తప్పే!అడిగేయడం తప్పే!అడక్కూడనిది అడిగేసింది తప్పే!అమ్మే కదాఁ అని ఆ ఒక్కటి కూడా అడిగేసింది తప్పే!తన ప్రియుడు రమ్మన్న చోటుకెల్లా తీసుకు వెళ్లమని కన్నతల్లిని అడిగేసింది మల్లీశ్వరీదేవి. తప్పే!తీగకు పందిరి ఎలాగో... మల్లీశ్వరీదేవికి అమ్మ అలాగ.మల్లీశ్వరీదేవి అల్లుకుంటుంది. అమ్మ మోస్తుంటుంది.అడిగిందే తడవుగా అతడి దగ్గరకు ఎత్తుకుపోయింది అమ్మ. ఇది తప్పున్నర!అందుకే పిలిపించారు ఊళ్లో రాజులు.మల్లీశ్వరీదేవి క్షత్రియ పుత్రిక.తప్పు తనకి కానీ. అమ్మకు కాదు. తానేం చేసినా ఆమెకు ఒప్పే!ఆ రాత్రిపూట ఎంతో హుషారుగా కూతుర్ని ముస్తాబు చేస్తోంది. చిరంజీవి సౌభాగ్యవతి మల్లి అనబడే మల్లీశ్వరీదేవి వెళ్తున్నది కులపంచాయతీకా? పెళ్లిచూపులకా?‘ఈ ఊళ్లో ఇద్దరే అందగత్తెలు. నీకు తెలవదేంటే...!?’ అడిగింది అమ్మ - నవ్వే మల్లి కళ్ళకు చీకటికాటుకతో సరిహద్దులు గీస్తూ...‘ఏయ్‌! నేను కాకుండా ఇంకో అందగత్తా? ఎవ్వతే అదీ...?’ మల్లి ఉడుక్కుంటూ తల్లి రెండు బుగ్గలూ పట్టుకుని సాగదీసింది.‘ఊళ్లోకి ఇవాళే దిగిందిలే...! అదుగో చూడు’ అని కిటికీలోంచి కనిపిస్తున్న చందమామను చూపించింది అమ్మ.‘ఓహో! అదా! దాన్నయితే ఒప్పుకుంటాన్లే. అదీ, నేనూ ముఖంతోనే బతికేస్తాం. ఎందుకంటే....’ అని మల్లి చెబుతుండగానే ముందస్తుగా నోరు మూసేసింది అమ్మ.‘చందమామ కన్నా నువ్వే గొప్ప. తెలుసా!’ అంటూ ముస్తాబయిన తన ఇరవయ్యేళ్ల పసిపాప మల్లిని ఎత్తుకుని చంకన వేసుకుంది.‘అవునే పిచ్చిదానా! నాకూ కాళ్లులేవు. చందమామకీ కాళ్లు లేవు. నన్ను ఎత్తుకోటానికి అమ్మ వుంది. కానీ దానికి అమ్మలేదు.’ అని అమ్మ బుగ్గను ముద్దుపెట్టింది మల్లి. యరకరాజు వెంకటపతిరాజు ఇల్లు తోట మధ్యలో వెలిగి పోతోంది.

 అల్లూరి సీతారామారాజు విగ్రహం. బైర్రాజు ఫౌండేషన్‌ బోర్డూ క్షత్రియలోగిళ్లకు స్వాగతం పలుకుతున్నాయి.మల్లీశ్వరీదేవిని ఎత్తుకుని ఆమె తల్లి వడివడిగా నడుచుకుంటూ, ఆ ఇంట్లోకి వెళ్లింది.విద్యుద్దీపాలను తలదన్నే వెలుతురు వచ్చినట్లనిపించింది.‘వెంక మావయ్యా! మీసాలకు రంగేస్కోపోయావా? ముసిలాడ్లా ఉన్నావ్‌?’ అని ఎదురొచ్చిన వెంకటపతిరాజును పలకరించింది మల్లి.వెంకటపతిరాజు మల్లీశ్వరికి మేనమామ వరస.మల్లి వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా, ఆమె తల్లి వైపు చూస్తూ ‘వీరలక్ష్మీ! దీన్ని మోసిమోసి చిక్కిపోయినట్టున్నావ్‌!’ అంటూ చేతులు చాచాడు వెంకటపతిరాజు‘ఏం చేస్తాది మరి. పేరుకు మేనమామలే కానీ, నన్ను మోసేవోడు ఒక్కడూ లేదు.’ అని మల్లి మరో చురక వేసింది.‘నీ కూతురుకి పొగరెక్కువే వీరలక్ష్మీ!’ అంటూ మల్లిని చంటిబడ్డను ఎత్తుకున్నట్లు ఎత్తుకుని, తీసుకువెళ్లి సోఫాలో తన పక్కనే కూర్చో బెట్టుకున్నాడు. ఉన్నా, లేనట్లుండే కాళ్లని ఎర్రటిలంగాతో కప్పుకుంది. పచ్చటి ఓణీ, మళ్లీ ఎర్రటి బ్లౌజు. ఆకుల మధ్యన మందారంలా ఉంది మల్లి.మెల్లిమెల్లిగా కులంలో మగాళ్లంతా చేరారు. మల్లి, ఆమె తల్లి వీరలక్ష్మి- ఇద్దరే అడాళ్లు.