టీవీకి అతుక్కుపోయిన కళ్యాణి శివాలయానికెళ్లిన తండ్రి తిరిగి వచ్చింది కూడా గమనించలేదు.భర్త రావటం చూచిన అన్నపూర్ణమ్మ వంటింట్లోంచి మంచినీళ్ల గ్లాసుతో హాల్లోకి వచ్చింది. ఫ్యాన్‌ వేసి, మంచినీళ్ల గ్లాసుపతంజలి శాస్ర్తిగారి చేతి కందించింది.‘‘కళ్యాణీ, నాన్నగారు బయట్నుంచి వస్తే మంచినీళ్లు యిచ్చే పన్లేదా? ఎంతసేపూ ఆ టీవీ ముందే కూర్చుంటావా?’’తల్లిమాట కూడా ఆ పిల్ల చెవికెక్కినట్లు లేదు. టీవీలో లీనమై పోయింది.‘‘ఏం పిల్లో, ఏంటో?’’‘‘పోనీవోయ్‌ చిన్న పిల్ల!’’ఒక్కగాని ఒక్క కూతురని ఆయనకు కళ్యాణి అంటే మహాప్రేమ.వుండివుండీ కళ్యాణి, ‘‘అమ్మా, శంకరన్నయ్యే! నాన్నగారూ, మన శంకరన్నయ్య టీ.వీలో కనిపించాడు. చూడండి చూడండీ!’’ ఎక్సయిటింగ్‌గా ఉంది.‘‘అన్నయ్య టీవీలో కనిపించటమేమిటే తల్లీ!’’ అంటూ వాళ్లిద్దరు కూడా టీవీకి కళ్లప్పగించారు...సత్యం కంప్యూటర్స్‌ కంపెనీ కుప్పకూలింది.

ఐటీ రంగానికి రారాజు రామలింగరాజు తన ‘గుట్టు’ విప్పాడు. తన ‘సత్యం’ కంపెనీ ‘అబద్ధాల పుట్ట’ని తేల్చి చెప్పాడు. ఏడు వేల కోట్ల విలువ చేసే ఐటీ కిరీటాన్ని తీసి ప్రక్కన పెట్టాడు. మనందరం ఎక్కించిన రత్న (షేర్ల) ఖచిత సింహాసనం మీద నుంచి క్రిందకు దిగాడు.చెప్పన్ని దేశాల్లో తను ఎగరేసిన ‘సత్యం’ పతాకాన్ని ఒకేసారి దింపేశాడు. మదుపుదారులను ‘ముంచటమే’ కాదు. ప్రపంచ దేశాలను సహితం దిగ్ర్భాంతిలో ముంచేశాడు. షేర్‌ మార్కెట్టును కుదిపేశాడు.‘సత్యం’ షేర్లు కుప్పకూలి మట్టి కరిచాయి. దగాబడ్డ మదుపుదారులు రోడ్డున పడ్డారు.అందులో వాళ్లబ్బాయి భవానీశంకర్‌ కూడా వున్నాడు. అతన్తోపాటు రిటైర్డ్‌ సీనియర్‌ సిటిజన్స్‌, మధ్య తరగతి మహిళలు, సగటు గృహిణులు, ఉద్యోగస్థులు, యువకులూ, షేర్‌బ్రోకర్లూ, చిన్న చిన్న వ్యాపారుస్థులు కూడా వున్నారు.టీవీ ఛానల్స్‌ మైకులు వాళ్లందర్నీ చుట్టిముట్టేశాయి. ఒక ముసలాయన, ‘‘రిటైరయితే వచ్చిన డబ్బంతా ఈ సత్యం షేర్లలో పెట్టాను. ఈ రామలింగరాజు ఇట్టా జనాన్ని ముంచేశాడు. ఈ వయస్సులో నా గతేం కావాలి?’’ అని వాపోతున్నాడు.‘‘గవర్నమెంటు సర్వీసులో వున్న నా భర్త ఏక్సిడెంట్‌లో అకస్మాత్తుగా మరణించాడు. ఆయనకు వచ్చిన డబ్బంతా ఎవరో చెబితే ఈ కంపెనీ షేరుల్లో పెట్టాను. నాకు ముగ్గురు చిన్న పిల్లలు.

ఇప్పుడు వాళ్ల గతేం కావాలి? నా బ్రతుకేం కావాలి?’’ ఒక వితంతువు హృదయ విదారకంగా విలపిస్తోంది.‘‘మా అమ్మాయి పెళ్లికని దాచుకున్న డబ్బంతా ఈ కంపెనీ షేరుల్లో పెట్టాను. ఈ రామలింగరాజు అందర్నీ మోసం చేశారు. వున్నదంతా వూడ్చుకు పోయింది’’ ఒక మధ్య తరగతి గృహిణి మొరపెట్టుకుంటుంది.మైక్‌ భవానీశంకర్‌ ముందుకెళ్లింది. ‘‘పోయిన నెలలో నాగార్జున కంపెనీ, నెల తిరక్కండానే ఈ సత్యం కంప్యూటర్స్‌. ఈ రెండు కంపెనీలల్లో ఇన్వెస్ట్‌ చేసిన నా డబ్బు అయిదు లక్షలూ ‘హుష్‌ కాకి’ అయింది. వుయ్‌ ఆర్‌ ఆల్‌ ఛీటెడ్‌ బై దెమ్‌...’’