కృష్ణభగవానుని దర్శనం కోరుతూ, పారవశ్యంతో, గోపికలు గొంతులెత్తి గీతికలు పాడుకుంటున్నారు. భవనం లోపలి దీపకళికల కాంతి గోపికల ముక్కునత్తులపై పడి, రంగులు మార్చుకున్నాయి. రకరకాల పువ్వులతో తీగెలు చుట్టుకున్నట్టు గోపికలు భవనం చుట్టూ తిరుగుతూ, మధ్య మధ్య చేతులుతట్టి ‘కృష్ణా’ అని ఏకకంఠంగా పిలుస్తున్నారు. నల్లని మేఘాలు కృష్ణుని ఉత్తరీయంలా మెరుపుల్ని చుట్టుకుంటూ, అన్ని దిక్కులూ చూస్తున్నాయి. ఆ కాంతిలో గోపికలు కృష్ణుడు తమని వదిలి మిగిలిన గోపికల దగ్గర ఉన్నాడేమోనని కళ్లతో వెతుకుతున్నారు.మిత్రవింద నిట్టూరుస్తూ, మెట్లపైన కూర్చుంది. ‘దేవి, దేవి’ అని, వగరుస్తూ పరిచారికలు ఆసనం మోసుకువచ్చారు.మిత్రవిందకి గుర్తు వచ్చింది. అది దేవకీదేవి భవనం. అందరికీ సమంగా జరుగుతాయి లాంఛనాలు, దూరంగా గోపికలు పాడేపాట వినబడుతోంది. ఏమిటో, తను పెద్దరాణుల్తో చేరలేదు. అట్లాగని మరీ, చిన్న ఆవిడలా, మంకుపట్టుకీ, మందలింపుకీ, నోచుకోలేదు. పోనీ ఆ గోపికల్లా స్వేచ్ఛగా ఉండేందుకు కూడా వీల్లేదు కదా!మనస్సుకి చిరాకుగా తోచింది. అటూ ఇటూ తిరిగింది. పరిచారికలకోసం, వాళ్లు తెచ్చిన ఆసనంపై కూలబడి జడలో మొగ్గలు విడవటం చూచుకుంటూ కూర్చుంది.భవనం రెండవ అంతస్తు విశాలంగా వుంది. రత్నకంబళ్ళు పరిచి, పువ్వుల పరిమళాలతో, అగరువత్తుల ధూపాలతో, కస్తూరితో చేరిన సుగంథాలు కృష్ణుని ఉనికిని తమలో దాచుకున్నట్లు ఆ ప్రాంతాన్ని అంతా చుడుతున్నాయి.

సత్యాదేవికి ఓర్పు తగ్గి, కోపంగా మారింది. కాళ్ల అందెల చప్పుడును పెద్దదిచేస్తూ, గదులన్నీ ఎన్నోసార్లు చుట్టింది. పువ్వులు కట్టిన వుయ్యాల ఒంటిగా కదులుతోంది. దూరంగా యమున ఘోషపెడుతోంది. ‘ఏమిటీ కోరిక దేవకీ దేవికి?’ అనుకుంటూ కృష్ణుడు కూర్చునే స్థానంలో ఉయ్యాల మీద ఒరిగింది.ఎన్ని అష్టములు జరుపుకోలేదు తన దగ్గర! అయినా మనస్సుకి తృప్తిలేదు.తను లేకపోతే జీవం లేని శరీరంలా ఉంటుందని ఎన్నిసార్లు చెప్పలేదు! తన దగ్గర ఉన్నప్పుడు ఎంత అమాయకత్వం! అసలు మిగిలిన వాళ్లంటే ఇష్టం లేనట్లు తోపిస్తాడు.ఈసారి ఏమైనాసరే నమ్మకూడదు. అసలు ఈ రాత్రి ఇక్కడికి వస్తాడన్న నమ్మకమేమిటి?కోపం విచారంగా మారింది. అసలు తన తండ్రిదే తప్పు. తను వేసిన నిందని మార్చలేక తనని కట్టబెట్టటం ఏమిటి? ఎవరికో నిర్ణయించిన పడుచుని తెచ్చుకున్ననాడే అతని మీద తను ఆశ వదులుకుంది. తన తండ్రికి అదే అలుసు అయి పిల్లని చూపి, పాత పగలు మరువవచ్చని ఆశ కలిగింది.తల్లో పువ్వులు బరువెక్కుతున్నాయి. ఒక్కటొకటే ఒలిచి విసురుతోంది.అబ్బా ఆ రుక్మిణికి ఆత్మలో ఉంటాడుట! అన్నీ వట్టిమాటలు! తన దగ్గర ఉండటం లేదన్న అక్కసుతో ఇలా వెనకచేరి పై అంతస్తులో రెప్పవాల్చకుండా ఆ చూపులేమిటి? పాపం! ఆ చూపులు దాటి రాలేక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడేమే కృష్ణుడు! ఆ తలపు రాగానే సత్యాదేవికి మనస్సు కొంత స్థిమిత పడింది. విచారం దుఃఖంగా మారి తన మీద తనకే జాలి కలిగింది.