కిటికీలోనుంచి బయట కనబడుతున్న పచ్చటి చెట్లను చూస్తూ ఏవేవో మధురమైన ఊహల్లో విహరిస్తున్న ప్రణవ్‌ని పలకరించింది అతని కొలీగ్‌ శాంతి. వాళ్ళిద్దరూ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్‌మెంట్‌లో కౌన్సెలర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. సమస్యలలో ఉన్న స్టూడెంట్స్‌ తమ సమస్యలను నేరుగా గాని, ఫోనులో గాని వాళ్ళతో చర్చిస్తూఉంటారు.‘‘ఏంటి ప్రణవ్‌? ఏదో సీరియస్‌ మేటర్‌లా ఉందే’’ అంది శాంతి కొంటెగా నవ్వుతూ.

‘అబ్బే, అదేం లేదు. అక్క వాళ్ళింటికి వెళ్దామా, లేక మన మెస్‌లోనే డిన్నర్‌ చేద్దామా అని ఆలోచిస్తున్నాను’ అన్నాడు ప్రణవ్‌ తబ్బిబ్బు అవుతూ.‘మా చెవులు ఖాళీగా లేవు, నువ్వు పెట్టే పువ్వులు దాచుకోవడానికి. అయినా ఒక సైకాలజిస్టుతో అబద్ధం చెప్పడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? నమ్ముతాననే అనుకున్నావా?’ అంది అల్లరిగా నవ్వుతూ.తల ఎగరేసి నుదుటి మీద పడుతున్న జుత్తుని వెనక్కి విసురుతూ, మనసారా నవ్వాడు. అతని కళ్ళల్లో మెరుపులు చూస్తూ, ‘ఎంత హాయిగా నవ్వుతాడు! మనసులో ఎలాంటి మర్మంలేని వారికి మాత్రమే అది సాధ్యం. అసలు ఈ నవ్వుకే అమ్మాయిలు ఫిదా అయిపోతారు. కాని వీడు మాత్రం ఎవరికి పడతాడో ఆ దేవుడికే తెలియాలి’ అని మనసులో అనుకుంది శాంతి.

‘కొంచెం చూసి అడుగు వెయ్యి. అందరూ బోర్లా పడేది ఆ దారిలోనే!’ అంటూ హెచ్చరించింది శాంతి.మళ్ళీ నవ్వుతోనే సమాధానం ఇచ్చాడు ప్రణవ్‌.అతనికి మాట్లాడే మూడ్‌ లేదని గ్రహించిన శాంతి తన బ్యాగ్‌ తీసుకుని, చేతికున్న వాచ్‌ చూసుకుని, ‘నేను కొంచెం త్వరగా వెళ్ళాలి. మా ఆయన సినిమా ప్రోగ్రామ్‌ పెట్టాడు ఈ సాయంత్రం. నువ్వు ఇక్కడే ఉంటావుగా..’ అంటూ వెళ్ళిపోయింది, చేతిని గాలిలోకి ఊపి సెలవు తీసుకుంటూ.ఆమె వెళ్ళిన తర్వాత మళ్ళీ తన ఆలోచనలలోకి వెళ్ళిపోయాడు ప్రణవ్‌. కాని శాంతి మాటలు అతని ఆలోచనలను, అనుభూతిని ఆస్వాదించే స్థితి నుంచి ఆ అనుభూతిని విశ్లేషించే స్థాయికి తీసుకెళ్ళాయి. తనను అంతగా తన్మయత్వంలో ముంచిన ఆమె గురించి విశ్లేషించుకో సాగాడు.