా చెబుతారు. ఉన్న ఓపిక కాస్తా ఖర్చు చేసుకుంటే రేపు మనమ్మాయి పెళ్ళికి పనులు చేసే ఓపిక లేక ఓ మూలన పడితే మనకి సాయం చేసేది ఎవరు? అందరూ ఆ టైముకి వచ్చి వెళ్ళిపోయేవారే’’ అన్నాను కోపంగా. ఏది చెప్పినా ఒపకోరు సరికదా? దానికి చిలవలూ, పలవలూ మాత్రం చక్కగా అద్దినట్లు చెబుతారు.