ఆకాశం ఉరిమింది. మేఘాలు గర్జించాయి.మబ్బులు, తరువులు పెనవేసుకుని వర్షానికి జన్మనిచ్చాయి.ఎండి బీటలు వారిన వ్యవసాయ భూమిపై రాలిన తొలిచినుకు చుక్కను చిత్రంగా చూశాడు తండ్రి.కొడుకు మొహం విప్పారింది. ‘‘నాన్నా, నేను వ్యవసాయం మొదలుపెట్టినట్లే’’ నమ్మకంగా ప్రకటించాడు చిరుగర్వంతో.తండ్రి తల ఊపాడు అభావంగా.‘‘కానీ నాకు వరిసాగు గురించి ఏమీ తెలియదు కాబట్టి, మీరు దగ్గరుండి గైడ్‌ చెయ్యాలి’’ తండ్రి మార్గదర్శనాన్ని అభ్యర్థించాడు కొడుకు.తండ్రి తల ఊపాడు అంగీకారంగా.ఉత్సాహంగా ముందుకు సాగాడు కొడుకు.దుక్కి దున్నకం మొదలయింది. ఇనప గొర్రును భూమిలోకి దింపి భారంగా కదులుతోంది ట్రాక్టరు. ఆ ఉరవడికి మట్టిపెళ్ళలు పై నుంచి కిందికీ, కింది నుంచి పైకీ స్థానభ్రంశం చెందుతున్నాయి.‘‘సెలగపారల్తో గట్లు సరిజెయ్యాలి’’.తండ్రి సూచనను కొడుకు అల్లుకుపొయ్యాడు.మెరకగా ఉన్న కట్టల తలల్ని తెగ్గొట్టాడు. పల్లంగా ఉన్న గట్లకు మట్టిని జోడించాడు. మధ్యలోని ప్రదేశాన్ని చదును చేశాడు. చూడచక్కని మడి తయారయింది.‘‘మడిని నీటితో నింపాలి’’ తండ్రి ఉద్బోధ.

ఆరంగుళాల పైపులోంచి నీళ్ళు ప్రవాహంలా మడిలోకి ఉరికాయి. మడి నిండింది.‘‘ఇప్పుడు దమ్ముజెయ్యాలి’’.టైర్లకు బదులు వెనకవైపు పెద్ద పెద్ద ఇనప చక్రాలు బిగించిన ట్రాక్టరు మడిలోకి దిగింది. నీటిలో గజగామినిలా కదులుతోంది. ఇనప చక్రాలు బురదలో మెల్లగా దొర్లుతూ, అట్టడుగు పొరల్నుంచి మట్టిని తిరగదోడుతున్నాయి.తండ్రి సూచన మేరకు దమ్ము చేసేటప్పుడే బలం మందును మట్టిలో కలిపాడు కొడుకు.మడిచెక్క తయారయింది.దాని పక్కనే రెండెకరాల పొలాన్ని కూడా వరిసాగు కోసం అదే తరహాలో తయారు చేశాడు కొడుకు.‘‘మడిచెక్కలో నారు పొయ్యాలి’’.కొడుకు నారు చల్లాడు.చూస్తుండగానే మొలకలు వచ్చాయి.ఫఫఫచప్పట్లతో హాలు మార్మోగింది.మొదటి వరసలో కూచున్నాడు తండ్రి.తన పేరు పిలవగానే కొడుకు ఠీవిగా నడుచుకుంటూ వేదిక మీదికొచ్చాడు.

ఐటీ శాఖ మంత్రి పెద్ద షీల్డును అందించి ‘కంగ్రాట్స్‌’ అంటూ భుజం తట్టాడు.మంత్రితో కరచాలనం చేసి, జ్ఞాపికను గర్వంగా గుండెలకు హత్తుకుని వేదిక దిగిపోతున్న కొడుకును మెరుస్తున్న కళ్ళతో చూశాడు తండ్రి. అందరితోపాటు తనూ చప్పట్లు కొట్టాడు.హైదరాబాదులో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పదేళ్ళ నుంచి కంప్యూటర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న కొడుకు ఓ రోజు తండ్రికి ఫోన్‌ చేశాడు. ‘‘వచ్చే ఆదివారం నాకు సన్మానం ఉంది నాన్నా. మినిస్టర్‌గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటాను. నువ్వు, అమ్మ తప్పకుండా రావాలి’’ ఆనందంగా చెప్పాడు.