ఒకదాన్నొకటి తరుముకుంటూ వెంటిలేటర్‌ ఊచలపై వాలి ముక్కులు రుద్దుకుంటూ సరసాలాడుకుంటున్న పిచికల జంటని తదేకంగా చూస్తూకూర్చుంది హాస్పటల్లో బెడ్‌మీదున్న లలిత. అపుడపుడు అవి గదిలోకి వచ్చి బెడ్‌పక్కనున్న టీపాయ్‌మీద వాలుతున్నాయి. వాటి కిచకిచలు ఆహ్లాదంగా ఉన్నాయ్‌. నిన్న తనని పరామర్శించడానికి వస్తూ తన సహోద్యోగులు తెచ్చిన ద్రాక్షపళ్ల గుత్తులు టీపాయ్‌మీద అలాగే ఉన్నాయి. వాళ్ళు కాసేపు ఉండి జరిగిన దుస్సంఘటన పట్ల సానుభూతి కురిపించి వెళ్లారు. వాళ్ళు వెడుతూంటే వరండాలోంచి కొన్ని మాటలు వద్దనుకున్నా తన చెవిని లీలగా పడ్డాయి.‘‘పాపం షాక్‌ అయినట్టుంది. మనిషిలో చలనం లేదు. ఆషాక్‌లో ఒకోసారి బాధ తెలీనంతగా మనసు గెడ్డకట్టి మొద్దుబారిపోతుందట!’’‘‘షాకా- గాడిదగుడ్డా? పెనుగులాడి నిరోధించేబదులు లొంగిపోయి బాగా ఎంజాయ్‌ చేసినట్టుంది.

 లేకపోతే తనకేమీ జరగనట్టు అంత నిర్లిప్తంగా ఎలా ఉంటుంది? అసలు ఏయేడుపూలేని ఈ దుంగని ఓదార్చడానికి రావడం మనదే బుద్ధి తక్కువ. బెల్లంకొట్టిన రాయిలా ఎంత నిర్వికారంగా ఎలా ఉందో చూడు.’’‘‘ఛ ఛ! అలా మాట్లాడకూడదే..’’భోరున ఏడవాల్సిన సందర్భంలో ఆ వ్యక్తి కంట తడికూడా కనిపించకపోతే పరామర్శించి వోదార్చడానికి వచ్చినవాళ్ళు బిత్తరపోతారు. ఏం చేయాలో తెలియక. ఏ ఆడదైనా భోరున ఏడ్చే అటువంటి సమయంలో లలితకళ్ళు చమర్చనైనా లేదు. బండరాయిలా నిశ్చలంగా ఉన్న లలితని చూసి ఎలా పరామర్శించాలో, అసలు పరామర్శించాలో, అఖ్ఖర్లేదో తెలియక సహోద్యోగులు తికమకపడ్డారు. తరువాత వాళ్ళే తేరుకుని, ‘‘నీకెంత కష్టం వచ్చింది లలితా!’’ అంటూ ముఖాలు విచారంగా పెట్టారు.తను అత్యాచారానికి గురైంది(ట)! తనపై రేప్‌ జరిగింది అంటున్నారు డాక్టర్లు. తనకే తెలియదు తనకేం జరిగిందో! మొన్న ముసురుపట్టిన వర్షపురాత్రి ఆఫీస్‌ నుండి ఇంటికి ఆటోలో వెడుతూంటే.. ఆ ఆటోవాడు చీకట్లో సందుల్లోకి దారి మళ్ళించి తనపై అత్యాచారం చేయబోతే తను మొదట భీతిల్లినా, తేరుకుని పెనుగు లాడుతూ సహాయం కోసం అరుస్తూ, వాడిచేతిని కండ ఊడేలా కసిక్కున కొరికితే, వాడు రెచ్చిపోయి బలంగా తనగూబ పగిలేలా కొట్టాడు. ఆ దెబ్బకి కళ్ళు పచ్చబడి తను స్పృహ కోల్పోయింది. స్పృహలో లేని తనపై ఏం జరిగిందో తనకెలా తెలుస్తుంది? తన దేహానికి ఏం జరుగుతోందో ‘తనకి’ తెలియదు. ఆ బలమైన చెంపదెబ్బకి ‘తను’ ఏమైపోయింది? ఎక్కడికి పోయింది? తన దేహం ఉంది- ‘తను’ మాత్రం లేదు. ఏం జరిగిందో ‘తనకి’ తెలియదు కాబట్టి అత్యాచార అనుభవాన్ని దేహం అనుభవించింది తప్ప ‘తను’ అనుభవించలేదు. తన అనుభవాన్ని దేహం చెప్పలేదు. ‘తను’ మానభంగానికి గురైనట్టా- కానట్టా? ఇదేం వేదాంతం? మానభంగ వేదాంతం?