‘‘మాధవి వస్తోంది తెలుసా’’... విశాల్‌ చేతికి కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది అపర్ణ...చదువుతున్న న్యూస్‌ పేపర్‌మీంచి చూపుతిప్పి ఆమె చేతిలోంచి కప్పు అందుకుంటున్నవాడల్లా ఆ మాట విని కళ్లెత్తి చూశాడు... అపర్ణ మొహంలో ఓవిధమైన భయం కనిపించింది. అతని చూపులతో చూపు కలిపి ఒక్కసారికనురెప్పలు వాల్చేసింది..‘‘ఎప్పుడు? ఎవరు చెప్పారు?’’ అడిగాడు కనుబొమ్మలు ముడుస్తూ..‘‘వసంతగారు చెప్పారు.. నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నోము పేరంటానికి మాధవి వాళ్లింటికి వెళ్లారుట... ఇల్లంతా చిన్నచిన్న మార్పులు చేసి గోడలకు, తలుపులకు రంగులు వేశారుట... ఇండియన్‌ టాయిలెట్స్‌ స్థానంలో వెస్ట్రన్‌ టాయిలెట్‌ కట్టించారుట... చాలా హడావుడిగా ఉన్నారుట శాంతగారు వాళ్లు...’’ కొంగువేలికి చుట్టుకుంటూ చెప్పింది...‘‘అలాగా...’’ విశాల్‌ కాఫీ కొద్దిగా సిప్‌చేసి మౌనంగా ఎటో చూస్తూ ఉండిపోయాడు.

కొద్ది క్షణాలు అతనేమన్నా చెప్తాడేమో అని ఎదురు చూసి, అతనేమీ మాట్లాడకపోవడంతో అపర్ణ నిశ్శబ్దంగా లోపలికెళ్లి పోయింది... ఆమెకి ఆ తరవాత ఏ పనిమీదా ఏకాగ్రత కుదరలేదు... నిన్న వసంత నోటి నుంచి మాధవి వస్తోందన్న వార్త తెలిసిన దగ్గర్నించీ మనసులో విపరీతమైన ఆందోళన మొదలైంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తోంది. సైనికులు నిత్యం కాపలా కాస్తున్న పటిష్టమైన కోటలోంచి తననెవరో దట్టమైన అడవిలోకి విసిరేస్తున్న అభద్రతాభావం ఆమెని నిలువెల్లా వణికిస్తోంది... ఎలా? ఇప్పుడెలా? ఎక్కడికెళ్లాలి? ఎలా బతకాలి? ఏం చేయాలి? ఈ ఇంట్లో తన స్థానం పోయినట్టేనా? ఇది మాధవి ఇల్లు... మాధవి సామ్రాజ్యం... పరాయి దేశం పైకి దండెత్తి, అక్రమంగా ఆక్రమించుకున్న దురాశపరుడైన రాజులా తను ఈ ఇంటిని ఆక్రమించుకుంది..ఇలా జరగడంలో తన తప్పెంత? అవును తప్పు తనదేనా? తన నిస్సహాయతదా? తన పేదరికానిదా? తన స్వార్ధానిదా? ఉలిక్కిపడింది అపర్ణ... నేను స్వార్ధపరురాలినా? ఎదుటివాళ్ల అవసరాన్ని అవకాశంగా తీసుకుని తాత్కాలిక ఆశ్రయాన్ని శాశ్వత స్థావరంగా మార్చుకుందా? ఇందులో విశాల్‌ తప్పేం లేదా? మరణించిన ప్రభావతి గారి తప్పులేదా? ఎవరిది తప్పు?ఆలోచనలు కందిరీగల్లా మెదడుని కుడుతున్నాయి... అపర్ణకి తెరలు, తెరలుగా దుఃఖం వస్తోంది.. కానీ చిత్రం ఆ దుఃఖం బైటికి రావడం లేదు... గుండెల్లో ఉండలు, ఉండలుగా చుట్టుకుంటూ గొంతుకీ, గుండెకీ అడ్డంగా నిలబడింది... ఒక్క కన్నీటి చుక్క చెంపలమీదికి రాలినా చాలు కొంతన్నా ఉపశమనం కలుగుతుంది.

 అదేవిటో నిన్నటి నుంచి, వసంతగారు మాధవి రాక గురించి చెప్పిన దగ్గర్నించీ కూడా మనసు పెద్ద కొండరాయిని మోస్తున్నంత బరువుగా మారింది.తప్పుచేసి దొరికిపోయిన దానిలా నేరస్థురాలిలా ఆత్మనూన్యతా భావం నిలువెల్లా కాలుస్తోంది. నిజానికి తనీ ఇంటికి స్వార్థంతో రాలేదే... ఆ రోజు... అమ్మ తనని ఒంటరిని చేసి వెళ్లిపోయిన రోజు, ఉన్న ఆర్థిక సౌలభ్యం మేనేజరు కలం పోటుతో కుప్పకూలిన రోజు దిక్కుతోచక, దిక్కులేకా పుట్టెడు దుఃఖంతో అగమ్యగోచరంగా నిలబడిన రోజు, పక్కింటి రాగిణి న్యూస్‌పేపర్‌లో విశాల్‌ ఇచ్చిన ప్రకటన చూపించింది. వెంటనే పరుగులు పెడుతూ విశాల్‌ని కలిసింది.. తన నిస్సహాయస్థితి వివరించి తనకి అతని ఇంట్లో ఆశ్రయం ఇవ్వమని వేడుకుంది.. విశాల హృదయంతో విశాల్‌ అంగీకరించాడు... ఉన్న కొద్దిపాటి సామాను సర్ది రాగిణి ఇంట్లో దాచేసి, తన బట్టలు మాత్రం సూట్‌కేసులో పెట్టుకుని ఇల్లు ఖాళీచేసి సరిగ్గా మూడేళ్ల క్రితం ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు తనకేమీ అనిపించలేదు... వాళ్లకొక తోడూ తనకొక నీడ దొరికింది అనుకుంది... మంచానపడిన ఓ వృద్ధురాలికి సేవ చేయడం అదృష్టంగా భావించింది. ఆమెని కంటికి రెప్పలా చూసుకుని, ప్రశాంతంగా ఆమె మరణించడానికి తన వంతు కర్తవ్యాన్ని ఆనందంగా నిర్వర్తించింది. చివరిసారిగా ఆమె తనవైపు చూస్తూ ప్రదర్శించిన కృతజ్ఞతాభావంతో మనసంతా ఆనందంతో నిండిపోయింది... కన్నీళ్లతో తన కొడుకుకి తోడుగా ఉండమని అడిగితే ముందు తన అదృష్టానికి ఆశ్చర్యపోయింది... ఆ తరువాత ఆలోచించింది. కానీ, ఆ పరిస్థితుల్లో ప్రభావతిగారి నిష్క్రమణం తరవాత తనకి మళ్లీ భవిష్యత్తు శూన్యంగా మారబోతుందన్న భయం ఆలోచనని అణిచేసి, అంగీకారాన్ని తెలిపింది... అదే ఇంట్లో ఓ సేవకురాలిగా కాక, ఓ గృహిణిగా నిలదొక్కుకుంది.