స్వగతం: ఆ రాత్రి ఉరుములు మెరుపులు ఓ పక్క ఆకాశాన్ని అతలాకుతలం చేస్తుంటే... ఆకులు అలములు దుమ్ము ధూళితో ఈదురుగాలి ఇళ్ల మీద కళ్లలోనూ కమ్ముకొస్తుంటే...ఎంతసేపటికి కరెంటు రాక శాంభవి తలుపులు కిటికీ రెక్కలు బిగించి... కొవ్వొత్తులు వెలిగించి భోజనాల బల్లమీద కంచాలు గ్లాసులు సర్ద సాగింది. శిరీష అప్పటికే తిని నిద్రపోయింది.నేనూ... నానాజీ... ఎదురుబదురుగా కూర్చున్నాం. శాంభవి కొంగు బిగించి వడ్డిస్తూంది. వాడు మౌనంగా ఉన్నాడు. కోపంగా ఉన్నాడు... ఏదో ఘర్షణకు నాందిగా... ఎత్తుగడకోసం ఎదురుచూస్తున్నాడు. అన్నం కలుపుతుంటే కోడలు కొసరికొసరి వడ్డిస్తుంది. ‘‘ఇంకొంచెం వంకాయ వేపుడు వడ్డించేదా మామయ్యా’’ అంది.నేను సమాధానం చెప్పేలోగా నానాజీ ‘‘అన్నీ అక్కడ గుమ్మరించాక పోతే నన్నూ అడగొచ్చుగా’’ అన్నాడు భార్యతో. శాంభవి నిశ్చేష్ఠురాలయింది. కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడని గ్రహించింది. కళ్లతో భర్తని వారించబోయింది. నిర్లక్ష్యంగా తల తిప్పుకున్నాడు.నేనూ తొణక్కుండా బెణక్కుండా తింటూ ‘‘చూడమ్మా ఇక నుంచి వాడికి ముందు వడ్డించు. తన తర్వాతే మనం తిందాం’’ అన్నాను.‘‘అంతేగానీ నా విషయంఫైనలైజ్‌ చెయ్యవన్నమాట’’ అన్నాడు. నేను నిబ్బరంగా ‘‘నువ్వెన్నిసార్లు అడిగినా అదే జవాబు. త...ద...నం..త..రం.. అంతవరకూ నీకు ఆస్తి రాదు. ఊరికే ఆవేశ పడకు’’ అన్నాను.

‘‘తాతపంచిన ఆస్తిని మిగతా అన్నదమ్ముల్తో సమానంగా లాటరీ వేసుకుని తీసుకున్నావు. నా వరకూ వచ్చేసరికి... పంచకుండా ఆస్తి నీ గుప్పిట్లో పెట్టుకున్నావు’’.‘‘మా నాన్న నాకు ఆస్తి పంచాడంటే... నేను ప్రయోజకుడినయ్యాక... అప్పజెప్పాడు. అదికాస్తా మన కుటుంబఖర్చులకి మీ చదువులకి పెళ్లిళ్లకి.. నువ్వు వ్యాపారంలో పోగొట్టడానికి... సరిపోయింది. ఇక మిగిలింది ఏమంత గొప్ప ఆస్తి. ఈ పాత పెంకుటిల్లు! అమ్మితే. ఐదు లక్షలు వస్తే గొప్ప. నా పెన్షన్‌ డబ్బులతో సంసారం గడుస్తూంది. నువ్వు ప్రయోజకుడివై వుంటే కొంత భరోసా ఉండేది. నా వారసుడివి నీ వొక్కడివే. నీకే కదా చివరికి ఈ ఆస్తి. ఎందుకు తొందర?’’ అన్నాను. ఇది వరకు ఇలా ఎన్నోసార్లు చెప్పిన జవాబే!‘‘పదే పదే నేను ప్రయోజకుణ్ని కాలేదని దెప్పి పొడుస్తావెందుకు. దానికి నువ్వూ ఓ కారణం అని గ్రహించు. ఇల్లు అమ్మి ఆ ఐదు లక్షలు నాకిస్తే వ్యాపారంలో పెట్టి వండర్స్‌చేస్తా. ఐదేళ్ల లోపు యాభై లక్షలు చెయ్యగలను’’ అన్నాడు.తండ్రీ కొడుకులు.. ఇద్దరం తినకుండా వాగ్యుద్ధంతో దిగేసరికి శాంభవి భయంగా మా వంక చూసింది. భోం చెయ్యకుండా హఠాత్తుగా కంచాల్లో చేతులు కడిగి లేచి పోతామని కంగారు పడుతుంది. అలా చాలాసార్లు జరిగింది.