మబ్బులమాటు లేత సూర్యకిరణాలు - గుబురుగడ్డం లోంచి మెరిసే సోక్రటీస్‌ చిరునవ్వుల్లా ఉన్నాయి. ఈ పోలిక తోచగానే సూరిబాబుకు ఎంతో ముచ్చటేసింది. అతడికి సోక్రటీస్‌ అంటే వల్లమాలిన అభిమానం. సత్యమని నమ్మిన దానికి మనసా, వాచా, కర్మణా కట్టుబడి, వ్యక్తిత్వాన్ని చిరంజీవిని చేసుకుంటూ సోక్రటీస్‌ ఎత్తిన విషపాత్ర - మానవచర్రితలో నిర్మించిన ఏ కట్టడం కన్నా సమున్నతమైందని సూరిబాబు నిశ్చితాభి ప్రాయం. సూరిబాబు ఓ ప్రముఖ దినపత్రికలో స్టాఫ్‌ రిపోర్టర్‌.ఉదయపుటెండ మీద పడుతుండగా అరుగుమీద కూర్చుని కాఫీ తాగుతూ ఎదురుగా రోడ్డవతల ఖాళీ స్థలంలోని మునగ చెట్టుకేసి చూస్తున్నాడు సూరిబాబు. పేరు తెలియని పక్షి గూడుంది దాని మీద. తల్లిపక్షి మేత తెచ్చి గూట్లోని కూనల నోట్లోకి తోస్తోంది. మనుషులైతే గోరుముద్దలంటారు. మరి. ఈ తల్లి పెడుతున్న తిండినేమనాలి? నోరు ముద్దలనాలి కాబోలు!ఎనిమిదిన్నరకి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశముంది. సాధారణంగా ఆ టైములో విలేకరుల సమావేశం పెట్టే వాళ్ళు తినగలిగినన్ని టిఫిన్లు సరఫరా చేయడం ఆనవాయితీ. సూరిబాబు మాత్రం ఇంటి దగ్గరే టిఫిన్‌ తిని వెళతాడు. విలేకరుల సమావేశం పెట్టే వాళ్ళ ఆదరణకు పెదాలను దాటే లోతుండదని అతడికి తెలుసు. వాళ్ళు చెప్పేమాటలు పేపర్లలో బాగా రావాలన్నా తాపత్రయంతోనే కొసరి కొసరి తినమంటారని తెలుసు. అలాంటి కృతక వాతావరణంలో తిండి సహించదు సూరిబాబుకు.‘‘లక్ష్మీ! టిఫిన్‌ తయారైందా?’’‘‘ఇవాళ టిఫినేం చేయడం లేదండీ. రాత్రి అన్నం ఉంటే పులిహోరా చేస్తున్నాను’’ వంటింట్లోంచి చెప్పింది లక్ష్మి.

పులిహోర తింటుండగా అడిగింది లక్ష్మి ‘‘జనరంజని వాళ్ళ ఫ్లాట్‌ తీసుకోవడం గురించి మరోసారి ఆలోచించండి. మిగతా వాళ్ళందరికన్నా చవగ్గా, క్వాలిటీతో కట్టిస్తున్నారట’’.‘‘చూద్దాంలే’’ అన్నాడు గానీ, ఎలా చూడాలో అతడికే అంతుబట్టలేదు.సొంతిల్లు కావాలని లక్ష్మికి ఎంతో కాలం నుంచి తాపత్రయం. సూరిబాబు కన్నా పదేళ్ళు వెనగ్గా జర్నలిజంలోకి వచ్చిన వెంకట్‌ పాతిక లక్షలతో రామారావుపేటలో డూప్లెక్స్‌ ఇల్లు కట్టుకున్నాడు. వెంకట్‌ ఓ సంచలనాత్మక న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌. చూపించే దృశ్యాలకు వచ్చే జీతం కన్నా చూపించని దృశ్యాలకు వచ్చే రాబడి భారీగా ఉంటుందని లక్ష్మి విన్నది. సూరిబాబు జీతానికి మించి ఒక్క రూపాయి ఇంటికి తేలేని ‘ఛాదస్తుడు’ అని లక్ష్మికి తెలుసు. ‘భయం వల్ల గానీ, స్వార్థం వల్ల గానీ - నువ్వు తప్పనుకున్న దాన్ని ఒప్పనీ, అబద్ధమనుకున్న దాన్ని నిజమనీ అంగీకరిస్తే - ఆ క్షణంలోనే నిన్ను నువ్వు చంపుకున్నట్టు’ అన్న సోక్రటీస్‌ మాటలకు ప్రపంచంలోనే అత్యంత మధురమైన బాణీని విన్నట్టు పులకించిపోయే సూరిబాబు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని అదనపు సంపాదన చేయగలడని లక్ష్మి అనుకోవడం లేదు. కానీ, తెస్తే బాగుండునన్న ఆశ ఉంది. సొంతిల్లు లేదు. స్థలం లేదు. బ్యాంకుల్లో నిల్వల్లేవు. ఇంటర్‌ చదువుతున్న కూతురు డాక్టర్‌ కావాలని ముచ్చట పడుతోంది. దాహానికీ, ఎసరుకీ, స్నానానికీ చెంబుడు నీళ్ళు ఎలా సరిపోతాయి? తమ అవసరాలు తీరాలన్న, కోరికలు నెరవేరాలన్నా భర్త జీతం చాలదు. మరో రకంగా సంపాదించడానికి అతడు ససేమిరా అంటాడు. లోకమంతా పై సంపాదనను సమర్థతకు రుజువుగా ఆమోదించేసినా ఈ మనిషి మాత్రం నూతిలో కప్పలా ‘నీతే’ లోకం అనుకుంటాడు. నిట్టూర్చింది లక్ష్మి.