రాయల్‌ సొసైటీ ఫర్‌ లిటరేచర్‌’’ అనేది బ్రిటన్‌లో ఒక ప్రముఖ సాహిత్య అకాడమీ. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతినొందిన అరవైమంది రచయితలు, కవులు ఈ అకాడమీలో సభ్యులు. ఇండియన్‌ పార్లమెంట్‌లోనూ, అమెరికా సెనెట్‌లోనూ బ్రిటన్‌లోని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లోనూ సభ్యత్వం సులభంగా దొరుకుతుందేమో కానీ, ఈ అకాడమీలో మెంబర్‌షిప్‌ దొరకడం బహుదుర్లభం. ఆ అకాడమీలో సభ్యత్వం దొరికిన వ్యక్తికి ఆ దేశాధ్యక్షుడి కంటే అధిక విలువ, గౌరవాలు లభిస్తాయి వారిదేశాలలో.రా.సొ.లి. నిర్వహించే కార్యక్రమాలలో ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రతి ఏటా ప్రపంచంలోని ఐదుగురు ప్రముఖ కవులను ఎంపిక చేసి వారి చేత లండన్లో నాలుగు రోజులపాటు ప్రసంగాలిప్పించడం. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని నలుమూలలనుండి ప్రముఖ కవులు, రచయితలు, నాటక రచయితలు, కళాకారులు హాజరవుతారు. అంతేకాదు, బ్రిటన్‌ ప్రధాని, మంత్రివర్గం, పార్లమెంటు సభ్యులు వివిధ దేశాల రాయబారులు, మేధావులు ఈ కార్యక్రమానికి హాజరై ఆయా కవులు, రచయితలు ఇచ్చే ఉపన్యాసాలను శ్రద్ధగా వింటారట.ఎనభై సంవత్సరాలనుంచి రా.సొ.లి. తన కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నా భారతదేశానికి ఇంతవరకూ వాటిలో పాల్గొనే అవకాశమే రాలేదు. ఫలానా బెంగాలీ కవికి ఈ సంవత్సరం వస్తుంది. ఫలానా కన్నడ రచయితకు వచ్చే అవకాశం ఉంది అని పత్రికలు పలుమార్లు ఊహాగానాలు చేసినా అవి ఒక్కసారీ నిజం కాలేదు. ఎపుడైనా ఫలానావారికి రావడం ఖాయం అనుకున్నపుడల్లా అతనంటే గిట్టనివారు రాజకీయ పైరవీలు చేసి ఆ అవకాశాన్ని అడ్డుకున్నారనే వార్తలు గుపమనడం పరిపాటైంది. 

అవకాశం మిస్సవగానే ‘మనదేశంలో వందల పుస్తకాలు రాసి పద్మశ్రీ అవార్డులు అందుకున్నవారు కూడా ఉన్నారు. వీరెవరూ రా.సొ.లి. దృష్టికి రాలేదా?’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు పత్రికలలో రాసేవారు కొందరు. ‘భారతదేశం బ్రిటీష్‌ వారి కాలంలో బానిసత్వం అనుభవించింది. అందుకే భారత్‌ అంటే వారికి చిన్న చూపు’ అని ఈసడించేవారు మరికొందరు.‘ఈసారి తప్పకుండా ఆ అవకాశం మనకే వస్తుంది’ అని చకోర పక్షుల్లా ఎదురుచూసేవారు కొందరు కవులు. తీరా రాలేదని తెలియగానే నిట్టూర్చేవారు.