నా ఎదురుగా కూర్చున్న వ్యక్తి వైపు చూశాను. పద్దెనిమిదేళ్ళుంటాయా కుర్రాడికి. మూతి మీద మీసం ఇంకా చిక్కబడలేదు. కను రెప్పల్ని మాటి మాటికీ మూస్తూ, తెరుస్తూ తనపెద్ద కళ్ళను సిగ్గు చాటున దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.రెండు చేతుల్నీ దగ్గరగా చేర్చి ఒళ్ళోపెట్టుకుని ఒద్దికగా కూర్చుని నామొహంలోకి నేరుగా చూడలేక చాలా అవస్థలు పడుతున్నాడాయువకుడు. అతడి కంటే వయసులో పెద్దవాణ్ణికనుక నామనసులోని ఆందోళనను అతడికి కనబడనీయకుండా దాచుకోగలిగాను నేను కొంతవరకూ. ఎందుకంటే అతడే నాకు మొదటి కేసు మరి!వివిధ పత్రికల్లో వస్తోన్న ‘సమస్యలూ-సమాధానాలూ’ బాపతు శీర్షికలకు నిత్యపాఠకుణ్ణి నేను. దాదాపు పదేళ్ళపాటు డజను పత్రికల్లో వచ్చిన పాఠకుల సమస్యలూ వాటికి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళిచ్చిన సమాధానాలూ చదువుతున్న కొలదీ నా విజ్ఞానం అలా అలా పెరిగి పోతూ వచ్చింది.నా విజ్ఞానం ఎంతలా పెరిగిపోయిందంటే... నా మెదడులోని అరలన్నిటిలోనూ నిండిపోయి, నేను సముపార్జించిన విజ్ఞానాన్ని బయటకు పంపించకపోతే నా మెదడే చిన్నాభిన్నమై పోతుందేమోనన్నంత!నేను ఏదో ఒక రంగంలో నిష్ణాతుణ్ణయి ఉంటే ఏ పత్రికనో, టీవీ ఛానల్‌నో ఆశ్రయించి నాతల భారాన్ని తగ్గించుకునే వాణ్ణేమో! నా మనసులోని భారాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలా? అని ఆలోచించగా ఆటోచించగా...నేనే ఇంటి ముందు బోర్డుకట్టి ఎందుకు సలహాలివ్వకూడదూ? అనిపించింది. ఉచితంగా ఎంత గొప్ప సలహా ఇచ్చినా ఆ సలహాకూ, దాన్నిచ్చేవాడికీ కూడా ఆవగింజంత విలువైనా ఉండదని లోక విదితమే కనుక ఒక శుభముహూర్తాన ఇంటి ముందు బోర్డు వ్రేళ్ళాడగట్టాను.నేను బోర్డుకట్టిన వారం రోజులకు వచ్చిన కుర్రవాడే ఇప్పుడు నా ఎదురుగా ఉన్నాడు. 

అతడింతకుముందు తన సమస్యా పరిష్కారానికి ఎవరినైనా కలిశాడో లేదో గానీ నాకు మాత్రం అతడే మొదటివాడు కావడంతో కొంచెం కుతూహలంగానూ మరి కొంచెం ఆందోళనగానూ కూడా ఉంది.‘‘ఊ... చెప్పండి.’’ అన్నాను.అతడోసారి కనురెప్పలు ఆర్పి, ‘‘నాకు.. నాకు ఈ మధ్య సరిగా నిద్రపట్టడం లేదండీ!’’ అన్నాడు.‘హాయిగా కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోవలసిన వయసులో ఉన్న వాడికి నిద్ర పట్టకపోవడమేమిటీ?’’ అనుకుని పత్రికల ద్వారా నేను సముపార్జించిన విజ్ఞానాన్ని నెమరువేసుకుని ‘‘మరేం కంగారుపడకండి... పరీక్షలు దగ్గరకొస్తున్నప్పుడో... గర్ల్‌ఫ్రెండ్‌ కాదన్నప్పుడో నిద్రపట్టకపోవడం మీ వయసులో ఉన్నవారికి సహజం! మీ సమస్య పరీక్షలా...? గర్ల్‌ఫ్రెండా?’’ అన్నాను.అతడి సమస్యేమిటో అతడినోటినుంచి వినకుండానే అతడి సమస్యకు సగం పరిష్కారం దొరికిపోయినట్టే అనిపించిందినాకు. నా అంచనాకు తగినట్టే అతడి మొహంలోకి ఒక్కసారిగా వెలుగు తన్నుకొచ్చింది.‘‘రెండోదే!’’ అన్నాడు.‘‘మీ గర్ల్‌ఫ్రెండ్‌ వయసెంత?’’ అన్నాను.‘‘దయచేసి ఆ వివరాలేవీ అడక్కండి. ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఆవిడ గర్ల్‌ఫ్రెండ్‌ కాదు. లేడీఫ్రెండ్‌. సమస్యేవిటంటే... ఆవిణ్ణిగురించి తలచుకుంటేనే నాకెంతో ఉద్రేకం వచ్చేస్తుంది. కానీ తీరా ఆవిడ ఎదురుగా ఉండవలసి వచ్చేసరికి నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. కాళ్ళు వణికిపోతాయి. ఇలా చాలాసార్లయింది. చివరకు.... నిన్న....నిన్న...’’ అంటూ ఆగాడా కుర్రవాడు.