కాలుతున్న ప్లాస్టిక్‌ కాగితాలను పట్టుకున్నట్టు వేళ్ళు భగ్గుమన్నాయి. నరనరాల్లో వ్యాపించిన వేడి, గుండెల్లో ఆవిర్లు కక్కుతోంది. ముచ్చెమటల్ని అద్దుకోవాలని ఎంత ప్రయత్నించినా, జేబులో నించి చేతిని బయటకు తీయలేక పోయాడు డాక్టర్‌ దయానంద్‌. కర్చీఫ్‌కి అంటుకుని వున్న పచ్చనోట్ల స్పర్శకు, దయానంద్‌ వేళ్ళు బలహీనంగా వొణుకుతున్నాయి. అలాగే నిస్సత్తువగా నుదురు అద్దుకున్నాడు. తిరిగి జేబులో పెట్టబోతున్న చెయ్యి అప్రయత్నంగా ఆగిపోయింది.సెగలు కక్కుతున్న పచ్చనోట్ల వేడికి, భయపడి కాదు. దానిని సంపాదించి పెట్టిన తన అమానుష ప్రవర్తనకి తట్టుకోలేకా కాదు.మానవత్వాన్నే మసి చేసిన మనసుకు సమాధానం చెప్పుకోలేక-వృత్తి ధర్మానికే తిలోదకాలిచ్చిన-తన ప్రవృత్తిని సమాధాన పరచలేక-నీరసంగా కూర్చుండి పోయిన డాక్టర్‌ దయానంద్‌ భారాన్ని మోయటం ఇష్టం లేనట్టు, ఇబ్బందిగా కదిలింది రివాల్వింగ్‌ ఛైర్‌.సీలింగ్‌ ఫ్యాన్‌ రివ్వున తిరుగుతున్నా, చెమటను ఆపలేకపోతోంది. పేషెంట్‌ తాలూకు అటెండెంట్సుని సమాధాన పరుస్తునన సిస్టర్‌ మాటలు లీలగా విన్పిస్తున్నాయి.‘‘మీరు బాబును తీసుకు రావటమే చాలా సీరియస్‌ కండిషన్లో తెచ్చారు. నిజానికి ప్రైవేట్‌ డాక్టర్లెవ్వరూ ఇటువంటి కేసును తీసుకోరు. ఎటుపోయి ఎటొచ్చినా ఇటు డాక్టర్లకీ, హాస్పిటల్‌కి కూడా చెడ్డపేరే కదా. పాపం మీ మీద జాలితో డాక్టర్‌ గారింత శ్రమ తీసుకున్నారు. మరో హాస్పిటలైతే-ఎన్నోవేలు ఖర్చవుతుంది. మీరు ఖర్చులు భరించలేరనే ఖరీదైన మందులు కూడా సొంత డబ్బుతో తెప్పించి వాడారు. ఎంత చేస్తే ఏం లాభం? ఇరవై నాలుగ్గంటల్లో ప్రాణాలు తీసే మాయదారి జబ్బొచ్చి పడింది.-’’బైట సిస్టర్‌ చిలక పలుకులు పలుకుతోంది.డాక్టర్‌ దయానంద్‌ నిస్సత్తువతో తల వంచుకున్నాడు. ఇటువంటి సంఘటనలతనికి అరుదు కాకపోయినా,-ఈసారి- ఈరోజు..-ఈ సంఘటన ఎందుకో గుండెల్ని పిండి వేస్తోంది. ఎప్పుడూ లేని పాపభీతి చిత్రంగా అతడిని చుట్టుముడుతోంది.

 వికృతమైన బొమ్మకి ఆకర్షణీయమైన రంగులు వేసి అందంగా చూపించాలని ప్రయత్నిస్తోంది సిస్టర్‌. అంతకన్నా భయంకరమైన సత్యానికి, అసత్యపు పూత పూసి తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తోంది.‘‘డాక్టర్‌గారు దేముడిలాంటోరు కనుకనే ఈ వరదాకా తిండీ తిప్పలూ మాని మాలాంటి పేదల కోసం సెమపడ్డారు-కట్టసుకాలు తెలిసిన మారాజు కనకే సొంత డబ్బులు మందుల కోసం కరుచుపెట్టారు..-నరసమ్మా..- ఆయననేం అనటంలా, నిన్ను అనటంలా-మా కరమకి బాధ పడుతున్నాం. ఒక్క నలుసును ఇచ్చినట్టే ఇచ్చి లాక్కెల్లి పోయిన ఆ దేముడిని అంటున్నాము.-దయానంద్‌ నిస్తేజంగా వింటున్నాడు. ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుని కూడా తన మీద సడలని వాళ్ళ నమ్మకం తనని దహించి వేస్తోంది. తనని దేముడ్ని చేస్తున్న వాళ్ళ మంచితనం తన గుండెను పిండి చేస్తోంది.-తప్పంతా దేముడి మీదకే నెట్టిన వాళ్ళ మంచిమనసులూ, అమాయకత్వం, భరించరానిదిగా వుంది..-