‘‘పైడమ్మా పాపగారొచ్చారు.’’ గట్టిగా అరచి అక్కడే మట్టి అరుగుపై తుండుతో దులిపి చతికిలబడ్డాడు సింహాద్రి. రాత్రి మామిడి తోటకు కాపలాకెళ్ళినవాడు ఇప్పుడే తిరిగొస్తూ ఈ కబురు మోసుకొచ్చాడు.పైడమ్మ గదిలోంచి ఒక్క వుదుటన బయిటకొచ్చి చుట్టూ కలయ చూసి ‘‘ఏరి పాపగారు?’’ అంది. వెనుకనే వచ్చిన మహాలక్ష్మి తల్లి కొంగు పట్టుకు లాగుతో ‘‘ఎవులమ్మా?’’ అంది.సింహాద్రి గట్టిగా నవ్వాడు. ‘‘మనింటికి కాదెయ్‌. మునిసబుగారింటికి. నేనా ఈదిలోంచొస్తోంటే అగపడింది.’’పైడమ్మకు మనసు నిలకడ తప్పింది. ‘‘ఇప్పుడే చూసొత్తా.’’ అంటూ పైటతో మొహాన్ని గట్టిగా తుడుచుకుంది.‘‘మరి నేనో-’’ అంది మహాలక్ష్మి.‘‘నువ్వు పుట్టినాకా పాపగారు నిన్ను చూడలేదు. చూపిస్తాను దా.’’ మహలక్ష్మిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది.‘‘బేగొచ్చెయ్‌. ఆలీసం చెయ్యకు’’ అన్నాడు సింహాద్రి వైడమ్మ ఇంక ఆగదని తెలిసి.‘‘వొస్తాలే. చల్దన్నం కంచంలోనే వుంది తినెయ్‌’’ ఆగకుండా అడుగులు ముందుకు వేసింది పైడమ్మ.మునసబుగారింటికి వెళ్ళాలంటే నాలుగు వీధులు దాటాలి. మెయిన్‌ రోడ్డుకు దగ్గరగా వుంటుంది. వీధిగోడకానుకుని ముందూ వెనుకా అరుగులు, లోపల నాలుగు కొబ్బరి చెట్లతో కొంచెం ఖాళీ స్థలం, అందులో ఎదురెదురుగా రెండు సిమ్మెంటు బెంచీలు, ఇంటి మధ్యలో పెద్ద సింహ ద్వారం, చూడ్డానికి చాలా అందంగా వుంటుంది ఆ ఇల్లు. తన చిన్నతనంలో ఆ ఇల్లును చూడ్డానికే రోజూ తల్లి మంగమ్మతో కలసి వెళ్ళేది. మంగమ్మ ఇంటి పని చేస్తోంటే వెనగ్గా తల్లి కొంగు పట్టుకుని ఇల్లంతా తిరిగేది.ఒకరోజు అలా తల్లివెంట వెళ్లి పెరటి బావి దగ్గరా, పసువులకొట్టంలోనూ తిరుగుతోంటే, వెనుక వంటింటి గుమ్మం తలుపునానుకుని, రెండు జళ్ళతో, పట్టుపరికణీలో మరో అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి కూడా తనకేసి కొత్తగా వింతగా చూస్తోంటే ‘‘ఎవులే అమ్మా పాప?’’ అనడిగింది తల్లిని.

మంగమ్మ నవ్వుతో చెప్పింది. ‘‘మన పాపగారేయ్‌. మున్సెబుగారి అమ్మాయిగోరు సుందరమ్మగారి పాప. రాత్రొచ్చినారుగాల్న.’’మరో పది నిముషాలకు సుందరమ్మగారితో పాప కూడా గుమ్మం దాటొచ్చింది. పైడమ్మ నవ్వితే తనూ నవ్వింది. అరగంటలో ఇద్దరూ స్నేహితుల్లా పెరటి తోటలో చెట్ల కింద ఆటలాడుకున్నారు. అప్పుడు మునసబు గారి ఇల్లు కన్నా పాప ముఖ్యమయిపోయింది పైడమ్మకు. పాప వున్న నెలరోజులూ రెండుపూటలా వచ్చింది. పాపకు తనకు తెలిసున్న ఆటలు నేర్పింది. తను పాప దగ్గరనుండి తల దువ్వుకుని జడేసుకోవాలని, బట్టలు సుభ్రంగా వుండాలని ఎన్నో నేర్చుకుంది. సుందరమ్మ గారిచ్చిన పాప పాతబట్టలు ఎంతో ఆప్యాయంగా కట్టుకుంది. ‘‘ఓలమ్మో పాపమ్మగార్ని చూసి ఎన్ని నేర్చేసుకుందో మన గుంటది!’’ అని ఆశ్చర్యపోయేది మంగమ్మ.పాప ఊరెళ్ళిపోయే రోజున పైడమ్మ అదేపనిగా ఏడ్చింది. పాప కూడా అంతే. ‘‘పాపగోరు మళ్ళొస్తారులేయే’’ అంది మంగమ్మ కూతురు ఏడుపు ఆపించడానికి. అప్పుడే సుందరమ్మగారు ఒక మాటన్నారు. ‘‘పైడమ్మా ఒక మాట అడగాలనుకుంటున్నాను, ఏం అనుకోవుగదా?’’