అప్పారావు బరంపురంలో తన పని ముగించుకునేసరికి మధ్యాహ్నం రెండు పైనే అయ్యింది. ఏప్రిల్‌ మూడోవారం అవటం మూలాన ఎండ తీవ్రంగానే వుంది. భోంచేసి కాసేపు నడుం వాల్చాడు. ఆ సాయంత్రం బండి ప్రయాణం మొదలెడితే తన ఊరు చేరుకునేది మరసటి రోజు తెల్లవారు ఝూమున. ఇది పందొమ్మిది వందల పదవ సంవత్సరమన్న మాట. అప్పారావు కప్పుడు నలభై ఎనిమిది ఏళ్లు. కాస్త సేద తీర్చుకుంటే తప్ప రాత్రంతా ఎగుడుదిగుడు బాటలో బండి ప్రయాణం కష్టం.అప్పారావు నిద్రలేచేసరికి పాపయ్య బండి సిద్ధం చేసి ఉంచాడు. హోల్డాల్‌ పాపయ్య చేతికిచ్చి బండివైపు నడిచాడు. నడుస్తూ జుబ్బా తడిమి చూసుకున్నాడు, తను కొన్న ముత్యాలసరం మరిచిపోలేదని నిర్ధారించుకునేందుకు. బండి ఎక్కుతూ పాపయ్య మొహంలో సంశయాన్ని గమనించి విషయమేమిటని అడిగాడు. ‘‘మనూరబ్బాయి..అదే కర్నం గారబ్బాయి.. మన బండిలో రావచ్చా అనడిగాడు అయ్యగారండీ..’’ బదులిచ్చాడు పాపయ్య. ‘‘దాన్దేముంది, రమ్మను’’అంటూ అనుమతిచ్చాడు అప్పారావు. పాపయ్య ఇచ్చిన సైగ చూసాడో ఏమో ఠక్కున ప్రత్యక్షమయ్యాడు రామనాథం. పద్దెనిమిదేళ్లు రామనాథానికి. అతని సంచి అందుకుని ‘‘నన్నే అడగొచ్చుగా యంగ్‌ మ్యాన్‌’’ అంటూ బండిలోకి ఆహ్వానించాడు అప్పారావు. ‘‘పంతులుగారూ, మీకు ఇబ్బందేం వుండదుగా?’’ అన్న రామనాథం వైపు నవ్వుతూ చూస్తూ ‘‘యాబ్సొల్యూట్లీ నాట్‌ మై బాయ్‌.. చదువెలా సాగుతోంది?’’ అని ప్రశ్నించాడు అప్పారావు.

 రామనాథం చదువుతోంది మద్రాసు ప్రెసిడెన్సీ కాలే జ్‌లో.పాపయ్యకి ఏ దారిలో వెళ్లాలో చెప్పి, దీపంలో నూనె, కడవలో నీళ్లు, ఎడ్లకి గడ్డీ తగినన్ని వున్నాయని రూఢి చేసుకుని, రామనాథం వైపు తిరిగి, తన చేతిలోని పుస్తకం చూపిస్తూ, ‘‘నువ్వు సైన్స్‌ స్టూడెంట్‌వని విన్నా. అయినా ఒకటో రెండో ల్యాంగ్వేజ్‌ సబ్జెక్ట్స్‌ కూడా వుంటాయిగా. గ్రీక్‌ మిథాలజీ చదివావటోయ్‌’’ అని ప్రశ్నించాడు రామనాథాన్ని అప్పారావు.‘‘అబ్బే లేదండీ, వచ్చే ఏడు ఉంటుందేమో.’’‘‘వున్నా లేకపోయినా గ్రంథాలయంలో చదవాలోయ్‌. ఇది చూడూ, డామన్‌-పిథియస్‌ కథ. అద్భుతంగా ఉంది. మన కథలకేం తీసిపోవు. వాళ్లవిటు వైపు మనవి అటు వైపూ కదిలేతేనే కదా పురోగతి’’ అన్నాడు అప్పారావు.బండి అప్పటికే వేగం పుంజుకుంది. వీస్తున్న చల్లగాలి వల్లేమో రామనాథానికి అప్పుడే కునుకు మొదలయ్యింది. అది గమనించి అడిగాడు అప్పారావు ‘‘రాత్రి బయలు నాటకానికి వెళ్లావటోయ్‌?.’’‘‘లేదండీ, నిన్నటి బ్రహ్మ సమాజం వారి కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకుడిగా సహాయం చేసాను. సమావేశం తర్వాత మాకు పని సుమారుగానే వుండింది.’’‘‘అయితే నన్ను చూసే ఉంటావు అక్కడ’’‘‘అవునండీ పంతులుగారు. ఆ ఉపన్యాసాలన్నీ నాకు పూర్తిగా అర్థం కాలేదండి. అన్నట్టు, ఈసారి సహపంక్తి భోజనం ఎలా జరిగిందండీ? ఇలా భిన్న కులాలవారు కలిసి మెలిసి వుండే రోజు ఎప్పుడొస్తుంది మాస్టారూ?’’