రమ్యఏరోజైతే నా మెళ్లో మూడుముళ్లు వేసావో.. ఆరోజే నేను నీ సొంతమైపోయా. మరో ఆలోచనంటూ లేకుండా నా నూరేళ్ల సహచరుడిగా జీవితంలోకి సాదరంగా స్వాగతించా.. ప్రతి రాతిరి జాతరలో రతిరాణిలా నిన్ను అలరిస్తూ నన్ను నేను సంపూర్ణంగా అంకితం చేసా. తపనల తనువుని తనివి తీరా అర్పిస్తూ, మధురోహల మనసుని మనసా వాచా సమర్పించేసా... నాకంటూ ఏదీ లేకుండా సర్వం నీ పరం చేసేసా... అంతలా నిన్ను నే ఆరాధిస్తుంటే.. నాకు నువ్వేం చేశావ్?-నందినికాలింగ్ బజ్జర్ మోగింది.అంతరాత్రివేళ ఇంత చొరవగా గడపతొక్కే ధైర్యం ఇంకెవరికుంటుంది?ఒక్క నా మొగుడికి తప్ప.‘ఆ మిడ్‌నైట్ గెస్ట్... నా ప్రియమైన హజ్బెండే...’ బలవంతంగా నిద్రమత్తు వదిలించుకుంటూ తలుపు తీసేందుకు సమాయత్తమైంది.టైం చూస్తే... రాత్రి రెండుగంటలు.ఇంతలో మళ్లీ బెల్ మోగింది... ఆ ధ్వనిలో కిషోర్ అసహనం వ్యక్తమవుతోంది.‘‘ఇదిగో వస్తున్నా..’’ లోగొంతుతో నెమ్మదిగా అంటే బయటకు వినిపించదు. కాస్త గట్టిగా అరిస్తే కిషోర్‌కే కాదు... వాడవాడంతా వినిపించి ఉలిక్కిపడి లేస్తుంది. నైటీ సర్దుకుని గబగబా వెళ్లి తలుపు తీసింది నందిని.‘‘ఏమిటాలస్యం?’’ ప్రతిరోజూ నందిని అడగాలనుకునే ప్రశ్నే అది.ఆనవాయితీగా ఈసారీ కిషోర్ అడిగేసాడు.‘‘లేడీస్ ఫస్ట్ అంటారుగానీ.. ఆలస్యంగా ఇంటికొచ్చే భర్తను కరువుతీరా నిలదీసే ఛాన్సు కూడా ఇవ్వని సమాజం మనది’’ లోలోన ఉడుక్కుంటూ లోనికి వెళ్లింది.
ఆమె అడుగుజాడలను కిషోర్ అనుసరించాడు.హాల్లోకి వచ్చీరాగానే సోఫాలో అతను కూలబడ్డాడు.భుజానకున్న కోటు తీసి ఓ వేపు విసిరేయడమే కాకుండా ఇంకోవేపు టైని విదిలించాడు.తర్వాత నెమ్మదిగా బూట్లు విప్పి సాక్స్ తొలగిస్తున్నాడు.అతను విసిరేసిన కోటును హ్యాంగర్‌కి తగిలిద్దామని అందుకుని.. ఆ వెంటనే షాక్ తిన్నట్లుగా అతని వంక చూసింది.అదేం పట్టనట్లు కిషోర్ తనపనిలో తానున్నాడు.‘‘ఏమండీ... కిషోర్‌గారూ..’’ నందినికి కోపమొచ్చినపుడల్లా నాసికా పుటలు అదరడమే కాదు, పిలుపులో గౌరవం హెచ్చుతుంది. ఆ సంగతి పెళ్లయిన కొత్తలోనే కనిపెట్టేసాడు కిషోర్.అందుకే, చటుక్కున తలెత్తి... అటెన్షన్‌గా ఫోజిస్తూ- ‘‘ఏమిటి?’’ అనడిగాడు.‘‘అబ్బ...! ఆ కంపెలా భరిస్తారండీ?’’ ముక్కు మూసుకుంటూ అడిగింది.‘‘గట్టిగా అనకే.. ఎవరైనా వింటే తాగుబోతనుకుంటారు’’‘‘తాగుబోతు కాదు.. తిరుగుబోతు’’ మనసులో అనుకుంది నందిని.‘‘అభ ఛా.. నేనడిగేది మీ కోటుకు అంటుకున్న ఘాటైన సెంట్ గురించి..’’‘‘ఓ... అదా!’’ నవ్వేసాడు.‘‘ఆ సెంటు సుందరి కలిసిందా?’’సెంట్ సుందరి అంటే నందిని దృష్టిలో రేష్మా.ఆమె ఇలా వచ్చి అలా వెళ్లిందని ఎవరూ చెప్పక్కర్లేదు. ఆమె వచ్చి వెడితే చాలు.. పరిసరాలన్నీ పరిమళభరితమే. అతి ఖరీదైన పాయిజన్ సెంట్ ఆమె రాసుకుంటుంది. ఓ చుక్క రాసుకుంటే చాలు.. రోజు రోజంతా వెంటాడుతుందా సుగంధం.