‘‘అవునా?... అలాగా?... అయ్యో?... అతనేమంటాడు... అట్లాగైతే ఎట్లా?... మరీ ఇలాంటి వాళ్ళనుకోలేదు... బుజ్జీ! అట్లా బాధపడకురా తల్లీ... ఏదో ఒకటి చేద్దాం... నేను చెబుతున్నాగా... నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు... నేను మాట్లాడతాను... మాట్లాడతానన్నాగా... సరేనా...’’వరండా ఆ చివరి నుంచీ ఈ చివరి వరకూ ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా కంగారు కంగారుగా తిరుగుతూ సెల్‌లో ఆయన మాట్లాడుతున్న మాటలు పొడిపొడిగా వినిపిస్తున్నాయి. పొడిపొడిగా వినిపించినా ఆ ఫోను ఎవరి దగ్గరి నుంచో నేను తేలిగ్గానే ఊహించగలను. చైత్ర. మొదట్లో నాకు చేసేది. నేను సరిగ్గా పట్టించుకోవడం లేదని ఈ మధ్య వాళ్ళ నాన్నకు చేస్తోంది.ఆయన కంగారు చూసి నవ్వొచ్చింది. ఎప్పటికప్పుడు అది ఫోన్‌ చేయడం, ఈయన కంగారుపడుతూ కాళ్ళు తొక్కుకుంటూ ఇది విన్నావా? నిన్నేమైందో తెలుసా? మొన్నేమైందో తెలుసా? అంటూ నాకు పాఠంలా అప్పజెప్పడం... రోజూ ఇదే తంతు. ఒకో రోజయితే రెండుసార్లు, మూడుసార్లు కూడా. ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదంటారు. కూర తిప్పుతూ చపాతి తిరగేయడం మర్చిపోయినట్టున్నాను. అట్లకాడతో తిరగేసేసరికి నల్లగా మాడు రంగుకి తిరిగింది. చపాతీలు మాడితే ఆయన మొహం అంతకన్నా మాడిపోతుంది.

 గబగబా ఆ చపాతీని కింద వరసలో పడేసి స్టవ్‌ కట్టేస్తుండగా ఆయన లోపలికి వచ్చారు. ‘ఇది విన్నావా?’ అంటూ.‘‘ఇవాళ బుజ్జి పూరీలు చేసిందట. పూరీలు పొంగలేదని, కూరలో సెనగపిండి సరిగ్గా కలవలేదని వాళ్ళ అత్తగారు ఒకటే గొణుగుడంట. ఎప్పుడూ లేనిది వాళ్ళ మామ కూడా కూర వద్దని పచ్చడి వేసుకుని తిన్నాడట. అది చూసి వాళ్ల అత్తగారు మళ్ళీ విసుక్కుందట. పాపం బుజ్జిని చూస్తే ఏం చెయ్యాలో తోచకుండా పోతోంది. బంగారం లాంటి పిల్లని తీసుకెళ్ళి రాక్షసుల మధ్య పడేశాం. చిన్నపిల్ల దానికేం తెలుసని? అయినా వీళ్ళకు పూరీలు, దోసెలు చేసి పెట్టడానికా పువ్వులాంటి పిల్లని అక్కడికి పంపింది? భలే మూర్ఖులు దొరికారు. పోనీ ఆ అబ్బాయన్నా వాళ్ళ అమ్మకు సర్ది చెప్పొచ్చుగా, వాళ్ళలా అంటుంటే ఏమీ అనడంట. పైగా ‘‘అమ్మ చేసేలాగానే చెయ్యి చైత్రా. నాకు అలానే ఇష్టం అంటాడంట. మరీ అంత నోరులేని వాజమ్మ అయితే ఎట్లా?’’ఆయన నాతో చెబుతున్నారో, స్వగతంగా అంటున్నారో తెలీకుండా కలగాపులంగా మాట్లాడేస్తున్నారు. ఆయన గారాల కూతురు ఏడ్చిందనే బాధ ఆయన ప్రతి మాటలో కనిపిస్తోంది. మొహం వాడిపోయింది. ఏం చేయాలో తోచని అయోమయంలో చిరాకు చిరాగ్గా ఉన్నారు.మాడకుండా మంచిగా ఉన్న చపాతీలు ఏరి ఒక ప్లేటులో పెట్టి కూరవేసి ఆయనకు ఇచ్చాను. చపాతీ ఒక ముక్క తుంచి నోట్లో పెట్టుకోబోతూ ‘‘పాపం బుజ్జి టిఫిన్‌ అన్నా చేసిందో లేదో’’ అంటూ ఆ ముక్క మళ్ళీ ప్లేటులో పడేశారు.