కారణాలడగొద్దు - బ్రహ్మానందానికి నాలుగు దశాబ్దాలు పూర్తయినా ఎందుకో పెళ్ళి చేసుకోవాలనిపించలేదు. ఆదివారం పెళ్ళిపందిరిలో ‘వరుడు కావలెను’ ప్రకటన చూసి ఎగిరి గంతేసినంత పనిచేశాడు. మరోసారి ... ఇంకోసారి కళ్ళు చిట్లించి... కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూశాడు.‘‘డిటో మతం... డిటో కులం గల యువకుడు నలభై సంవత్సరాలు నిండిన యువతికి, నలభై సంవత్సరాలు వయసున్నా... అంతకన్నా అయిదు సంవత్సరాలు ఎక్కువున్నా.. తక్కువున్నా.. ఓ మోస్తరు అందగాడైనా పరవాలేదు. వ్యక్తిగత ఆస్తి అక్షరాలా అయిదు కోట్లు... ఇదికాక పిత్రార్జితం పట్నంలో సొంత బిల్డింగు, సొంత వూర్లో యాభై ఎకరాల పంటపొలం, భారీ ఫిక్సెడ్‌ డిపాజిట్టూ గల యువతికి ‘వరుడు కావలెను’ వివరాలకు సో అండ్‌ సో నెంబర్లలో సంప్రదించగలరు’’ - ఇదీ ప్రకటన సారాంశం! మళ్ళీ మళ్ళీ చూశాడు. అక్షరం అక్షరం పట్టిపట్టి మరీ పరీక్షగా చూశాడు. అరచేతిని గట్టిగా గిల్లి నిజమేనని నిర్ధారణకొచ్చాడు.బ్రహ్మానందం బ్రహ్మానందపడిపోయాడు.అపుడే పేద్ద ఫంక్షను హాలు.. విద్యుద్దీపకాంతులూ... పచ్చని తోరణాలూ కనిపించసాగాయి. మంగళవాద్యాలూ... సన్నాయి మేళాలూ వినిపించసాగాయి. వెంఠనే సో అండ్‌ సో ఫోన్‌ నెంబర్‌కి ఫోన్‌ చేశాడు. అవతలి వ్యక్తి ఫోన్‌ తీసి ‘హలో’ అంది. మృదుమధురంగా వుందా గొంతు.‘‘ఎక్స్‌క్యూజ్‌ మీ పేపర్లో ప్రకటన ఇచ్చిన వధువు మీరేనా?’’‘‘య్యేస్‌...’’ స్టయిల్‌గా అంది.

 అవతలి గొంతు చిట్టిబాబు వీణ మీటుతున్నట్లనిపించింది. గొంతే ఇంత బావుంటే మనిషెంత బావుంటుందో. తబ్బిబ్బయిపోయాడు. గాల్లో తేలిపోయాడు బ్రహ్మానందం.‘హలో.. మాడమ్‌! మీ పేరు తెలుసుకోవచ్చా?’’ హస్కీగా అడిగాడు.‘‘వైనాట్‌? ... కల్పన!’’ అదే శృతిలో చెప్పింది.‘‘కల్పనా అంటున్నారు. కొంపతీసి మీరు సినిమా యాక్టరు... కల్పనా...’’‘‘అదేంకాదు.. అయామ్‌ డిఫరెంట్‌ కల్పన... మరి మీరు...?’’‘‘దట్స్‌ ట్రూ... అయామ్‌ డిఫరెంట్‌ బ్రహ్మానందం?’’‘‘దెన్‌ వై డిడ్‌ యూ కాల్‌ మీ?’’‘‘మిమ్మల్ని పర్సనల్‌గా కలుసుకోవాలని!’’‘‘ఇపడు రాగలరా?’’నాకంటే తొందరగా వున్నట్టుంది అని మనసులో అనుకొని...‘‘సాయంత్రం... సంధ్యా సమయంలో.. ఓపెన్‌ టెర్రస్‌ మీద... ఓపెన్‌గా మాట్లాడుకుంటే బెటరేమో!’’ అన్నాడు మెలికలు తిరిగిపోతూ -‘‘మా సెక్రటరీకి చెప్తాను. మీ నెంబరు మా కాలరయిడీలో రికార్డయి వుంటుంది. ఆయనకి నా ఎపాయింట్‌మెంట్‌ డీటైల్స్‌ తెలుస్తాయి. ఆయనే మీకు ఫోన్‌ చేస్తారు... సరేనా?’’ అంటూ బ్రహ్మానందం సమాధానం కోసం ఎదురుచూడకుండా ఠక్కున ఫోన్‌ పెట్టేసింది కల్పన.బ్రహ్మానందం గుండె గుబేళ్‌మంది.వామ్మో... ఇంత బిల్డప్‌ ఇచ్చిందేంట్రా బాబోయ్‌.. మధ్యలో ఒంటికాలు సొంఠిలింగం సెక్రట్రీగాడెవరూ? సెక్రెట్రీకి ఈవిడగార్కీ కనక్షనేంటీ? సెక్రెట్రీ మాట ప్రకారమే నడుచుకొనేదైతే ... వాడితోనే సెటిలియిపోవచ్చు కదా... ‘వరుడు కావాలి’ ప్రకటన ఎందుకిచ్చినట్లు? బ్రహ్మానందం మనసు మనసులో లేదు.. ఆలోచనలు కందిరీగల్లా ముసురుకొంటున్నై... తిండి సహించడం లేదు. పోనీ కాస్సేపు నడుం వాలుద్దామంటే అంపశయ్య మీద పడుకున్నట్లుంది. కళ్ళు మూసినా... తెరిచినా.. కోట్లు.. కోట్లు కనిపిస్తున్నాయి. కల్పన మాటలే వినిపిస్తున్నాయి.