‘‘కుంతీ!.... ఆగు! నిన్నే!’’తిరుమల కొండలమీద ప్రభాత సమయపు శీతల వాయువులు శరీరాన్ని పులకింప చేస్తుంటే... అంతకంటేగగుర్పాటు కలిగించే ఆ పిలుపు, కమ్మనైన ఆ కంఠం కూతురితో మాట్లాడుతూ నడుస్తోన్న విశ్వపతిని మరింత ఆశ్చర్య చకితుణ్ణీ, ఆనంద పరవశుణ్ణీ చేసింది.మూడు, నాలుగేళ్ళలా కనిపించే ఆ పాప లేడిపిల్లలాపరుగుతీస్తోంటే, ఆమెను పట్టుకోటానికి ఆమె వెంటపరుగులాటి నడకతో వెళ్తోంది బహుశా ఆమె తల్లేనేమో! తెల్లని శరీరం, పోనీటెయిల్‌ జడ మీద నుంచి మంచులాటి తెల్లని ముసుగు గాలికి తొలగింది. ఆమె పక్క ఆరేళ్ళ అబ్బాయి, ప్రక్కనే ఆరడుగుల అందమైన నడివయసు వ్యక్తి!... అతడామె పతి కావచ్చునేమో!ఆ జంట విశ్వపతికి ‘ఒకరికొకరు దేవుడు కుదిర్చిన జంట’లా కనిపించారు. వారికి తగ్గ సంతానమేచూపుకు ఆదృష్టవంతుల్లా కనిపించారు.‘‘నీ కందుకే చెప్పా! దాన్ని నేనెత్తుకుంటానంటే వినవు. నడిపిస్తానన్నావ్‌. ఓ ప్రక్క కార్లూ, జీపులూ! అమ్మ ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది’’ అని అతను ముందుకు పరుగెత్తి ఆ పాపను పట్టుకున్నాడు. దొరికినట్టే దొరికి పాప తప్పించుకుంది. అనుకో కుండా కాలికి అడ్డంగా వచ్చి విశ్వపతి చేతికి చిక్కిందా పాప.‘‘ఏయ్‌, దొంగా! దొరికిపోయావ్‌’’ అని ఎత్తుకున్నాడు.టపటపా రెప్పలల్లార్చింది. చేరడేసి కళ్ళు మెరిసిపోతున్న మేనికాంతి నుదుటిమీద పడుతోన్న నల్లని జుట్టు, పుష్టికరమైన ఒళ్ళు. ఎంతో చనువున్న వ్యక్తిని చూసినట్టు ముఖం లోకి చూసి, విశ్వపతి మీసాలు లాగింది.‘‘నా గడ్డం, మీసాలు భయం వెయ్యలేదూ?’’ అని విశ్వపతి అంటే అడ్డంగా తలూపింది.

‘‘డాడీ నాకివ్వరూ? ఎత్తుకుంటాను’’ అని విశ్వపతి చేతుల్లోంచి పాపను తీసుకుని ముద్దాడింది కూతురు.‘‘కుంతీ మంచి పేరు పెట్టారంకుల్‌!’’‘‘నీకు కుంతీ అనే పెట్టాలనుకున్నానమ్మా. మీ అమ్మకా పేరు నచ్చలేదు. నువ్వు మగపిల్లాడిగా పుడితే ‘విశ్వామిత్ర‘ అని పెట్టాలనుకున్నా. అమ్మకిష్టం లేని పేరెందుకని ‘ప్రీతి’ అని పెట్టాను.’’‘‘బలేబలే. ఆశ్చర్యంగా ఉందే. మా అత్తగారూ ఆమె కూతురుకి ‘కుంతీ’ కొడుక్కి ‘విశ్వామిత్ర’ అని పెట్టాలనుకున్నారట. కుంతీ ఎన్నోకష్టాలూ, అవమానాలు పడిందని వాళ్ళత్తగారా పేరొద్దన్నారట. చివరికి పట్టుపట్టి కొడుక్కి మాత్రం ‘విశ్వామిత్ర’ అని పెట్టుకున్నారు. ‘విశ్వం’ అని పిలుస్తారు ఈయన్ని.’’ అందామె కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ ‘‘మరో విషయం తెలుసాండీ, మా అత్తగారి పేరూ, మీ పాప పేరూ ఒకటే’’ అంది.‘‘అరె! మా డాడీ పేరూ విశ్వపతి! ‘విశ్వం’ అంటారు. మా ఇంట్లో!’’ ‘‘అలాగా’’ అందరూ ఆశ్చర్యపోయారు.విశ్వం గుండెల్లో అలజడి. అవ్యక్త రసానుభూమి ఏవో... ఏ నాటివో మధుర స్మృతులు!్‌్‌్‌విశ్వపతి డిగ్రీ చదువుతోన్న రోజులు! ప్రీతిశర్మ మార్వాడీల అమ్మాయి. విశ్వపతి క్లాస్మేటు ప్రీతీ శర్మ తండ్రి కమలనాథ్‌ వాళ్ళ ప్రక్క వీధిలోనే. రాజస్థాన్‌ నుండి వ్యాపారం కోసం ఆంధ్రా వచ్చి స్థిరపడ్డారు. జనపనార నాట్ల సీజన్లో చుట్టుప్రక్కల రైతులు అతని దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని, నార దిగుబడి కాగానే బళ్ళతో తెచ్చి ఇచ్చి రావలసిన పైకం తీసికెళ్తారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాదుకుని మంచివానిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రీతి అతని ఏకైక సంతానం. ఒక్కసారి చూస్తే మళ్ళీమళ్ళీ చూడాలనిపించే రూపసి!