అది-గుమ్మంలో నిల్చుంటే సముద్రం సాంతం కనబడే పెద్ద బంగళా!ఉప్పుగాలి తగిలి తుప్పుపట్టిన పాత బంగళా. పెచ్చులూడిన దృఢంగా ఉన్న గోడలు... బీటలు తీసి నాచుపట్టిన పైకప్పు, హాల్లో పరిచిన పాతకాలం తివాచీ... రంగు వెలిసిన సోఫాలు... తెల్లబోయిన తైలవర్ణ చిత్రాలు... చిరకాలంగా వాడుకలో లేని షాండిలీర్లు...ఎత్తైనచెట్లు పేరు తెలీని గుబురు మొక్కలు పడుగు పేకల్లా బంగళా చుట్టూ అల్లుకున్న పిచ్చిలతలు... చుట్టూ ఆవరించి - అలా కొన్నాళ్లుంటే... మధుమతి లేకుండా ఉంటేఖచ్చితంగా భూత్‌ బంగళా అయి వుండేది.నెరిసినా.... అందమైన ముంగురుల్ని వెనక్కి తోసుకుని వంగిపోయిన రెయిలింగ్‌ని ఆనుకుని మధుమతి తదేకంగా... అనంతంగా కనిపిస్తున్న సముద్రం వంక చూస్తూంది. ఉదయించి అప్పుడే పైపైకి లేస్తున్న సూర్యుడి లేత బంగారు కిరణాలు... క్రమేపీ రంగుమారి కెరటాల్ని వెండి మలామా చేస్తున్నాయి.ఎదురుగా ఉగ్రరూపంలో... వక్రరేఖల్లాంటి కెరటాలు దూరం వెళ్లే కొద్దీ చిట్ట చివర సముద్రం సరళ రేఖలా మారి ఆకాశాన్ని అనుసంధానం చేస్తుంది. నింగీ నీరూ కలిసేచోట దృష్టి నిలిపి అవతలి తీరం చూడాలని నిరంతరాన్వేషణ చేస్తుందా అనిపిస్తుంది... మధుమతి. ఆమె తరచి చూసే కొద్దీ నిమిషాలు... గంటలూ దొర్లిపోయాయి. కాళ్లకి కళ్లకి అలసటలేకుండా నిలబడి చూస్తూనే ఉంది. ఆమె దిన చర్యలో ఎక్కువభాగం - ఎరీనాలో ఎంటరయిన ఓడల వంక... తిరుగు ప్రయాణంలో కనుమరగయ్యే ఓడల వంక తదేకంగా చూడ్డమే.ఉదయం పదిగంటలయింది.

బంగళాముందు ఎండలో మెరుస్తూ పాత ఫియట్‌ కారు వచ్చి ఆగింది. మధుమతి ‘ఎవరూ?’ అన్నట్టు తేరిపార చూసింది. ఆశ్చర్యపోయింది. అతనే!భరత్‌బాబు... తనలాగే ఫిఫ్టీ ప్లస్‌! ఒక్కరోజు టూరిస్టు పరిచయానికే వెంపర్లాడి తనని వెతుక్కుంటూ ఇంటికి వచ్చేసాడు. పత్రికల్లో బిజినెస్‌ కాలమ్స్‌ రాస్తుంటాడు. సన్నకారు బిజినెస్‌మాన్‌ కూడా.కారు దిగి ఆమె ముందు నిలబడి విష్‌ చేసాడు. అతని చేతిలో అప్పుడే తుంచి కట్టిన తాజా రోజాల బుకే నుండి మంచుబిందువులు జాలు వారుతున్నాయి. అందించి అభినందన పూర్వకంగా నవ్వాడు.‘థాంక్యూ’ అందామె. ‘‘మా వారికి గులాబీలంటే ఇష్టం. బెంగళూరు నర్సరీల నుంచి ఎన్నో రకాలు రంగులు తెప్పించి నాటించారు. ఉప్పు గాలి వల్లో ఏమో - ఒక మొక్కా బతికి బట్టకట్టలేదు’’ అంది నిట్టూరుస్తూ.‘అలాగా’ అని అతను తల పంకించాడు.‘‘ఈ పుష్పగుచ్ఛంలోని స్వచ్ఛత మీ మనసులో ఉంటుందని అనుకోవచ్చా?’’ అంది.‘‘వై నాట్‌ మధుమతి గారూ. అయాం ఏ ట్రూ జంటిల్‌మన్‌’’ అన్నాడు.‘‘ఇల్లు తేలిగ్గా కనుక్కున్నారా?’’‘‘ఏముంది. మీ బంగళా కేరాఫ్‌ బే ఆఫ్‌ బెంగాల్‌ కదా’’ అన్నాడు బిగ్గరగా నవ్వుతూ.