ఆమెరాత్రంతా ఎడతెగకుండా సన్నగా వర్షం కురుస్తూనే ఉంది.వర్షం.. వర్షం.. రోడ్లపై, భవనాలపై, చెట్లపై, మురుక్కాలువలపై, హుస్సేన్‌సాగర్‌పై..మంటపైనున్న పెనంవంటి తన మస్తిష్కంపై, మనస్సుపై, బుద్ధిపై.. హృదయంపై... వర్షం.. వర్షం,రాత్రంతా నిదురలేదు. కళ్ళనిండా మంట. కన్నీళ్ళు ఉబికుబికి వస్తున్న దుఃఖం. విద్యుత్తీగకు చిక్కి వేలాడ్తూ గాలికి రెపరెలాడ్తున్న పాతగుడ్డపేలికలా భాషకందని దుఃఖోద్వేగం.తను మితిమీరి గాలి ఊదిన బుడగలా భళ్ళున పగిలిపోతుందా. ఫిలమెంట్‌ రాలిన బల్బులా ఆరిపోతుందా..లేదా చేష్టలుడిగి ఒక రాతి బొమ్మగా మిగిలిపోతుందా‘‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యు’’.. మొన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూలో ‘హిందూ’ విలేఖరి ప్రశ్న.‘‘ఫిప్టీ సిక్స్‌ ఇయర్స్‌ ఓల్డ్‌..’’తన ఏభై ఆరు సంవత్సరాలు పాతబడిపోయింది.. పాతబడిపోయింది తను.ఎందుకో ప్రముఖ స్త్రీవాద రచయిత్రి నీలకు దుఃఖం ముంచుకొచ్చింది.చుట్టూ అంతా చీకటి.. పడకగదినిండా చిక్కని నిశ్శబ్ధం.. బయట సన్నగా చినుకుల చప్పుడు.బెడ్‌లాంపేసి.. టైం చూచి.. ఐదూ ఐదు.అంతుబట్టని అసహనం గర్జిస్తున్న సముద్రంలా ఉంది డుండెలనిండా.లేచి, చెప్పులేసుకుని, గొడుగుపట్టుకుని రోడ్డుపైకొచ్చింది.నడక.. నడకఎక్కడ ఆరంభమైందీ నడక. ఎక్కడిదాక సాగుతుందీ నడక.. ఎక్కడ ఆగుతుందీ నడక.. ఎప్పుడు ఆగు..,‘తప్పు చేసిందా తను?’’ఇరవై ఐదు సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రశ్న.

ఒకవేళ తప్పే ఐతే ఆ తప్పునెందుకు చేసినట్టు.. తప్పేకాకుంటే క్షణం క్షణం అగ్నిపర్వతంవంటి ఈ అంతః క్షోభను నిశ్శబ్దంగా భరిస్తూ, దుఃఖిస్తూ.. సమాజంలో నటిస్తూ, పిల్లలముందు దోషిగా తలవంచుకుని నిలబడ్తూ.. పైకి సత్కారాలూ, పురస్కారాలు పొందుతూ.. ఏమి జీవితమిది.జీవితమంటే నటనా..నటనే జీవితమా.ఒక చేతిలో విప్పిన గొడుగుతో పరధ్యానంగా చినుకుల్లో నడుస్తున్న నీల చటుక్కున మరో చేత్తో ఎడమచెంపను అనాలోచితంగానే తడుముకుంది.అనూహ్యంగా.. వేలమంది సమక్షంలో.. ఎంతో వైభవంగా జరుగుతున్న అభినందన సభలో..తన చెంపను చెళ్ళుమనిపించి.. ముందరున్న మైక్‌ను ఉష పిడుగులు కురిపిస్తున్నట్టు చేసిన ప్రసంగం. బట్టబయలు చేసిన తన నిజస్వరూపం.. పొరలను, తెరలను చించి తూటాలవలె సంధించిన ప్రశ్నల పరంపర..వేలాదిమంది అప్రతిభులై.. అవాక్కయి..నిశ్శబ్ద.. నిశ్శబ్దం.. అందరి కళ్ళలో ఏవగింపు, రోత, అసహ్యం, జుగుప్స-ఒక్కొక్కరే సభాస్థలినుండి బయటకువెళ్లి,చివరికి తను..కిషన్‌ - యిద్దరే..మనిషికి మరణంకన్నా మించిన శిక్ష ఉంటుందా?మరణాన్ని అనుభవించడంకంటే మించిన క్షోభ ఉంటుందా?తప్పకుండా ఉంటుందని తనకు అనుభవమౌతోందిప్పుడు.అసలు నిజానికి తను నిన్ననే రాత్రి దాదాపు తొమ్మిదిగంటల యిరవై నిమిషాలకు మరణించింది.నీలకు దుఃఖం ఎగదన్నుకొస్తోంది.నడుస్తోంది.. లిబర్టీ.. టిటిడీ బిల్డింగ్‌, నారాయణగూడ, మీనాక్షి కాఫీషాప్‌..ఏభై ఆరు సంవత్సరాల పురాతనజీవియైన తను.. పద్దెనిమిదేండ్లకు పెళ్ళి చేసుకుని.. ఒక గుమాస్తాను.. తల్లిదండ్రులు కుదిర్చినవాణ్ణి.. రెండువందల ఏభైరెండు రూపాయలు అతని జీతం.. ఏభై రూపాయల అద్దె ఇల్లు.. సాధారణ జీవితం... నాలుగేళ్ళలో యిద్దరు పిల్లలు.. ఒక మగ ఒక ఆడ..