వార్తాపత్రికలోని ఒక వార్త చూసి ఉలిక్కిపడింది. మళ్ళీ చదివింది. చలించిపోయింది. మళ్ళీ మళ్ళీ చదివింది. కన్నీళ్ళు పొంగివచ్చాయి.ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాబిన్లోకి దూసుకెళ్ళి ‘‘దీనిమీద ప్రోగ్రాం చేస్తాను సార్‌’’ అంది టీవీ రిపోర్టర్‌ మంజరి.‘‘దీనిమీదా? నీకేమైనా మతిపోయిందా?’’‘‘ఒక గ్రామం కథ సార్‌....’’‘‘ష్‌... గ్రామాలు సినిమా తెరమీద గ్లామరస్‌గా కనిపిస్తాయి. పల్లెకథల సినిమాల్ని జనం ఎగబడి చూస్తారు. కాని పల్లెటూరి వారి బాధల్ని గాధల్ని టీవీలో చూపిస్తే టక్కున ఛానల్‌ మార్చేస్తారు. రేటింగ్‌ ఢామ్మని పడిపోతుంది.’’‘‘మనకీ కొద్దో గొప్పో సామాజిక బాధ్యత ఉంది కదా సార్‌. ఇది చాలా దారుణమైన వార్త. మనం సిగ్గుపడాల్సిన సంగతి...’’‘‘పేపర్లో దాని ప్లేసేంటి?’’‘‘జిల్లా ఎడిషన్‌ ఆరో పేజీలో లెఫ్ట్‌సైడ్‌ కార్నర్లో!’’‘‘ఆ పత్రిక దానికెంత ఇంపార్టెన్స్‌ ఇచ్చిందో అర్థమైందిగా! డోంట్‌ వేస్ట్‌ మై టైమ్‌. ఇంకేదైనా సెన్సేషనల్‌ న్యూస్‌ పట్టుకో లేదా సేఫ్‌గా సినిమాబేస్డ్‌ ప్రోగ్రాం చెయ్‌, టీఆర్పీ పెరుగుద్ది...’’

‘‘సారీ సర్‌. మీరిలా మాట్లాడతారనుకోలేదు. ఆ గ్రామస్థులు ‘మా ఊరు అమ్మబడును’’ అంటున్నార్సార్‌...’’ దుఃఖోద్విగ్నయైు అంది.‘‘డోంట్‌ క్రై... అది ప్రాక్టికల్‌ జోక్‌ అయినా అవ్వొచ్చు మంజరీ... లీవిట్‌...’’ ల్యాప్‌టా్‌పలో తలదూర్చాడు.‘‘ఇది జోక్‌ కాదు ఆక్రందన! సభ్య సమాజాన్ని కాలర్‌ పట్టుకుని మరీ అడుగుతున్న ప్రశ్న. పల్లె అంటే మట్టీ, మట్టి మనుషులూ కాదు సార్‌, మనిషి ఉనికికి, ఉపాధికి, ఉత్పత్తికి, ఉన్నతికి అన్నిటికీ ఆధారం, ఆదరువు భూమే సార్‌. ఆ భూమిని నమ్ముకున్న భూమి పుత్రులే సార్‌....’’

ఆమె కళ్ళ నుండి బొటబొటా కన్నీటి బొట్లు రాలిపోతుంటే కించిత్తు సానుభూతిగా చూస్తూ అన్నాడు, ‘‘అయితే ఏంటంటావ్‌?’’‘‘ఇదివరకోసారి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని పెనుగోటివాడ గ్రామస్థులూ ఇలాగే వారి ఊరిని అమ్మేస్తామని ప్రకటించారు...’’‘‘అప్పుడేం జరిగింది?’’‘‘తెలీదు సార్‌...’’నవ్వాడు. ‘‘తెలిసేంతగా ఏమీ జరగలేదన్నమాట. ఇదీ అంతే. నేచురల్‌ డెత్‌...డోంట్‌ బీ ఎమోషనల్‌...’’‘‘ఒక ఊరు చచ్చిపోతోంది. కాదు కాదు నిలువునా చంపేస్తోంటే మనమూ ఒకరాయి వేద్దామా? మనది ఫోర్త్‌ ఎస్టేట్‌. మనం వాచ్‌డాగ్స్‌లా ఉండాలి తప్ప కొందరి పెట్‌డాగ్స్‌గా మారి రేటింగ్‌ మత్తుకి బానిసలై పోకూడదు. గాంధీజీ మనదేశం గ్రామాల్లోనే జీవిస్తోందన్నారు సార్‌...’’ ఆవేశంతో గొంతుచించుకుంది.