మర్నాటి కేసు తాలూకు ఫైళ్ళు ముందేసుకుని తిప్పలు పడుతున్నాడు గోపాళం. రోజువారీ పనులతో వంటింట్లోంచి వరండాలోకి వొయ్యారంగా తిరుగుతున్న శ్యామా. మారాం చేసే పిల్లాడిలా ఆమెనంటిపెట్టుకుని అటూ ఇటూ ఊగుతూ అల్లరి చేస్తున్న ఆ జడా... హుఁ... ఏకాగ్రత ఎలా కుదుర్తుందీ?‘‘అబ్బా!’’ మోచెయ్యి తలకానించుకున్నాడు గోపాళం నాటకీయంగా.‘‘ఏమైంది?’’ వింతగా చూసింది శ్యామ వెనక్కి తిరిగి. ఆమె హఠాత్తుగా తిరగడంతో పొడవాటి జడ ఆమె నడుంచుట్టి అదే వేగంతో వెనక్కి వచ్చింది. ‘హుఁ... ఇదోటి’ విసుక్కుంది.‘‘దాన్ని విసుక్కోకు... ఆ జడ చూసే నిన్ను చేసుకున్నాను!’’‘‘అబ్బో! మెచ్చి మేకతోలు కప్పారులెండి మహా’’ నడుంమీద చెయ్యేసుకుని కళ్ళు చక్రాల్లా తిప్పింది.‘‘అలా మా గురువుగారి ‘రాధ’ని కాపీ కొట్టద్దన్నానా? షి ఈజ్‌ ఇనిమిటబుల్‌! అనుకరణ సాధ్యంగాని ‘స్టైల్‌’ అది’’ తన్మయంగా అన్నాడు గోపాళం.‘ఇదో తిక్క మేళంరా బాబూ’ అని తలపట్టుకోబోయి దానికేం అభ్యంతరం చెప్తాడో అనుకుని మానేసింది. ఇంతలో ఫోను మోగింది.‘‘నేనింట్లో లేనని చెప’’ అన్నాడు గోపాళం గంభీరంగా, ఫైళ్ళలోకి తలదూరుస్తూ.‘‘ఇంకా రాలేదమ్మా... ఓ గంటాగి ఫోన్‌ చెయ్యి. ఓ.కే?’’ అని పెట్టేసింది శ్యామ.‘ఎవరూ?’ అన్నట్టు సౌంజ్ఞ చేశాడు గోపాళం, ‘గోపాళం’ మొహంపెట్టి.‘‘బుజ్జిగాడికోసం!! పీ. కాచ్చాయ్‌ని, యూకేజీట’’‘‘ఇంటోనే ఆఫీసైతే...’’ ఏం లాభం లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ‘‘ఓ అరకప కాఫీ పడేవోయ్‌.. ఈ కేసు విష్యం ఏవీఁ తేలట్లేదు’’ కనుబొమలు వంపుతిపతూ, పెదవి చప్పరిస్తూ అన్నాడు.‘‘అరకప్పూ, పావుకప్పూ దొరకవు. 

అయినా మీరైతే కాపీ కొట్టచ్చా మీ గురువుగారి గీతల్ని? ఏమిటా కనుబొమలు వొంపులు తిప్పటాలు?’’ జడ తిపతూ ఓరగా ప్రశ్నించింది శ్యామ.‘‘నా పేరు గోపాళం గనుక ఇట్సోకే... నీ పేరు రాధ కాదుకదా’’ లా పాయింటు లేవదీశాడు.‘‘నా మొహంలా వుంది మీ లాజిక్కు. అలా అయితే గోపాళం శ్యామని పెళ్ళి చేసుకోవడానికి వీల్లేదే... ఈ పెళ్ళి చెల్లదు మిలార్డ్‌!’’ ఆందోళనగా అంది శ్యామ, కనిపించని జడ్జిగారివైపు చూస్తూ.‘‘అబ్బా... నువ్వెళ్ళు. వెళ్ళి పావుకప కాఫీ పట్రా’’ తర్జనితో వంటింటివైపు చూపిస్తూ విసుగ్గా అన్నాడు గోపాళం.