‘స్కోడా’ కారు రోడ్డుపైన శరవేగంతో నడుస్తోంది.నిపుణులైన డ్రైవర్లు తప్ప ఎవరూ అంత వేగంగా బండిని నడపలేరు.డ్రైవింగ్‌ చేస్తున్న స్రవంతి రోడ్డుపై వున్న గతుకులను పట్టించుకునే స్థితిలో లేదు.ఆమె మనసు అల్లకల్లోలంగా వుంది...ఊహ తెలిసిన తరువాత ఆమె ఇంత టెన్షన్‌ పడిన దాఖలాలు లేవు....ఖరీదైన కారు కాబట్టి సరిపోయింది కానీ...మామూలు కారయితే ఆమె డ్రైవింగ్‌కి ఎన్నో కుదుపులనిచ్చేది.ఒకవేళ ఎవరైనా వాహనంలో వుంటే వారి ఒళ్ళు హూనమయ్యేది. సడెన్‌గా ఏదో వాహనం అడ్డు రావడంతో క్లచ్‌పై కాలు పెట్టి బ్రేక్‌ నొక్కింది. ‘స్కోడా’ ‘షాకప్‌ జాల్‌’ స్ర్పింగ్‌ యాక్షన్‌ ఇచ్చింది....స్రవంతి మెడలోని మంగళ సూత్రాలు లయబద్ధంగా ఊగాయి...శ్రీరామ్‌ దూరమవుతాడని తెలిసి కూడా తానెందుకు దీన్ని మొయ్యాలి అనుకుంది...ఇక తన మెడలో తాళి వుంటుందా? లేదా? తీయాలా? వద్దా?పదేళ్ళ క్రితం వున్న ఆవేశం ఆమెలో ఇప్పుడు వుంటే తాళి తీసి పక్కన పడేసేందుకు క్షణం కూడా ఆలోచించేది కాదు..తాళి వుంచుకోవడంలో వుండేది నైతికమా? న్యాయమా? రక్షణా? ఏదో తేల్చుకోవడానికి ఆమె మానసిక స్థితి, శక్తి సరిపోవడం లేదు.పదేళ్ళ క్రితం కాలేజీ క్యాంపస్‌లో ‘స్త్రీ వాదం’ పై ఆమె ఇచ్చిన ఉపన్యాసానికి ముగ్ధుడై శ్రీరామ్‌....స్రవంతికి లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.స్రవంతిని చూసి ‘బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’ అనుకొనేవాడు శ్రీరామ్‌.‘‘మనం మ్యారేజ్‌ చేసుకోవడం అనివార్యమా?’’ అడిగింది ఓ రోజు...‘‘అనివార్యమో కాదో నాకు తెలీదు...మీలాంటి వ్యక్తిత్వం వున్న అమ్మాయితో సహజీవనం వేయి జన్మల అదృష్టమవుతుంది.’’ చెప్పాడు శ్రీరామ్‌.

‘‘ఓనర్‌షిప్‌ కోసం వెంపర్లాడుతున్నావా?’’ అడిగింది...‘‘కేవలం పెళ్ళి ద్వారా వచ్చే ఓనర్‌షిప్‌ నావసరం లేదు... మనసు ద్వారా వచ్చేదే కావాలి’’ చెప్పాడు.‘‘మీరు ముసుగేసుకుంటున్నారు...’’‘‘మీరు ఎలా అనుకొన్నా నేను కామెంట్‌ చేయను. ఐ రెస్పెక్ట్‌ యువర్‌ ఫీలింగ్స్‌’’ చెప్పాడు.సంవత్సరం గడిచింది...ఈ సంవత్సరంలో చాలా సార్లు స్రవంతి...శ్రీరామ్‌ శారీరకంగా కూడా ఒకటయ్యారు.శ్రీరామ్‌ స్రవంతి పట్ల ఒకే ఫీలింగ్‌తో వుండేవాడు.ఇద్దరిలో మోహం ఒకే స్థాయిలో వుండేది.శ్రీరామ్‌కి మరో ఇద్దరు ఆడవాళ్ళతో....స్రవంతికి మరో ఇద్దరు మగవాళ్ళతో సంబంధం ఏర్పడింది.తనను నచ్చి.. మెచ్చిన... ఇద్దరు యువకులతో స్రవంతి డేటింగ్‌ చేసింది కానీ...స్రవంతి బోల్డ్‌ నెస్‌కి భయపడి ఆ ఇద్దరూ పారిపోయారు. స్రవంతి కూడా ఆ ఇద్దరితో ‘అన్‌కంఫర్ట్‌బుల్‌’గానే ఫీలయ్యింది.ఏ మధురానుభూతి కూడా ఆమె మనసులో రికార్డు కాలేదు.శ్రీరామ్‌ అలా కాదు. ఆమెతో కలిసిన ప్రతీసారి పునర్జన్మ ఎత్తినట్టు ఫీలయ్యేవాడు.ఇతర ఏ స్త్రీతో లభించని సంతృప్తి...సంతోషం అతడికి కలిగేది...మరో ఏడాది కలిసి సహజీవనం చేసిన తరువాత ఒక రోజు మ్యారేజ్‌ ప్రపోజ్‌ చేశాడు శ్రీరామ్‌.‘‘ఇప్పుడు దాని అవసరమేముంది శ్రీరామ్‌. నీకు అన్నీ గడిచిపోతున్నాయ్‌ కదా?’’ అంది.