‘‘శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ సాధారణంగా లేటవదు. ఒక్కొక్కసారి ఐదు నిమిషాలు ముందుగానే వచ్చేస్తుంది. నువ్వు త్వరగా తయారవ్వాలి’’ అంది అపర్ణ వాళ్ళమ్మ అన్నపూర్ణమ్మతో.‘‘నేను తయారవుతున్నాను లేవే... నువ్వు మరీ మరీ తొందరపెట్టకు.. ఇంకా గంట టైముంది కదా...’’ అంది అన్నపూర్ణమ్మ సూట్‌కేసులో చీరలు సర్దుకుంటూ.అన్నపూర్ణమ్మ వాళ్ల చెల్లెలు పెళ్ళికని వాళ్ళు ఖమ్మం వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు.ఆరోజు ఉదయమే వాళ్ళు ఖమ్మం వెళ్దామనుకున్నారు. కానీ అపర్ణ ‘‘పెళ్ళి రాత్రికి కదా... ఒకరోజు లీవ్‌ వేస్ట్‌ చెయ్యడమెందుకు? నేను ఆఫీసుకెళ్ళొచ్చాక హాయిగా శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో వెళ్దాం’’ అని వాళ్ళమ్మతో చెప్పేసి తను పనిచేస్తున్న బ్యాంకుకు వెళ్ళిపోయింది.‘‘మీరిలాగే సర్దుతూ కూర్చుంటే ట్రెయిన్‌ కాస్తా వెళ్ళిపోతుంది.

 త్వరగా తెమలండి’’ అన్నాడు రామచంద్రయ్య - అపర్ణవాళ్ళ నాన్న.‘‘మీరు కూడా తొందరపెట్టడం మొదలెట్టారా? మీరెక్కడికీ రారు. ఇంట్లో కూర్చొని మమ్మల్నిలా తొందరపెడ్తుంటారు’’ అంది అన్నపూర్ణమ్మ.‘‘అందరూ వెళ్తే ఇంటి కావలెవరుంటారు? ఇంటికి తాళం వేసిపోతే దొంగలు పడి దోచుకుపోవడం చూస్తూనే ఉన్నాం కదా!’’ అన్నాడు రామచంద్రయ్య.‘‘మీకదో నెపం... ఒక్కరాత్రికేం కాదు.. మీకెక్కడికీ రాబుద్ధి కాదులెండి.. పదవే అపర్ణ... నేను రెడీ’’ అంది అన్నపూర్ణమ్మ సూట్‌కేసు చేతిలో పట్టుకొని, హ్యాండ్‌బ్యాగ్‌తో అపర్ణ కూడా రెడీ అయ్యింది.‘‘ఇల్లు జాగ్రత్త... పడుకునేముందు తలుపులన్నీ సరిగ్గా మూసేసి పడుకొండి... మేం వెళ్ళొస్తాం’’ అంది అన్నపూర్ణమ్మ.‘‘సరె... సరె’’ అన్నాడు రామచంద్రయ్య.వాళ్ళిద్దరు రోడ్డుమీదకు రాగానే ఓ ఖాళీ ఆటో కనిపించింది. దాంట్లో ఎక్కేసి ట్రెయిన్‌ రావటానికి 15 నిమిషాలు ముందుగానే వాళ్ళు కాజీపేట స్టేషన్‌ చేరుకున్నారు.టికెట్స్‌ తీసుకొని ఫ్లాట్‌ఫాం మీదకు రాగానే ‘‘శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ మరికాసేపట్లో ఒకటవ నెంబరు ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చును’’ అన్న ప్రకటన మైకులోంచి వినిపించింది.ట్రెయిన్‌ ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి ఆగగానే వాళ్ళు కాస్త ఖాళీగా కనిపించిన కంపార్ట్‌మెంట్‌లోకి చేరిపోయారు.

వాళ్ళకు సీట్లు కూడా దొరికాయి.‘‘థాంగ్గాడ్‌... సీట్లు దొరుకుతాయో లేదోనని భయపడ్డాను’’ అంటూ అపర్ణ కంపార్ట్‌మెంట్‌ మధ్యలో కిటీకీ పక్కనే ఉన్న సీట్లో కూర్చుంటూ అన్నపూర్ణమ్మను తన పక్కనే ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోపెట్టుకుంది.కాస్సేపట్లోనే ట్రెయిన్‌ కదిలి స్పీడందుకుంది. అపర్ణకు తన ముందున్న సీట్లో కూర్చున్న యువదంపతుల మీదకు దృష్టి మళ్ళింది.అతడు లాప్‌టాప్‌ ముందు పెట్టుకొని కీబోర్డు మీద వేళ్ళను కదిలిస్తూ మానిటర్‌ గమనిస్తున్నాడు. ఆమె యేదో తెలుగు మ్యాగజైన్‌ పేజీలు తిప్పేస్తోంది.కాస్సేపటి వరకు అపర్ణ ఆ దంపతులను పట్టించుకోలేదు. ఒక విషయం మాత్రం ఆమెను ఆశ్చర్యపరచింది.

అతడేమో చాలా అందగాడిలా... ముట్టుకుంటే మాసిపోతాడేమోనన్నంత సున్నితంగా కనిపించాడు. ఆమేమో అతి మామూలుగా కనిపించింది. అంత హ్యాండ్‌సమ్‌గైకి ఇంత ఆర్డినరీ ఉమన్‌ భార్య కావడమేమిటి? అని అపర్ణ ఒక్కక్షణం ఆశ్చర్యపడింది. తర్వాత తనూ తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న ఓ మేగజైన్‌ తీసి పేజీలు తిరగెయ్యసాగింది. కానీ ఆమె చూపులు ఆ మేగజైన్‌ మీద నిలువలేదు. అతడ్ని మరోసారి చూడాలనిపించింది.