‘‘ఒక ఆశయమంటూ లేదు. ఏదెలా జరగాలని రాసుందో అలాగే జరుగుతుంది ఏమవుతావన్న ప్రశ్న ఇప్పుడైతే నాకెయ్యవద్దు’’ - నేను‘‘వాడేం చెయ్యాలనుకున్నా నా పూర్తి సహకారముంటుంది. ఎంత ఖర్చయినా, శ్రమ కల్గినా పర్వాలేదు. వాడు గొప్పోడవ్వాలంతే.కాని, వాడు కష్టపడ్తేనే కదా నాకలా చెయ్యాలనిపించేది’’ - నాన్నగారు‘‘స్మాట్‌ వర్క్‌ ఎంచుకో. నీ ఆలోచన నీ ఆశయం. దానికై నువ్వెంచుకున్న మార్గం నడక, వేగం అన్నీ మార్గదర్శకంకావాలని ఆశిస్తున్నా’’ - శ్రేయోభిలాషి్‌ ఇంట్లో నాన్న, అమ్మ, నేను, తమ్ముడు. నాన్నగారు బ్యాంక్‌లో పనిచేస్తారు. ఎప్పుడూ బ్యాంకుకే అంటుకుపోతారని అంటూ ఉంటుంది అమ్మ. హోమ్‌ మేకర్‌, అదేనండీ గృహిణి. సూర్యుడు లేవకముందే లేచి, నన్ను నిద్రలేపి, చదువుకోమని చెప్పి, తన పనిలో నిమగ్నమవడంతో ఆమెకు రోజు ప్రారంభమవుతుంది. ఇంట్లో అందరికీ సెలవులున్నాయి. ఒక్క అమ్మకి తప్ప. తమ్ముడు నాకంటే ఐదేళ్ళు చిన్నవాడు. వాడు ఏడింటికి లేచినా అంతగా అనుకోరుగానీ నేను మాత్రం ఐదు కాక మునుపే లేవాలి.నాకు ఆరవతరగతి నుండే ఐఐటి కోచింగ్‌ ఇప్పించసాగారు. స్కూల్లోనే ఉండేది కోచింగ్‌. ఉదయం ఏడున్నరకు బయలుదేరితే రాత్రి ఏడింటివరకు అక్కడే. ఆడు కోవటానికి సమయమే ఉండేది కాదు. అసలు మా స్కూల్లో ఆటస్థలం వుంటేగా. కొందరు మాత్రం పార్కింగ్‌ స్థలంలో పేపరును బాల్‌గా చుట్టి, పుస్తకాన్ని బ్యాట్‌గా అనుకొని క్రికెట్‌ ఆడేవారు. మాకు తెలిసిన క్రీడ అదొక్కటే. 

చాలామంది ఇంటర్వెల్ల్‌లో సినిమాల గురించి, కొత్త కంప్యూటర్‌ గేమ్స్‌ గురించి చర్చించేవారు. టీచరు చూస్తున్నప్పుడు చదివేట్టు నటించడం, లేదంటే పెన్నులతో ఆటలాడటం.అందరూ నువ్వేమవుతావంటే ఏదొకటి చెప్పేవాణ్ణి. ఎందుకంటే నాకొక ఆశయమంటూ లేదు. ఒకసారి ఇంజినీరు, మరోసారి అమెరికా వెళ్తానని ఇలా ఏది నోటికొస్తే అది వాగేవాడిని. ఎవరైనా ఎందుకవ్వాలనుకుంటున్నావని అడిగితేగదా. అరె! ఇప్పుడైతే కోచింగ్‌ తీసుకుంటున్న, ఆ తర్వాత మంచి కాలేజ్‌లో సీటు, ఆ తర్వాత జరిగేదేదో జరుగుతుంది. ఇప్పుడేదో ముంచు కొస్తున్నట్లు అడుగుతారేం. తొందరే ముంది.మొదట్లో చాలా సీరియస్‌గా చదివేవాడిని. కాని రాను రాను నాలో ఉత్సాహం తగ్గింది. రోజూ యాంత్రికంగా సాగిపోవడంతో విసుగు కలిగేది. అరె, ఆటల్లేక, పాటల్లేక, చదువుతోనే జీవితం ముగిసిపోతుందనే బాధ. రేపో, ఎల్లుండో అర్థాంతరంగా చనిపోతే, ఏమీ అనుభవించకుండా పోతానేమోననే బాధ. పదో తరగతి పరీక్షలు, ఆ తర్వాత రామయ్య కృష్ణమూర్తి వంటి కోచింగ్‌ సెంటర్లలో సీటుకోసం బాగా కష్టపడ్డా. ఫలితం దక్కింది. అప్పుడే అనిపించింది ఏదైనా పోటీ జరిగితే తప్ప మనలోని తపన, శ్రమించే గుణం బయటపడదని.