అబ్బా! ఇంకా రాదేం ఈ ఊరు! బాధగా కణతలు రుద్దుకుంటూ అటూ ఇటూ చూశాడు హేమంత్‌. మధ్యాహ్నపు గాలి గ్లాస్‌ కిటికీలోంచి వెచ్చగా మొహానికి కొట్టింది. తనలాగే ఆదుర్దాగా చెట్లూ, పొలాలు, నీటి మడుగులూ పరిగెత్తుతున్నాయి అనుకుంటూ వేగంగా డ్రైవ్‌ చేస్తున్నాడు.అమ్మ...అమ్మా... ఎలా వుందో? ఏం చూడాల్సి వస్తుందో? డాక్టరు మిత్రుడు అబద్ధం చెప్పాడా? తను చేరే సరికి ఇంటి ముందు... లేదా నిరంజన్‌ హాస్పిటల్‌ ముందు.... ఛా... ఛా... పాడు ఆలోచనలు... ఏమిటిలా? కళ్ల నీళ్లు ఆపుకుంటూ స్టీరింగ్‌ పక్కకి తిప్పాడు. గేదెల మంద తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.ఊళ్లోకి ప్రవేశించగానే గుండె దడ మొదలయింది. తమ ఇల్లు దాటే హాస్పిటల్‌కు వెళ్లాలి. ఇల్లు... హమ్మయ్య ఫర్వాలేదు. హాస్పిటల్‌... ఏ హడావుడి లేదు. కారు దిగి లోపలికి పరిగెత్తాడు. నిరంజన్‌ ఎదురుగా వస్తున్నాడు.నిరంజన్‌....హేమంత్‌ జీరగా అన్నాడు.‘‘ఛా... ఛా... ఏమీ కంగారు లేదు. అమ్మ బాగానే వుంది. గండం గడిచింది. రా అదిగో ఆ రూమే.’’సెలైన్‌ ఎక్కుతూ వుంది. నీరసంగా, నిర్వికారంగా కళ్లు మూసుకొని వుంది జయమ్మ. వీళ్లిద్దర్నీ చూసి సిస్టర్స్‌ లేచి నిలబడ్డారు. వేదనా... ఆందోళనా... నిరంజన్‌ వివరిస్తుంటే నిర్ఘాంతపోతూ ‘మేము వెళ్లి నాలుగు రోజులు కూడా అవలేదుగా? నిరంజన్‌’ అన్నాడు.

‘‘ఒక్క క్షణం చాలు హేమా అంతా తారు మారు కావడానికి బాధపడకు’’ స్నేహితుడి భుజం చుట్టూ చేతులు వేసి తన కన్సల్టింగ్‌ రూమ్‌లో కూర్చోబెట్టాడు. కాఫీ సిప్‌ చేస్తూ నిరంజన్‌ చెప్పింది వింటూ ఉలిక్కిపడ్డాడు. నిజమా అన్నాడు వణుకుతున్న కంఠంతో.‘‘నిజం సిస్టర్‌ లలిత అమ్మనడిగి తోటకూర కోసుకుందామని వెళ్లిందట. పక్క రూమ్‌లో దంపతులూ ఊరెళ్లారు. లలిత అనుకోకుండా వెళ్లడం వల్లే మనం అమ్మని మళ్లీ...’’‘‘ఇంకా ఆనాటి అక్కనీ...నాన్ననీ మర్చిపోలేదు ఎవరం నిరంజన్‌. నాన్న సంవత్సరీకం కాగా కిందటి వారం అందరం వచ్చాం.ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా దీర్ఘంగా నిట్టూర్చి హేమంత్‌ చేయి ఓదార్పుగా నొక్కాడు నిరంజన్‌. పద ఇంటికెళ్లి స్నానం అదీ చేసి... మళ్లీ అవన్నీ గుర్తుచేసుకోకు.‘‘ఊహూ... నేను మా ఇంటికెళ్లి వెంటనే వస్తాను.’’ మరొకసారి జయమ్మని చూసి ఆత్రంగా ఇంటికి చేరాడు. వయ్యారంగా ఊగుతున్న చెట్లూ.... ఇంటి ముందు పూల మొక్కలూ... ఎందుకో అవన్నీ చూస్తుంటే చాలా నిశ్చింతగా అనిపించింది హేమంత్‌కి. ఫర్వాలేదు. వీటిలాగానే అమ్మ కూడా మళ్లీ కళకళలాడుతుంది. నాలుగు వైపులా కలియచూస్తూ అనుకున్నాడు. అదిగో ఆ మూల గేదె, చిన్నపాక వుండేవి. ఏనాడో ఈ స్థలం తీసుకొని ముందుగా తడికెల ఇల్లు వేసుకున్నారు తల్లిదండ్రులు. ఇద్దరూ టీచర్లు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే పనిచేశారు. పాల గురించి గేదెనీ, కోళ్లనీ పెంచుతూ బడి దగ్గర్నుంచి వచ్చాక గూడా అమ్మా,నాన్న ఏదో ఒక పనిలో వుండేవారు. తడికలు తీసి క్రమంగా గోడలు కడుతూ వచ్చారు.