తండ్రి తనను ప్రేమిస్తున్నాడని నమ్మడం పదిహేనేళ్ల వయసులో రాధాకృష్టకే కాక అదే వయసులో వుండీ తరువాతి తరానికి చెందిన జస్వంత్‌కి కూడా కష్టం కావచ్చు. తరాలు మారినా గానీ పాత్రలు వేరయినాగానీ సమాజంలో పరిణామంవల్ల, సంఘంలో స్థానం వల్ల ఆశల్లో, ఆశయాల్లో, భావోద్వేగాల్లో మార్పులు చోటుచేసుకున్నా కూడా మానవ సంబంధాల గూర్చిన కొన్ని అభిప్రాయాలు మాత్రం రుజువులు చూపనిదే మారేవికావు.‘‘ఎప్పుడు చూసినా ఆ వీడియో గేమ్స్‌. కంప్యూటర్లోనో, ఎక్స్‌బాక్స్‌లోనో, గేంబాయ్‌లోనో, ఎన్ని సార్లు చెప్పాలి?’’ ఇంట్లో అడుగు పెడుతూనే కోపంగా అరిచాడు టెలీకాం కంపెనీలో చీఫ్‌ ఇంజనీర్‌ రాధాకృష్ణ, కొడుకు జస్వంత్‌ మీద.‘‘ఆ వెధవ తెలుగు పుస్తకాలు చదివితే ఏ మొస్తుందీ? ఏ షేక్స్‌పియర్‌వో, బెర్నార్డ్‌షావో పుస్తకాలు చదువు. కొంచెం ఇంగ్లీషయినా వంట బడుతుంది’’ అన్నాడు ఎల్డీసీ వెంకట్రావ్‌ ఇంటికి రాగానే కొడుకు రాధాకృష్ణ చేతిలోవున్న తెలుగు వారపత్రికని చూసి.‘‘ఇప్పుడేగా మొదలు పెట్టిందీ?’’ పెద్దగానే జవాబిచ్చాడు పదిహేనేళ్ల జస్వంత్‌ హారీపాటర్‌ గేమ్‌ మీద కాన్సంట్రేషన్‌ని ఏమాత్రం తగ్గనివ్వకుండా.‘‘కార్టూన్లు చూడడానికని ఇప్పుడే అమ్మదగ్గరినుంచీ తీసుకున్నాను’’ అన్నాడు పదిహేనేళ్ల రాధాకృష్ణ అంటూనే ఆ పత్రికలో యర్రంశెట్టి శాయి డైలాగ్‌ ఒకటి గుర్తుకొచ్చి ఫక్కున నవ్వాడు.‘‘అసలు దాన్ని కొనిపెట్టినందుకు నాకు బుద్ధిలేదు. అయినా నిన్నని ఏం లాభం? రాజారెడ్డి వాళ్లింట్లో చూసిన దగ్గరినుంచీ కొనమని పోరిందే, మీ అమ్మననాలి. ఏదో ఒక రోజున వాటిని గోడకేసి పగులకొడతాను పీడా విరుగుతుంది.’ అన్నాడు చీఫ్‌ ఇంజనీర్‌ రాధాకృష్ణ.

‘‘ఇంట్లో కొనకపోయినా ఎక్కణ్నుంచో పట్టుకొస్తుంది మీ అమ్మ ఆ వెధవ పుస్తకాలని! ఏముంటయ్యందులో? ఒక భాషలేదు, సంస్కృతిలేదు, విజ్ఞానం సంగతి సరేసరి. ఏదో ఒకరోజు వీటిని తగులబెడతాను. అప్పుడు కుదురుతుంది తిక్క!’’ కొడుకు ఆ పత్రికను చదువుతున్నాడనే కాక పైగా నవ్వినందుకు కోపమొచ్చింది వెంకట్రావుకి.‘‘ఆ. పగుల కొట్టండి. మీడబ్బులేగా! అప్పటినుంచీ ఆ రాజారెడ్డి గారింటికి వెళ్లినప్పుడల్లా వాటి మొహం చూడనివాడిలాగా, ఏమీ లేనివాళ్లల్లాగా మొహం వాచినట్లు ఆ వీడియో గేంసుకే మీ అబ్బాయి అతుక్కుపోతే మీకు పరువుగా వుంటుంది.’’ చికాగ్గా అన్నది చీఫ్‌ ఇంజనీర్‌ భార్య మంజరి.‘‘తగుల బెట్టడానికి అవి మన పుస్తకాలు కావు. సీతమ్మగారు వాళ్లవి.’’ అన్నది వెంకట్రావు భార్య జయమ్మ మెల్లగా.‘‘అరె. వాడికర్థం కాకపోతే నీకేమయ్యింది? రెండేళ్ళలో ఐఐటి ఎంట్రన్సు రాయాలి. వాటిల్లో నెగ్గాలంటే ఇప్పటినుంచీ చదవకపోతే ఎట్లా? వాటిల్లో నెగ్గడం మాటటుంచు- కనీసం రామయ్య కాలేజీలో అయినా ఎంట్రన్స్‌ పాస్‌ అయి ఆ ఐఐటి కోచింగ్‌కయినా సీటు సంపాదించుకో గలుగుతాడా? ఈ వీడియో గేమ్స్‌లో ఉన్న శ్రద్ద చదువులో ఏది? వీటిల్లో పరీక్షలు పెడితే మాత్రం నీ కొడుకు ఫస్టొస్తాడు!’’