నేను ఏడో తరగతిల ఉండంగ మా ఊరికి కరెంటు వొచ్చింది. కరెంటు వొచ్చిన మూడు నెలలకు మా వాడకట్టుకు కొంచెం దూరంల సిన్మతేటర్‌ గట్టిండ్రు. మా ఊరంతటికి గదొక్కటే సిన్మతేటర్‌.కొత్త సిన్మవొస్తె - ‘మీ అభిమాన థియేటర్‌ భారత్‌ టాకీసులో ఎన్టీఆర్‌, ఎస్వీ రంగారావు, మాలతి, రేలంగి. బాలక్రిష్ణ, పద్మనాభం నటించిన గొప్ప జానపద చిత్రం పాతాళభైరవి నేడే విడుదల. ఒళ్ళు జలదరించే కత్తి యుద్ధాలు, కమ్మని పాటలు, కనువిందైన ఆటలు, మాయలు, మంత్రాలు, కుట్రలు, కుతంత్రాలు పాతాళభైరవి నేడే చూడండి. చూసి ఆనందించండి. మీ అభిమాన థియేటర్‌ భారత్‌ టాకీసులో మాట్నీతో విడుదల’ అన్కుంట సిన్మబండిల దిరుక్కుంట ఒకడు సాటిచ్చెటోడు.రంగురంగుల పాంప్లేట్లు బంచెటోడు. గా పాంప్లేట్ల సగం సిన్మ కత ఉండేది. తోటరాముడు మాంత్రికుడిని చంపుతాడా? రాజకుమారిని పెండ్లాడుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు గావాలంటె మిగతా కత వెండితెరపై చూడండి అని గా పాంప్లేట్ల ఆకర్కి ఉండేది. గది సద్వంగనే మాకు గా దినమే సిన్మ సూడాలనిపిచ్చేది.భారత్‌ టాకీస్‌ ముంగట నాగమల్లె చెట్టు ఉండేది. గాలి గొట్టినపడు చెట్టు మీదికెల్లి పూలు రాలి తొవ్వమీద బడేటియి.

గా పూలు తేటర్‌ ముంగట ఏసిన ముగ్గులెక్క ఉండేటియి. తేటర్‌ ముంగటి గోడ మీద నిలువెత్తు పోస్టర్లు అతికిచ్చెటోల్లు. సిన్మ ఇంక అద్దగంటల షురువైతదనంగ సిన్మ రికార్డుల ఏసెటోల్లు. ఊదుబత్తి బడ్తె గాదాని పొగ ఆర్రంత నిండిన తీర్గ సిన్మ పాటలు ఊరంత అల్ముకునేటియి. సిన్మ రికార్డు బడంగనే ఆరు గొట్టిందని అందర్కి ఎర్కయ్యేది. సిన్మ నడుస్తున్నపడు ఇంట్రవెల్‌ ముంగట ఒకపారి, అయినంక ఇంగొకపారి రీలు మార్పు ఉండేది. పర్దమీద రీలు మార్పు నిశ్శబ్దం అని స్లైడు ఏసెటోల్లు. రీలు మార్పునకు ఐదు నిమిసాలు బట్టేది. కొంతమంది తేటర్ల కెల్లి అవుతలకు బోయి సిగలేటు దాగి వొచ్చేటోల్లు. సిన్మ మా ఊరికి తక్వగాని జెరమై గూసున్నది. యాడ జూసినా సిన్మ ముచ్చట్లే.‘‘అరేయ్‌ మల్లిగాడు నాగేస్వర్రావు లెక్క పోజిడుస్తుండురో’’ అని ఒక పోరడు అంటె -