రాత్రి తొమ్మిది గంటలయింది. అన్నయ్య ఇంకా రాలేదని ఎదురు చూస్తోంది శ్రావ్య. ఇంకో అరగంట కి తలుపు చప్పుడయితే ఆత్రంగా వెళ్లి తలుపు తీసింది.‘అన్నయ్యా! ఇంటర్వ్యూ బాగా చేసావా? పొద్దున్న తొమ్మిందింటికి వెళ్లి, ఇంత రాత్రి దాకా ఎక్కడున్నావు? రోడ్డు దాటితే ఎదురుగానే కదా ఆఫీసు? ఎందుకు, ఏదో పోగొట్టుకున్నట్లు విచారంగా ఉన్నావు? ఇంటర్వ్యూ బాగా చెయ్యలేదా? రోడ్డు దాటితే ఎదరే ఇంటర్వ్యూ ఆఫీసని, దూరంగా వచ్చిన ఇంటర్వ్యూ వదిలేసి, దగ్గర ఆఫీసుకి వెళ్లావుగా? ఏమిటన్నయ్యా మాట్లాడవు? కంట్లో ఆ కన్నీళ్లేమిటి? పోన్లే అన్నయ్యా, బాధ పడకు. మరో జాబ్‌ కోసం చూద్దాంలే. భోంచేద్దూగాని రా. అమ్మా, నాన్న లేని వాళ్లం. వర్షంలో ఆఫీసు నుంచి వస్తూ, అమ్మ మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయింది. నాన్న కూడా ఆ షాక్‌కి తట్టుకోలేక చనిపోయారు. మనం చిన్న పిల్లలమై పోయాం. ఎలాగో పిన్నీ, బాబాయి చేరదీస్తే, వాళ్ల సూటి పోటీ మాటలు పడుతూ, చదువు పూర్తి చేసాం. నాకు నువ్వు, నీకు నేను. నీ బాధేమిటో నాకు చెప్పకపోతే ఎల్లా తెలుస్తుందీ? ఈ జాబ్‌ కాకపోతే మరో జాబ్‌ రాకపోదులే.’‘కానీ, మరో సుజిత రాదు కదామ్మా’ అంటూ భోరున ఏడిచాడు ప్రసాదు.‘ఏమిటన్నయ్యా నువ్వనేది? సుజిత ఎవరు? ఏమైందామెకి? ఎవరావిడ?’ అడిగింది శ్రావ్య.‘సుజిత అంటే పెద్దావిడ కాదు. ఆరేళ్ల పసిమొగ్గ. పువ్వై విరియక ముందే, మొగ్గగానే రాలిపోయిందమ్మా.

 ఆ చిన్నారిని నేను కాపాడలేకపోయానమ్మా.’‘అయ్యో, మరందుకే ఇంటర్వ్యూకి కూడా వెళ్లలేక పోయావా?’‘ఈ సంఘటన సాయంత్రం నాలుగింటికి జరిగింది. అంతకు ముందర ఇంటర్వ్యూకి వెళ్లాను. కానీ అప్పటికే ఆఫీసు మూసేశారు.’‘నాకంతా గజిబిజిగా ఉంది. అసలేం జరిగిందన్నయ్యా? వివరంగా చెప్పురోడ్లన్నీ ఆటోలు, రిక్షాలు, స్కూటర్లు, సెవెన్‌ సీటర్లు, బస్సులు, లారీలు, కార్లు. ఇలా జనాభా కన్నా ఎక్కువ సంఖ్యలో వాహనాలెక్కువయిపోయి, ఇవన్నీ గుమిగూడి రోడ్డు మీద అస్తవ్యస్తంగా, చిందరవందరగా, చెల్లాచెదురుగా, సర్దుకోని ఇల్లులా, చీమ కూడా దూరే సందు లేకుండా ఉండే, రోడ్డు మీద నడిచి వెళ్లే వాళ్లకి ఏ దారీ లేక భయం భయంగా, ప్రాణాలరచేతులలో పెట్టుకుని, ఈ క్షణం రోడ్డు దాటితే చాలనుకుని, హమ్మయ్య, ఈరోజుకి ధైర్యంగా, ఏ ఆపదా లేకుండా ట్రాఫిక్‌ గండం నుంచి ఇంటికి చేరుకోగలిగాం అన్న సంతృప్తి ఆ కాసేపే ఉన్నా, మళ్లీ ఏ రోజు ఎల్లా ఉంటుందో చెప్పలేని పరిస్థితి! నడిచే వారికి రోడ్డు దాటడం దిన దిన గండమే! దేవుడు ఆయుష్షు వందేళ్లూ ఇచ్చినా, అందులో సగం ఆయుష్షుతో బతకడానిక్కూడా వీలు లేకుండా చేస్తున్నారు మన ట్రాఫిక్‌ నియంత్రణాధికార్లు! వాహన చోదకులు!