‘‘విస్తరి ముందు పీటవేసుకుని కూర్చున్నంత తేలిక కాదు... జీవితంలో నెగ్గుకు రావడం అంటే! తింటున్నంతసేపూ పీటా విస్తరీ నీ అధికారం కింద ఉంటాయి. నువ్వు చెప్పినట్టు ఉంటాయి. జీవితం అలాంటిది కాదు. మడికట్టుకున్న నానమ్మ దూరం నుంచి కొబ్బరి పచ్చడి వేసిన ట్టు పరమాత్మ మన కంచంలో ఎపడేం వేస్తాడో తెలీదు. వేసిందల్లా తినడమే కానీ కోరి వడ్డించుకోవడం సాధ్యపడే పనికాదు.’’‘‘శాస్త్రీ! చెబితే జీవితం గురించి చెప. లేదా కొబ్బరి పచ్చడి గురించి చెప. అంతేకానీ పులుసు కూరలో పాయసంలా అసయ్యమైన కాంబినేషన్లు కలపకు. కావాలంటే ఆ పచ్చడి మరికాస్త కలుపుకో.’’‘‘వద్దు బావా! తియ్యగుమ్మడి పులుసు తిని చచ్చిపోవాలని నా కోరిక.’’‘‘ఒరే అబ్బాయ్‌.... త్వరగా శాస్త్రిగారికి పులుసు పోసేయ్‌. 

ఆయన కవ తల అర్జెంటు పనుందంట.’’ఆ బావ, బావమరుదులిద్దలిద్దరి ముచ్చట్లు, వాళ్లిద్దరూ భోజనం చేస్తున్న వైనం చూడడానికి, వినడానికి కూడా సరదాగా ఉంది. శంకరం గారు మాకు పాత కస్టమరే. ఈ శాస్త్రిగారే కొత్త వ్యక్తి. పులుసు పోస్తుంటే ‘పెరుగులోకి మరి రెండు ముక్కలు’ అని అడిగాడు.... వేశాను.గుమ్మడి తొక్క పారేసి, ముక్కని పులుసులోనే కలుపుకోబోతూ ఆత్రపడి ఓ ముక్క నోట్లో వేసుకుని అడిగాడు శాస్త్రిగారు ‘‘బావా! పులుసుకి ఈ రుచి ఎక్కడి నుంచి వచ్చిందంటావ్‌? మొదట్లో వేసిన ముక్కల్లోంచా.... పోపులో వేసిన ఇంగువలో నుంచా?’’‘‘కాదోయ్‌ చెవలాయ్‌... చిగుర్న వేసిన కరివేపాకు లోనుంచీ.... కాచిన గిన్నెలోనించీని. గిన్నె అంటే ఏదో అనుకునేవ్‌ .... రాచిప్ప. దానిలో మరిగిన పులుసు, పప వాటి టేస్ట్‌ మరి దేనికీ రాదు. కావాలంటే ఆ కుర్రాణ్ణి కనుక్కో.’’ అంటూ నావైపు చూపించాడు.అవునన్నట్టు తలూపాను నేను.

‘‘మట్టికుండలో నీటి రుచి రిఫ్రిజరేటర్‌ నీళ్లకి ఎలా రాదో.... రాచ్చిప్పలో మరిగిన పులుసు రుచి మరిదేనికీ రాదురా శాస్త్రీ! అసలు ఒక్కో వంటకానికి ఒక్కో పాత్ర, కలియబెట్టడానికి ఒక్కో తరహా వంటకానికి ఒక్కో గరిటె.... తెలుగువాడి టేస్టుకి ఒకటి.... మనవాడి చాదస్తానికి ఒకటి.... నమస్తే!’’‘‘అది సరే బావా! రాచిప్పలు, ఇనప అట్లకాడలు ఈకాలంలో ఈ హోటల్‌ వాడికి ఎక్కడ దొరికాయంటావ్‌?’’‘‘అదేకదా ఈ హోటల్‌ ప్రత్యేకత. వచ్చేటపడు బయట బోర్డు చూడలా ‘తెలుగు ఫలహారం’ అని.... అన్నీ తెలుగు వంటకాలే ఉంటాయిక్కడ.’’‘‘అవును బావా! మావిడికాయ పప మొదలు తిన్నవన్నీ తెలుగు వంటకాలే. పనసపొట్టు కూర, దోసకాయ మూనబద్దల కూర, కాకరకాయ పులుసు కూర, పులిహోర గోంగూర, కొబ్బరిపచ్చడి, పులుసు... అబ్బీ పెరుగు. ఆ... అవును కానీ మొదట్లో అప్పడం వేశాడు. అప్పడం దప్పళం తమిళం వాడివి కానీ తెలుగువి ఎలా అవుతాయ్‌?’’ లాపాయింట్‌ లాగాడు శాస్త్రిగారు.