సాయంత్రం ఆరు కావస్తోంది.ఓ విశాల భవంతిలో అందమైన పడక గది.ఆ గదిలో ఓ అందమైన హంస తూలికాతల్పంలాంటి ఒక మంచం. ఆ మంచం ప్రక్కనే అటు ఇటు రెండు చిన్న బల్లలు.అందులో ఒక బల్ల మీద చిన్న రాత్రి దీపం (టేబుల్‌ లాంపు). ఇంకో బల్ల మీద కాలంతో పోటీ పడుతున్న ఓ చిన్న గడియారం (అలారం టైం పీస్‌).ఎదురుగా గోడ మీద అందమైన బొమ్మలతో రంగుల కేలండరు. ఆ గదంతా అందమైన తెరలు మరింత శోభాయమానంగా ఉన్నాయి.‘అబ్బ! అపడే చీకటి పడిందా?’ అనుకుంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది మంచం.గోడ మీద కేలండరు ఫక్కున నవ్వింది. ఎందుకలా నవ్వుతావన్నట్లు గుర్రుగా చూసింది మంచం.‘‘ప్రపంచమంతా చీకటి పడగానే నీకు డ్యూటీ మొదలవుతుంది. అందరూ పగలు పని చేసి రాత్రి నిద్రపోతే నువ్వు పగలు పడుకుని రాత్రి మేల్కొంటావు. అందుకని!’’ సంజాయిషిగా చెప్పింది కేలండరు.‘‘నే నొక్కత్తినే కాదు, నా ప్రక్కనే ఉన్న ఈ టేబుల్‌ లాంపుకీ అంతే. చీకటి పడితేనే మాకు తెల్లారుతుంది! మా పని మొదలవుతుంది’ మంచం టేబుల్‌ లాంపు వైపు చూపిస్తూ అంది.‘‘నువ్వు చెప్పింది మాత్రం నిజం. ఈ పాడు మనుషులకి నే పగలు అస్సలు గుర్తు రాను. కాస్త చీకటి పడిందా - నే లేందే ఒక్క క్షణం కూడ ఉండలేరు...’’ తన అవసరం మరొక్కసారి నొక్కి చెప్పింది టేబుల్‌ లాంపు.‘నీకింకా ఫరవాలేదు. ఓ అయిదు గంటలు పనిచేసాక స్విచ్‌ ఆపుచేస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది.

నాకయితే రాత్రి పది అయితే చాలు గుండె అదురుతుంది. ఎక్కడెక్కడో ముప్పొద్దులా తిరిగి నా మీద వాలి పోతారు. వాళ్ళు ఎలా ఉన్నా, ఎంత దుర్గంధాలతో ఉన్నా కిమ్మనకుండా భరిస్తున్నాను’’ వాపోయింది మంచం.‘‘ఏ రోజు కారోజు నీకు పక్క బట్టలు మారుస్తారు కదా? ఇంకా కంపు అంటూ ఈ ఏడ్పులెందుకు?’’ కేలండరు వెటకారంగా అంది.‘‘నా మీద ప్రేమతో మార్చరు. వాళ్ళ కంపు వాళ్ళు భరించలేక మారుస్తారు. ఈ ఇంటి యజమాని, అదే ఈ రామిరెడ్డి మామూలు వాడా! తీసుకొచ్చిన అమ్మాయిని మరల తీసుకురాడు. వాడి కామ క్రీడలకి ఎంతోమంది అమ్మాయిల్లాగే నేనూ బలి అయిపోతున్నాను. ఎపడో నా బతుక్కి విముక్తి...’’ బాధ పడింది మంచం.‘‘బాధపడకు! నీకు మంచి రోజులు వస్తాయిలే. నువ్వేమో మౌనంగా ఆ రామిరెడ్డిని భరిస్తావు. నేనేమో గుడ్లప్పగించి చూస్తూ, ఏమీ చేయలేక నిస్సహాయంగా టిక్కు టిక్కు మనుకుంటూ నా పని నే చేసుకుపోతాను. ఒక్కోసారి, ఈ రామిరెడ్డి పనుందని, దొంగ సరుకు రవాణా కోసం తెల్లవారు ఝామున వెళ్ళాల్సి వచ్చి అలారం పెడతాడు. అపడు నాకు భలే చిర్రెత్తు కొస్తుంది. పోనీ కదా అని నా విధి నే నిర్వర్తించి లేపితే ‘ఠక్కున ఓ మొట్టికాయ’ కొట్టి మరీ లేస్తాడు. అది తలచుకొంటేనే నాకు వళ్ళు జలదరిస్తుంది’’ అలారం టైం పీస్‌ ఆవేదన పడింది.