నైలునది: ఏళ్ల తరబడిగా సామ్రాజ్యాలనేలే చక్రవర్తులనూ, వారి ప్రేమలనూ కాంక్షలనూ, ఎన్నో నాగరికతల అభివృద్ధినీ పతనాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ తన ఎడతెగని గమనాన్ని ఆపకుండా ముందుకు సాగుతోంది. ఒకొక్కపడు మనిషి పోకడలకూ, నమ్మకాలకు విస్తుపోయి, అలిగి పొంగి ముంచివేస్తూ, మరొకపడు అతని ప్రేమకూ ఆర్తికీ మెచ్చి ఆగి వరాలిస్తూ మంద్రంగా అడుగులు వేస్తోంది.దూరంగా అనంతమైన ఇసక సముద్రంలో, మానవ చరిత్రలోనే మిస్టరీగా మిగిలిపోయిన పిరమిడ్స్‌ విస్తారంగా పరచుకొని వున్నాయి. పిరమిడ్స్‌కి సుమారు అర కిలోమీటరు దూరంలో ఒంటరిగా, సింహపు శరీరం మనిషి తలతో బ్రహ్మాండమైన ఎత్తులో కూర్చుని వుంది స్ఫింక్స్‌. కైరో నగరపు వీధుల్లో మెత్తగా జారిపోతోంది నీలేష్‌ ప్రయాణిస్తున్న కారు. దాదాపు ఐదువేల సంవత్సరాల నాటి పురాతన సంస్కృతిని, ఇరవై ఒకటో శతాబ్దపు నాగరికతలను కలగలుపుగా తనలో ఇముడ్చుకున్న నగరం ఎంతో చిత్రంగా వుంది. ఓ నెలరోజులపాటు తాను ఇక్కడే కదా వుండేది అన్న ఊహే నీలేష్‌కి ఎంతో ఆనందం కలిగిస్తోంది. ‘‘ది కల్చర్స్‌ అండ్‌ ది రెలిజియన్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’’ అన్న టాపిక్‌తో ఈజిప్టులో జరగనున్న ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు ఇండియా నుండి సెలక్ట్‌ అయ్యాడు నీలేష్‌చంద్ర. దాదాపు నూటయాభై దేశాల నుంచి వచ్చే మేధావివర్గం వారి మత ఆచారాలను, సంస్కృతులనూ రిప్రజెంట్‌ చేస్తూ ఈ కాన్ఫరెన్సులో పాల్గొనబోతున్నారు.కారుని హైవే నుంచి దారి మళ్ళించాడు డ్రైవర్‌. యూనివర్సిటీ కాంపస్‌ కావడంతో స్లోగా డ్రైవ్‌ చేస్తున్నాడు. నల్లటి నలుపు, లావు పెదవులు, చప్పిడి ముక్కుతో దిట్టంగా వున్నాడా ఆఫ్రికన్‌ బ్లాక్‌. ఏర్‌పోర్ట్‌లో విష్‌చేసి నీలేష్‌ని యూనివర్సిటీ కాన్ఫరెన్స్‌ సైటుకి తీసుకువెళ్ళడానికి నియమించబడ్డ ఛాఫర్‌గా పరిచయం చేసుకొన్నాడు. అంతకంటే ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు.

 కాంపస్‌ దారుల్లో ప్రయణిస్తున్న కారు కొద్దిసేపట్లోనే అధునాతనంగా నిర్మించబడిన ఓ భవనం ముందు ఆగింది. యూనివర్సిటీ గెస్ట్‌హవుస్‌ అన్న పెద్ద అక్షరాలు ఇంగ్లీష్‌, అరబిక్‌లో రాసి వున్నాయి. లగేజ్‌ని నీలేష్‌కి ఎలాట్‌ చేసిన రూమ్‌కి తీసికెళ్ళడానికి సహాయం చేసి ‘ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా స్వచ్ఛంగా నవ్వుతూ సెలవు తీసుకొన్నాడు ఆ ఛాఫర్‌.జెట్‌ లాగ్‌తో తల భారంగా వుండడంతో దాదాపు అరగంటకి పైగానే షవర్‌ బాత్‌ చేశాడు నీలేష్‌. తెల్లని లాల్చీ పైజామా ధరించి డైనింగ్‌ హాల్‌కి వెళ్ళేటప్పటికి టైమ్‌ రాత్రి ఎనిమిది గంటలు కావస్తూంది. డైనింగ్‌ హాల్‌ చాలా పెద్దది. ఒక మూల అంతగా రష్‌లేని చోట టేబుల్‌ చూసుకొని కూర్చున్నాడు. చాలా టేబుల్స్‌ దగ్గర అప్పటికే వివిధ దేశాలను రిప్రజెంట్‌ చేస్తూ వచ్చిన ప్రొఫెసర్స్‌ కూర్చుని వున్నారు. వివిధ భాషలు మాట్లాడుతూ వివిధ వేషధారణలతో వున్న మనుషులతో విచిత్రంగా, కొత్తగా వుంది వాతావరణం. తెల్లవారు, నల్లవారు, చైనీస్‌, బుద్ధిస్ట్స్‌, యూదులు, మిడిల్‌ ఈస్ట్‌ నుంచి వచ్చిన ఇస్లామ్‌ మతస్థులు అందరూ తమ తమ భేదాలను మరచి ఆనందంగా కలిసిపోయి కనిపిస్తున్నారు. యూనిఫార్మ్స్‌తో వున్న స్టీవార్డ్స్‌ అత్యంత మర్యాదతో ఆర్డర్స్‌ తీసుకొంటున్నారు. బ్రెడ్‌ అండ్‌ ఆమ్లెట్‌, ఆరెంజ్‌ జ్యూస్‌ ఆర్డర్‌ చేసి అందర్నీ పరికిస్తూ చుట్టూ చూస్తూ కూర్చున్నాడు. ఆరడుగుల ఎత్తులో వుంటాడు నీలేష్‌. విశాలమైన నుదురు, జ్ఞానంతో వెలుగుతున్న కళ్ళూ, ఆత్మవిశ్వాసంతో మెరుస్తున్న ప్రశాంతమైన ముఖంతో ఒక యోగిలా కనిపిస్తాడతను. డిన్నర్‌ వచ్చింది. అందమైన ప్లేట్లలో సర్వ్‌ చేసి వెళ్ళిపోయాడు స్టీవార్డ్‌. నెమ్మదిగా తినడం ఆరంభించాడు.