యానాం ఉలిక్కిపడింది. ఆత్మాభిమానం పెల్లుబికింది. వెంకటయ్యకు ఎదురైన అనుభవం ఊరి వారిలో ఆవేశాన్ని ఆందోళనని రేకెత్తించింది. ఆవేదన కలిగించింది. ఆగ్రహం అట్టుడికింది. తక్షణ కర్తవ్యాన్ని బోధించింది.‘‘వెంకటయ్య వంటి సద్ర్భాహ్మణుడ్ని అప్రాచ్యుడు కాలితో తన్నాడంటే వాళ్ళకిక మూడినట్లే’’.‘‘సదాచార పరాయణుడు. ఆయన కన్నీరింకిన ఈ మట్టి బుగ్గవుతుంది. వర్షాలు పడక కరువు ముంచుకొస్తుంది’’వెనకాముందూ... గౌరవం... మర్యాద... ఉండనక్కర్లేదా?... గాడిదకొడుకులు’’.‘‘మీ ఉసురు ఊరికే పోదు. తప్పక తగులుతుంది’’.‘‘బాబయ్యా, మీరు ముందుండండి - వాళ్ళని ఊరి నుంచి పారగొడదాం’’సానుభూతి వెల్లువై పారింది. సంగతి తెలుసుకుని ఒక్కొక్కళ్ళు రాసాగారు.వెంకటయ్య ఇంటి ముందు చింతచెట్టు కిందకు చేరారు. గతంలో ఫ్రెంచి వాళ్ళనుంచి ఎదురైనా అవమానాల జాబితా విప్పసాగారు. పుట్టి పెరిగిన ఊళ్లో జరిగిన పరాభవాన్ని వెంకటయ్య జీర్ణించుకోలేక పోతున్నాడు. జనాన్ని చూసి వెంకటయ్యకు ధైర్యం కలిగింది. వీళ్ళందరి సహకారంతో పిథోయిస్‌కు తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. 

మూకుమ్మడి దాడి చేయాలి. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరగడం అనవసరం.ఉడుకునెత్తురు యువకులు... వయస్సు నిండిన వృద్ధులు... అందరిదీ ఒకే మాట....గంటలో మూడొందల మంది పోగయ్యారు. అందరి చేతుల్లోను కత్తులు... కటారులు... గొడ్డళ్ళు.... కర్రలు...వాతావరణం వేడి సెగలతో ఉద్రిక్తంగా మారింది.ఫిథోయిస్‌ ఇల్లు విష్ణాలయం వీధిలో ఉంది.త్యాగరాజ వీధి నుండి సమూహం బయలుదేరింది.వెంకటయ్య నలిగిన మురికి బట్టల్లోనే ఉన్నాడు. తెగిన జంధ్యాన్ని చెవికి ముడేసాడు. చెరిగిన కుంకుమ బొట్టు చెమట తడిసి నుదురంతా రక్తంతో కమిలినట్లుగా ఉంది. జనం బాసట అమిత ఉత్సాహాన్నిచ్చి ముందు వరసలో నడుస్తున్నాడు.మధ్యాహ్నపు ఎండ చురుక్కుమంటూంది.పిథోయిస్‌ ఇల్లు చేరుకున్నారు.

తెల్లని యూనిఫాం. ఎర్రటి టోపితో జవాను గేటు ముందు నిలబడి ఉన్నాడు.దూరంగా జనాల గుంపు చూసి ఏదో ఊరేగింపు అనుకున్నాడు.ముందుభాగంలో వెంకటయ్యను గమనించి కీడు తలచాడు. అకస్మాత్తుగా ఒకడు అతని చేతిలోకి తుపాకీ లాక్కున్నాడు. మందిలో చిక్కుకుని జవాను పిడిగుద్దులు తిన్నాడు. ఎవరి మాటా ఎవరూ వినేలా లేరు. గేటు తీసుకుని లోపలికి ప్రవేశించారు.వసారాలోని వస్తువుల్ని చిందరవందర చేసారు.పిథోయిస్‌ దొర కూర్చునే కుర్చీలో వెంకటయ్యను బలవంతంగా కూర్చోబెట్టారు.పిథోయిస్‌ బయటకు రావాలని నినాదాలు చేసారు.తన ఇంటి ముందు జరుగుతున్న అలజడిని కిటికీ కర్టెన్లు కొద్దిగా తొలగించి గమనించసాగాడు ఫిథోయిస్‌.వెంకటయ్యను కుర్చీతో సహా అమాంతంగా భుజాలకెత్తుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ కుర్రాళ్ళ చేష్టల్ని ఆనందిస్తున్నాడు.కుర్చీ నెమ్మదిగా నేల మీదికి దింపారు. వెంకటయ్య లేచి నిలబడ్డాడు.ఒకడు గొడ్డలితో కుర్చీపై వేటు వేసాడు. మరొకడు కత్తితో నరికాడు. క్షణంలో కుర్చీ నామరూపాలు లేకుండా పోయింది. పేము బద్దెల్ని గదంతా జిమ్మేసారు. ఆవేశం అదుపు తప్పింది.