నూకాలు తుళ్ళిపడి లేచింది. ఎవరో గట్టిగా చరిచి లేపినట్టు నిద్రలేచింది. నూకాలును టైముకి లేపడానికి అక్కడ సెల్‌ఫోన్‌ లేదు. అలారంకొట్టే గడియారం లేదు. ఆ కొంపలో ఏ మూలనో ఓ గంపలో కొక్కురోకో అని కూసే కోడి కూడా లేదు. మరి నూకాలు ఎలా లేవగలిగింది?రోజూ ఆ టైముకు లేచే అలవాటే ఆమెను లేపింది. చచ్చినట్టు లేవక తప్పని బతుకు భయమే ఆమెను లేపింది.‘ఓలమ్మో! టయిమైపోనాది లాగుంది’నూకాలు గుండెల్లో చలిపుట్టింది. పక్కమీద నుంచి గభాల్న లేచి నించొంది. ఊడిపోయిన చీరను గబగబా చుట్టుకుంది. విడిపోయిన జుట్టుని నిమిషంలో ముడి వేసుకుంది. ఆమె ముస్తాబు సరి. ప్రయాణానికి రెడీ.ఆమె ఆధునికంగా కాకపోయినా, కనీసం శుభ్రంగానైనా తయారు కాలేదు. తట్టను పట్టుకుని బయల్దేరింది. బయల్దేరుతూ ‘‘లెగే గుంటా’’ అని కూతుర్ని లేపింది. ఆ గుంటకి తులసి అనే చక్కటి పేరు వున్నప్పటికీ, ఆ పేరుతో నూకాలు పిలిచేది చాలా తక్కువ.గుంట లేవకపోతే, పిర్రమీద గట్టిగా చరిచింది నూకాలు.చప్పున లేచి కూర్చుంది తులసి గుంట.

నూకాలు వెళ్ళిపోగానే తలుపులోన గెడపెట్టు కోవాలి. అదే ఆ గుంట చేయాల్సిన పని.‘‘గెడేసుకోపోతే ఏం? ఇంతోటి కొంపలో ఏటుందని ఎత్తుకుపోతారోలమ్మా?’’‘‘ఓలమ్మో. ఎత్తుకుపోడానికి ఏవీలేదా?’’‘‘ఏటుందేటి?’’‘‘నీవున్నావుకదే బంగారం’’ అని బంగారు గుంటని ముద్దులాడి, నవ్వుతూ వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు చంకలో బిడ్డలా తట్టను అపురూపంగా ఎత్తుకుంది.తులసిగుంట చిన్న గుంట కాదు. బంగారు తీగ చెరుగ్గెడలా ఏపుగా, ఎర్రగా, అందంగా ఎదిగిన గుంట. వయసు పదిహేనో ఏడు నడుస్తోంది.తట్టతో తల్లి గడపదాటి వెళ్ళిపోయాక, క్షణంలో తలుపు గెడవేసుకొని, నేలపై బొంతపై మూడంకె వేసి, దుప్పటిలో ముసుగేసి నిద్రలోకి జారిపోయింది. దోమల సంగీతం, బొంతపై నల్లులూ, తలలో పేలూ, వంటగిన్నెలపై చప్పుడు చేసే ఎలకలూ ఏ మాత్రం ఆ గుంటకు నిద్రాభంగం కలిగించలేకపోయేయి.

నూకాలు నడుస్తోంది.మామూలు నడక కాదు. పరుగులాంటి నడక.నడక్కి చీర అడ్డురాకుండా కుచ్చిళ్ళు పైకి ఎగతోసి, నడుంభాగంలో గుచ్చి, పైట బిగకట్టి నడుస్తోంది. తలపై తట్టతో మరీ నడుస్తోంది. చెమటలో తడుస్తోంది.చీకటి తెరలు తొలగకముందే, వేకువ రేఖలు విచ్చుకోకముందే నూకాలు రైలుని అందుకోవాలి. నలభై నిమిషాలు నడవాలి. ఆటో ఎక్కదు. రిక్షా ఎక్కదు. రైలెక్కే వరకూ నడకే నడక.నూకాలు నడుస్తోంది. వాకింగ్‌ చేసేవాళ్ళూ, సైకిళ్ళపై, మోపెడ్‌లపై పాలబిందెల వాళ్ళూ, ఉద్యోగాలకు పరుగులెట్టేవాళ్ళూ, కుక్కల అరుపులూ, పక్షుల కిలకిలలూ... నూకాలు నడుస్తోంది. నడుస్తున్న నూకాలు ఆగింది. సిమ్మాద్రి కొట్టు రాగానే నూకాలు కాళ్ళకు బ్రేకులు పడేశాయి. అక్కడ పళ్ళు తోముకుని, ముఖం, కాళ్ళూ, చేతులు కడుక్కొనీ వేడి వేడి టీ తాగుతుంది.