‘మన కథలకి ఎంచుకునే ఇతివృత్తాలన్నీ మన జీవితాన్నించి గోక్కున్నవే’ అని ఒక గొప్ప రచయిత అన్నమాటలు నాకెపడూ గుర్తుకొస్తునే వుంటాయి. గమ్మత్తుగా ఈ మధ్య నా రైలు ప్రయాణంలో ఎదురైన ఒక తమాషా సంఘటన ఈ మాటల్ని మరింత నిజం చేసినట్టనిపించింది.నాకు విజయవాడ-హైదరాబాద్‌ ప్రయాణం జీవితంలో ఒక భాగంలా అయిపోయింది. ఇటు మా వైపు వాళ్లు, అటు మా వారి వైపు వాళ్లు అంతా హైదరాబాద్‌లోనే సెటిలయిపోవడం వల్ల చిన్న ఫంక్షన్‌కైనా హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తుంది నాకు. అందుకే రైలు ప్రయాణం అనగానే ఎక్కడలేని నీరసం వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్‌ వల్ల కూడా ప్రయాణం ఇంకా బోర్‌గా అనిపిస్తుంది.నేను చెప్పబోయే ఈ సంఘటన నిజంగానే నా బోర్‌ ప్రయాణ జీవితంలో ఒక గొప్ప రిలీఫ్‌గా మిగిలిపోయింది.ఆ రోజు కూడా నేను హైదరాబాద్‌ వెళ్లడానికి యధాప్రకారం నర్సాపురం ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాను. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో రైలే కాదు, రైల్వే స్టేషన్‌ కూడా జనంతో కిటకిటలాడుతోంది. పదిరోజుల ముందుగానే రిజర్వేషన్‌ చేయించడం వల్ల నాకు రెండో నెంబరు బర్త్‌ వచ్చింది. నేను లగేజీ సర్దుకొని కొంచెం రిలాక్స్‌ అవగానే రైలు కూడా కదిలింది. అపడే నాకు నా సహ ప్రయాణీకుల్ని గమనించే అవకాశం దొరికింది.

నా ఫ్రక్కనే ఒక అరవయేళ్ల పెద్దావిడ కూర్చుని వుంది. నేను ఆవిడ వంక చూడగానే ఆమె పలకరింపుగా నవ్వింది. అది నాకెంతగానో నచ్చింది.‘మీరెక్కడ నుంచి వస్తున్నారు?’ అనడిగాను మాట కలుపుతూ...‘‘భీమవరం నుంచి రేపు హైదరాబాద్‌లో మా మరిది కొడుక్కి పంచలిస్తున్నారు. అందుకని వెళుతున్నాను.’’ అని చెప్పింది.‘‘అలాగా’’అన్నాను.ఇంతలో ఎదురు బెర్త్‌ మీద కూర్చున్న మధ్య వయస్సు ఆవిడ పెద్దావిడను అడిగింది. ‘‘మీ రొక్కరే వెళుతున్నారా? తోడుగా ఎవరికైనా వస్తున్నారా?’’అని‘‘ఒక్కదాన్నే వెళుతున్నాను. మావారు రిటైరై ఆరేళ్లయింది. రిటైరయిన కొత్తల్లో అన్ని ఫంక్షన్లకీ అటెండవటమంటే విసుగొచ్చేసింది.కానీ కొన్ని ఫార్మాలిటీస్‌ తప్పవు కదా! ఆయన నాకు సొంత మరిది. వెళ్లకపోతే బాధపడతారు. అయినా నాకు ఫస్టు నుంచి ప్రయాణం అలవాటే. అందుకని ఒక్కదాన్ని వెళ్తూనే వుంటాను. మాటి మాటికీ తోడు రావాలంటే పిల్లలకి కూడా ఆఫీసులో ఇబ్బందే కదా!’’ అంది పెద్దావిడ