హైదరాబాద్‌ నగరానికి 25 కి.మీ దూరంలో సుమారు వంద ఎకరాల స్థలంలో నిర్మించిన నాలుగు అంతస్తుల సువిశాల భవనం. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న కార్పొరేట్‌ కళాశాల. భవనమైనా ఇంత పెద్ద ఎత్తున నిర్మించిన దాఖలాలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఎక్కడా లేవనే చెప్పొచ్చు. నూట అరవై కోట్ల వ్యయంతో అంత భారీ నిర్మాణాన్ని పూర్తి చేయగలిగినందుకు ఎంతో సంతృప్తిగా ఉంది నాకు. రాష్ట్ర గవర్నర్‌ అధ్యక్షతన మాజీ రాష్ట్రపతి కలాంగారి లాంటి పెద్దల సమక్షంలో ఈ పాఠశాలను, కళాశాలను రెండు వారాల్లో ప్రారంభోత్సవం చేయబోతున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాతో ముఖాముఖి కోసం అనుకుంటా ఏదో టీవీ చానల్‌ వాళ్ళొచ్చారా రోజు.నేను నా గదిలో కూర్చుని పాఠశాల/కళాశాల ప్రారభోత్సవ వేడుకకు సంబంధించిన ఏర్పాట్ల గురించి నా సన్నిహితులతో చర్చిస్తున్నానప్పుడు. టీవీ వాళ్ళ రాకతో ఆ చర్చ ఆపి, వాళ్ళను లోనికి ఆహ్వానించాను. విలేఖరి ప్రశ్నలు సంధిస్తుంటే నేను సమాధానాలు చెప్తున్నాను.‘‘ఇంత పెద్ద విస్తీర్ణంలో, ఇంత భారీ పాఠశాల, కళాశాల భవన నిర్మాణం మునుపెన్నడూ కనీ వినీ ఎరుగనిది. తెలుగు సినీ పరిశ్రమలో మీరొక అగ్ర దర్శకులు. 

ఇంతదాకా తీసిన మీ చిత్రాలన్నీ బ్లాక్‌బస్టర్లు. కొన్నైతే పరిశ్రమ రికార్డుల్ని తిరగరాసాయి. మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమాని 100 కోట్ల క్లబ్‌కి చేర్చిన ఘనత మీది. అలాంటి మీరు చాలా చిత్రంగా ఇప్పుడిలా విద్యారంగంవైపు దృష్టి సారించారేమిటి?’’‘‘ఏం సారించకూడదా?’’ అన్నాన్నేను నవ్వేస్తూ.‘‘అలా అనికాదు. సినీ పరిశ్రమలో వందలకోట్లు సంపాదించిన పెద్దవాళ్ళు, ఆ డబ్బుని రియల్‌ ఎస్టేట్‌లోనో, చెయిన్‌ ఆఫ్‌ హోటళ్ళలోనో, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కంపెనీల్లోనో, క్రికెట్‌ టీముల్లోనో పెట్టుబడులు పెడ్తున్నారు కదా! మీరు ‘బడుల’ మీద ఎందుకు పెడ్తున్నారు?’’‘‘అవును దేశంలోనే కాదు, ఆసియాలోనే అతి పెద్ద విద్యాలయాన్ని నిర్మించాలనుకున్నాను. చిత్రరంగంలో నేను సంపాదించిన డబ్బునంతా దీనికోసమే ఖర్చు పెడ్తున్నాను’’ చెప్పాను.‘‘ఎందుకు? స్టార్‌ హోటళ్ళూ, టీవీ ఛానెళ్ళూ... ఈ వ్యాపారాలకంటే ‘విద్యారంగం’ మరింత లాభదాయకం అనా? సూటిగా అడిగాడు టీవీ విలేఖరి.