ఫోన్‌లో వాళ్లు ఆ విషయం చెప్పగానే సంతోషంతో ఎగిరి గంతేసింది హారిక. వెంటనే వేణుగోపాల్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. తను కూడా చాలా సంతోషించాడు. ఆ ఘడియల కోసం ఏడాదినుంచీ ఎదురు చూస్తున్నారు. అయితే ఎదురు చూస్తున్న ఘడియలు దగ్గర పడుతుంటే చిత్రంగా.., మనసు బాధతో ఊగిసలాడుతోంది హారికకు. ఇలా ఎందుకు జరుగుతోంది?తూర్పున పున్నమి చంద్రుడు వెలుగులు చిమ్ముతున్నాడు. సూర్యుడు అస్తమించి గంటవుతోంది. నగరమంతా దీపాల వెలుతురు. బైపాస్‌ రోడ్‌లో వాహనాల చప్పుడు.మేడమీద పిట్టగోడకు ఆనుకుని శూన్యంలోకి చూస్తోంది హారిక. ఆమె ముఖంలో అలజడి. విసురుగా వచ్చిన చల్లగాలికి ముఖం మీదకు చున్ని వచ్చినా పట్టించుకోలేదు. ‘తనేమన్నా తప్పు చేస్తోందా?’ఇప్పటికి గంటనుంచి కనీసం యాభైసార్లైనా అలా అనుకోనుంటుంది హారిక.తనీ నిర్ణయం తీసుకోవడం వెనక ఒక్క సంఘటన కాదు, ఒక్కమాట కాదు.. చాలా చాలానే ఉన్నాయి.గంటనుంచి ఆమె అక్కడే కూర్చుని ఉంది. ఆలోచనల్లో మునిగిపోయి ఉంది. గతం, వర్తమానం, భవిష్యత్‌ కలగాపులగంగా ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతున్నాయి. 

ఎన్నెన్ని మాటలన్నారనీ..పిల్లలుంటే నే మనుషులా.. లేకుంటే సమాజంలో దంపతులకు విలువ లేదా? అయినా ఎంతమంది అనాథ పిల్లలు.. నా అన్నవారు లేక, వేళకు తిండిలేక, కట్టుకోను బట్టలేక బాధపడుతున్నారు. వీధుల్లో జంతువులతో సమానంగా జీవిస్తున్నారు. ఈ పిల్లలను అలా చూశాక, ఇంతమంది ఎలా ఇంత సంతోషంగా ఉంటున్నారో తనకు అర్థమే కాదు.‘నీది మరీ చాదస్తంలే’ అంటారు తనను తెలిసిన వాళ్ళు.అందరూ సుఖంగా ఉండాలనుకోవడం తప్పా? జీవం ఉన్న ప్రతి ప్రాణికీ గాలీ వెలుతురు ఎలా దొరుకుతాయో, అంతే సహజంగా పిల్లలందరికీ తల్లిదండ్రుల ప్రేమ దొరకాలనుకోవడం తప్పా..? మొన్నటికి మొన్న ఏమయింది.. ఇద్దరు చిన్న పిల్లలను విజయవాడ గుడిదగ్గర వదిలేసి వాళ్ళమ్మ చెన్నయ్‌ వెళ్లిపోయింది. భాషరాదు.., అమ్మలేదు.., ఆకలి.., ఆదరించే వాళ్ళు లేరు. రెండేళ్ళ చెల్లికి నాలుగేళ్ల అన్న అన్నీ తానే అయ్యాడు. ఆ వార్త పేపర్‌లో చూడగానే ఆ రోజంతా తనకు ఎంత ఏడుపు వచ్చిందో. ఏ పనీ చేయబుద్ధి కాలేదు. స్తబ్దంగా ఉండిపోయింది తను. వాళ్లమ్మ తిరిగి వస్తే ఒకరోజు ఉపవాసం ఉంటానని దుర్గాదేవికి మొక్కుకుంది.‘ఎవరినో అమ్మ వదిలేసి పోతే నీకెందుకు బాధ’ అన్నారు పక్కింటి వాళ్ళు.ఆ పిల్లలున్నది ఏ చంద్రగ్రహంలోనో, అంగారక గ్రహంలోనో కాదు కదా.., మనకెందుకు అని ఊరికే ఉండిపోవడానికి. మనతోపాటు ఉండేవాళ్ళు.. ఆ ఇద్దరు పిల్లలను ఆ స్థితిలో చూస్తూ తమకేమీ పట్టనట్లు, ఎలా అందరూ తమ పనులు తాము చేసుకుంటూ పోతుంటారో తనకు ఇప్పటికీ అర్థం కాదు.