‘‘నువ్వు నాకు దొరకడాన్ని మించిన అదృష్టం లేదు నా జీవితంలో’’ అన్నాడు భార్గవ ఇందుమతిని దగ్గరకు తీసుకుంటూ.‘‘రోజుకోసారి ఈ మాటనకపోతే రోజూ గడవదుగా మీకు! అయినా నేను మీకు దొరకడఁవేవిటి! మీరే నాకు దొరికిన అదృష్టం’’ అంది ఇందుమతి అతడినుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తూ.‘‘ఈ విషయంలో మాత్రం నీతో నేను ఏకీభవించను’’ అన్నాడు భార్గవ.‘‘మీరొప్పుకోనంత మాత్రాన నిజం నిజం కాకుండా పోతుందా? నా స్నేహితురాలు విజయను చూసుకుందుకొచ్చిన పెళ్ళికొడుకు స్నేహితుడిగా మీరొచ్చినప్పుడు మిమ్మల్నిచూసి ఇష్టపడి మీకు గేలంవేసి మా వాళ్ళను ఒప్పించిమిమ్మల్ని నా కొంగుకు కట్టుకున్నది నేనే కదా!’’‘‘అలాఅని నువ్వనుకుంటున్నావు. కానీ నా స్నేహితుడికి తోడుగా పెళ్ళిచూపుల కొచ్చినప్పుడు వాడు నీ స్నేహితురాల్నీ, ఇరుపక్షాల పెద్దలూ వాళ్ళిద్దర్నీ చూస్తోంటే పెళ్ళి చూపులేర్పాటు చేసిన హాలుకు వెనుక ఉన్న గది కిటికీలోంచి నువ్వు పెళ్ళిచూపులు తతంగాన్ని చూస్తోన్న సమయంలో నేను నిన్ను చూసి మనసు పారేసుకుని తర్వాత నువ్వు మీ పెద్దల ద్వారా నాతో పెళ్ళి రాయబారాలు నడిపించినప్పుడు నాకేఁవీ తెలియనట్టుగా నువ్వే నా వలలో వచ్చి పడేలా చేసుకున్నానని నేను చెప్పినా నువ్వు నమ్మకపోతే నేనేం చేయను?’’ అన్నాడు భార్గవ అల్లరిగా.‘‘సరే... సరే.... మీరూ నేనూ ఇద్దరమూ అదృష్టవంతులమే! ఈ రోజు మనం మన అదృష్టాల గురించి కాక మనమ్మాయి హిమజ అదృష్టం గురించి మాట్లాడు కోవాలేమో అనిపిస్తోంది’’ అంది ఇందుమతి.

కనుబొమ్మలెగరేస్తూ, ‘‘హిమజ అదృష్టం గురించి ప్రత్యేకంగా మాట్లాడేందుకే వుందీ?! అదృష్టవంతులైన భార్యాభర్తలకు పుట్టిన పిల్లలు కూడా అదృష్టవంతులే అవుతారుగా!’’ అన్నాడు భార్గవ ప్రశ్నార్థకంగా చూస్తూ.‘‘నేను మీలానే అనుకున్నాను నిన్నటివరకూ. కానీ నిన్న హిమజ గదిలో బీరువా సర్దుతోంటే దొరికిందిది. ఇతరుల డైరీలు చదవడం తప్పని తెలిసినా నా కన్న కూతురి డైరీ చదవడం ఘోరాపరాధమేమీ కాదని సరిపెట్టుకుని చదవడం మంచిదే అయిందనిపిస్తోంది. మీరు చదవండి. నా మాటల కర్థఁవేవిటో తెలుస్తుంది’’ అంటూ అలమరలోంచి డైరీని తీసి భార్గవకు అందించింది ఇందుమతి.భార్య చేతిలోంచి డైరీని అందుకుని తెరిచాడు భార్గవ జులై 8: ఈరోజు కావ్య, శృతి, నేనూ క్లాసు ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళాం. సినిమా జరుగుతున్నంత సేపూ కావ్య, శృతి ఏదోఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళసలు సినిమా చూడ్డానికొచ్చారో, కబుర్లు చెప్పుకుందుకొచ్చారో నాకు అర్థం కాలేదు.ఒకానొక సమయంలో మా వెనుక సీట్లో కూర్చున్న వాళ్ళు. ‘బయటకు వెళ్ళి మాట్లాడుకోమని’ వాళ్ళను విసుక్కున్నారు కూడా. కాస్సేపు గొంతు తగ్గించి మాట్లాడుకున్నా మళ్ళీ మామూలుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు వాళ్ళు. చిత్రంగా వాళ్ళ మాటల్లో చూస్తోన్న సినిమాకు సంబంధించిన మాటలు తక్కువా. ఇతర విషయాలు ఎక్కువా వినిపించాయ నాకు.