రాత్రి పది కావొస్తుంది!గాలీవాన తీవ్రమయ్యింది - ఈదురుగాలి చప్పుడు రాక్షసి ఊపిరి చప్పుడులా ఉంది!గాలీవాన కారణంగా కరెంటు వచ్చే పోయేదిగా ఉంది!‘సునీత’ - కొవ్వొత్తి వెలిగించి, గాలి తగలని చోట ఒక మూలగా టేబిల్‌పై పెట్టింది. అయినా ఆ గాలి ఉధృతికి కొవ్వొత్తి అల్లల్లాడుతూనే ఉంది!ప్రక్కనున్న వంటగదిలో - సునీతకు దూరపు బంధువూ, వరుసకు మేనత్త అయిన శేషమ్మ, చాపపై రగ్గు, కప్పుకొని గాఢ నిద్రపోతూ ఉంది.ఎక్కడో పిడుగు పడినచప్పుడు.ఈ రోజు ఎందుకో సునీతకు చాలా అలసటగా ఉంది!ఇప్పటిలో ఈ కరెంటు వచ్చేటట్లు లేదు. ఇక రాదేమో కూడా!ఇంకా చాలాపరీక్ష పేపర్లు దిద్దవలసి ఉంది. ప్రైవేటు స్కూల్లో టీచరు ఉద్యోగం.అదనపు క్లాసులూ, ట్యూషన్‌ క్లాసులూ అంటూ అదనపు పని భారం.ఇప్పుడు ఈ పరీక్ష పేపర్లు దిద్దడం.ఈ రాత్రికే ఇవన్నీ పూర్తి చేయాలి.ఆ కొవ్వొత్తి వెలుగులో, పెన్ను ఆయుధంగా పేపర్లతో తలపడుతూ ఉంది!కొవ్వొత్తి వెలుగు సహకరించడం లేదు.విసుగుగా పెన్ను టేబిల్‌పై పడవేసింది.ఇక ఈ రాత్రికి కరెంటు రాదు.అలసటగా ప్రక్కనున్న మంచం పైకి వాలింది. 

ఆలోచనలు కదిపిన తేనెతుట్టెలా మారాయి! నిద్ర రావడం లేదు! దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది.వాతావరణం చాలా చలిగా ఉంది. భుజాల వరకూ దుప్పటి కప్పుకొంది.గోడకు తగిలించి ఉన్న కాలెండర్‌ సైజు ఫొటో ఒకటి గాలికి అటూ ఇటూ ఊగుతూ ఉంది!డిగ్రీ పూర్తి అయిన తరువాత అమ్మా, నాన్నలతో కలిసి తీయించుకున్న ఫొటో అది. ఆ ఫొటోలో ఎంత బ్యూటీగా ఉంది తను. ఎంత ఠీవిగా ఉంది! కాలేజీ రోజుల్లో తనను పొగరుబోతూ అహంకారీ అనే వారు ఫ్రెండ్స్‌. నిజమే. తాను అన్నదే వేదం - గీసిందే గీత అన్నట్లుగా ప్రవర్తించేది!మాటపడేది కాదు.అవే తన జీవితాన్ని ఇలా నాశనం చేసాయేమో!ఈనాటి ఈ పరిస్థితికీ అమ్మా, నాన్న, సుబ్రమణ్యం మామయ్యలే చాలావరకూ కారణం....సుబ్రమణ్యం - సుబ్రమణ్యం - దుర్మార్గుడు!అసలు ఆ సుబ్రమణ్యం అనే వ్యక్తే లేకుండా ఉండి ఉంటే - ఉన్నా అతను తనకు మేనమామ కాకుండా ఉండి ఉంటే - ఉన్నా అతనితో చనువూ, అతనిపై ఆశ పెంచుకోకుండా ఉండి ఉంటే ఎంతో బాగుండేది.అతనికిచ్చే పెళ్ళి చేయాలనుకుంది అమ్మ! స్వంత తమ్ముడు కదా అని!కానీ కథ మారింది.తండ్రి అంగీకరించకపోవడం - అతనితోగాకుండా తనకు ‘సురేష్‌’తో వివాహం అవడం జరిగిపోయాయి.అయితే తనకు వేరే వ్యక్తితో వివాహం అయిన తరువాత కూడా ఆ సుబ్రమణ్యం - మేనమామననే చనువుతో, కేవలం బంధువుగా తరచూ తన ఇంటికి వచ్చి పోతూ ఉండటం - అదే - అదే - తన సంసార జీవితాన్ని భగ్నం చేసాయి.