ఫోన్‌ మ్రోగింది.రిసీవర్‌ చేతుల్లోకి తీసుకుని, ‘‘యా?’’అన్నాడు రామారావు.‘‘బాబూ!... నేను... ఇండియా నుంచి మాధవయ్యను మాట్లాడుతున్నాను.’’మాధవయ్య గొంతు వినగానే అయిష్టంగా ముఖం పెట్టి,‘‘చెప్పండి?’’ అన్నాడు విసుగ్గా రామారావు.అతని విసుగుని పట్టించుకోనట్టుగా,‘‘కార్యక్రమాలన్నీ అయిపోయాయి నువ్వు చెప్పినట్టుగానే అన్నీ చేశాను. మీ నాన్న కృష్ణమూర్తి, నేను చిన్నప్పట్నుంచీ ప్రాణస్నేహితులం. ఒక్క రోజు కూడా కలవకుండా వుండలేదు. ఇపడు... ఇపడు వాడికి స్వయంగా నేనే యీ దహన సంస్కారాలన్నీ చేస్తాననుకోలేదు. చాలా బాధగా వుంది బాబు,’’ గద్గదికమైంది మాధవయ్య గొంతు.చిరాకేసింది రామారావుకి. కొంచెం తమాయించుకుని, ‘‘ఎవరు చేస్తే ఏం లెండి’’ అన్నాడు నిర్లక్ష్యంగా.రామారావు ధోరణికి తెల్లబోయాడు మాధవయ్య. కోపం వచ్చింది, ‘‘నీ చిన్నతనంలో నువ్వు ఎక్కువగా నా దగ్గరే వుండేవాడివి. ఆ చనువు కొద్దీ అంటున్నాను. ఇలాంటపడు నువ్వలా మాట్లాడ్డం పద్ధతిగా లేదు. కొడుకు, కోడలు వుండి కూడా వాడు అనాథలా వెళ్ళిపోయాడు.’’రామారావుకి అసహనం పెరిగిపోయింది, ‘‘ప్లీజ్‌ మాధవయ్యగారు. ఇపడు దేనికి ఫోన్‌ చేశారో చెప్పండి...’’రామారావు ఎదురుగా వుంటే చాచి కొడదామన్నంత కసిగా వుంది మాధవయ్యకి. అతనికి తండ్రి కొడుకుల మధ్య దూరం గురించి తెలుసు. కృష్ణమూర్తి గుర్తొచ్చాడు. సర్దుకుని అన్నాడు, ‘‘నువ్వొకసారి ఇండియాకి రావాల్సివుంటుంది.’’‘‘వ్వాట్‌?!’’ అరిచాడు, ‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు. ఆయన పోయారంటేనే రాలేదు. ఇపడెందుకు? అన్నీ అయిపోయాయిగా?’’‘‘అయిపోలేదు,’’ ముక్తసరిగా అన్నాడు మాధవయ్య.

‘‘ఏం?’’‘‘కృష్ణమూర్తి పుట్టి పెరిగిన యీ వూళ్ళో ఆ యిల్లు అలాగే వుంది. అది వాడి తర్వాత మీకే వస్తుంది.’’‘‘ఇల్లా.... నేనేం చేసుకోను దాన్ని?’’ హేళనగా అడిగాడు రామారావు.‘‘మీ యిష్టం. ఏమైనా చేసుకోండి.’’‘‘మీరే వుంచుకోండి. అమ్మితే ఎంతొస్తుంది? లక్షా, రెండు లక్షలా?’’ వెటకారంగా అడిగాడు.‘‘రెండు కోట్లు’’మాధవయ్య చెప్పింది విని అదిరిపోయాడు రామారావు. ‘‘మైగాడ్‌!’’ అని గొణిగాడు.‘‘చెప, ఎపడు వస్తావు?’’వెంటనే మాట్లాడలేకపోయాడు. మెల్లగా తేరుకుని హీనమైన కంఠంతో అన్నాడు, ‘‘వీలు చూసుకుని వస్తాను.’’‘‘వచ్చేటపడు నీ కొడుకుని కూడా తీసుకురా,’’ అన్నాడు మాధవయ్య.విస్మయంగా ‘‘వాడెందుకు?’’ అనడిగాడు.‘‘మీ నాన్న వీలునామా ఏమీ వ్రాయలేదు. నువ్వు ఆ యింటికి ఏమైనా చెయ్యాలన్నా,అమ్మాలన్నా నీ కొడుకు సంతకం కూడా వుండాలి. అందుకు.’’్‌ ్‌ ్‌కసిగా ఫోన్‌ పెట్టేశాడు రామారావు.‘‘అయితే మీరు ఇండియాకి వెళ్తున్నారన్నమాట’’ అక్కసుగా అంది జయ.‘‘అంతా విన్నావా?’’‘‘ఆ మాధవయ్య మాటలు వినలేదు. ముందిది చెప్పండి? వెళ్ళడానికే నిర్ణయించుకున్నారా?’’‘‘ఇప్పటి దాకా నేనూ వెళ్ళకూడదనుకున్నాను. కాని వెళ్లాలి తప్పదు,’’ స్పష్టంగా అన్నాడు.‘‘ఎందుకు? వెళ్ళొద్దని నేను చెబుతున్నాను’’ శాసిస్తున్నట్టుగా అంది.‘‘కాని... ఆ యిల్లు...?’’‘‘ఎవడిక్కావాలండి ఆ బోడి యిల్లు? ఎవరికైనా ముష్టి వెయ్యమనండి,’’ యీసడింపుగా అంది.