ఆపొద్దు పోలికి, దాని పెనిమిటి అప్పలకొండయ్యకి పెద్దజట్టీ అయిపోయింది. ఎంతో సంబరంతో ఉరుకులు పరుగుల మీద పోలి గుడిసెకొచ్చింది. గుడిసెలో అడుగెట్టీ ఎట్టడం అప్పల కొండయ్య అగ్గినా తగులుకున్నాడు.తాను మురిపాలు పోయినట్టే పెనిమిటీ మురిసిపోతాడే అనుకుంది. కాని ఆడు ఇనా జట్టీ ఎట్టేస్తా డని కూసంతకూడా యోచన దానికి రాలేదు.‘‘గెంజినీళ్ళకి గతినేదు. ఏటి కొందో సైడు! ఎదవముకం ఎదవముకమాని!’’ చిందులు తొక్కేడు అప్పల కొండయ్య.‘‘నానేఁవీ సొమ్మెట్టి కొనీనేదు. సొమ్మెట్టి కొనీడానికి నాకాడ ఏటుందని! సిల్లిగవ్వ నేదు! నా కాడా నేదు. నీకాడా నేదు. మన మీ జలములో కొనానేము. ఏదో అనా కలిసివొచ్చింది. పెద్దొమ్మగోరు పెతి నెలా రూపాయి సొప్పున ఇరక్కొట్టుకుంటామంటే ఒట్టుకొచ్చినాను. పది మాసాల్లో తీరు మానం అయిపోద్ది’’ ఇవరాలు సెప్పబోయింది పోలి.అప్పలకొండయ్య తిట్లు ఆపలేదు. వాడు గుడిసెకి రావడమే తిక్కరేగి వచ్చేడు. పొద్దుననగా పోయినవాడు ఇదిగో ఇప్పుడు గుడిసెకి తిరిగి వచ్చేడు. కాళ్ళు అరిగేటట్టు ఊరంతా తిరిగేడు. కాని కూలి ఎక్కడా పుట్టలేదు.‘‘ఎదవది! ఏ నాయాల ముకం సూసినానో సుట్టముక్కక్కూడా కరవైపోనాది. 

పాటుపడతానన్నా ఎపుడూ పన్లోకి పిల్నేదు.అప్పలకొండయ్య పనిదొరక్కా, చుట్టముక్క లేకా, నకనకలాడే కడుపుతో సందేళకి ఇంటికొచ్చేడు. బ్రామ్మరింట్లో అంట్లు తోమడానికి వెళ్ళిన పెళ్ళాం ఇంకా రాలేదు. దాకల్ని వెతుక్కున్నాడు. ఏ దాక లోనూ, ఏ చట్టిలోనూ ఏటీనేదు. పోలి అగ్గేసినట్టు లేదు. రేతిరికన్నా అగ్గేస్తుందోలేదో! ఏటన్నా సేస్తాదో సెయ్యదో! ఉస్సురంటూ వాడు అరుగుమీద చతికిల్లా పడ్డాడు. గుంజకి అనుకున్నాడు.పోలి చంకలో చంటాన్నేసుకుని, నెత్తిమీద సుమ్మపాత మీద తళతళా మెరిసిపోతున్న జర్మను సిల్వరు బిందెతో వచ్చింది.

చంటాణ్ణి దింపి బిందె అరుగుమీద పెట్టిందో లేదో అప్పలకొండయ్య తగులుకున్నాడు.ఆ వేళ పార్వతమ్మగారు యథాలాపంగా వీధిని పోతున్న సామాన్ల దాన్ని కేకేయించింది. పాత గుడ్డలు పుచ్చుకుని ప్లాస్టిక్‌ సామాన్లు, జర్మన్‌ సిల్వర్‌ సామాన్లు యిచ్చే ఆ హిందుస్థాని దానితో గీసి గీసి బేరమాడి మొగుడి పేంట్లో మూడు, తన చీరలో రెండు యిచ్చి ఏదన్నా మంచి సామాను పుచ్చుకుందామనుకుంది. ఆవిడ చూపెట్టిన పాతబట్టలన్నిటికీ కలిపి ఏం రాదని తైతక్కలాడి ఆ హిందుస్థానీది మరో చీర వేస్తే జర్మను సిల్వరు బిందె యిస్తానంది. చేతుల్రాక పోయినా బిందె బాగున్నట్టు అనిపించి మరో పాత చీర దాని మొహాన్ని పారేసి పార్వతమ్మ బిందె పుచ్చేసుకుంది.ఆఫీసు నుంచి వచ్చిన మొగుడూ, పురాణం నుంచి వచ్చి అత్తగారూ ఇద్దరూ చెరోవేపు నుంచి ‘జర్మను సిల్వరు బిందెకొండం ఏమిటి? అపత్రిష్ట అప్రతిష్ట!’ అనీ, అదేదో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బిందన్నట్టు మురిసిపోయి కొనేసిందని వెక్కిరించి చీవాట్లు పెట్టేసరికి పార్వతమ్మకి మతి పోయింది. పాత బట్టలు పది రూపాయలు చెయ్యకపోతాయా అని పోలికి ఆశ చూపెట్టింది. ప్రతి నెలా జీతంలో రూపాయి చొప్పున తీసుకోవచ్చంది. వచ్చినమ్మకి వచ్చినంతా దక్కుడు అని పది రూపాయలకి బిందెని పోలికి యిస్తానంది.