సాయంత్రం ఐదు గంటలు దాటింది. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారని ప్యూను వచ్చి చెబితే తప్పనిసరై లేచాడు గంగాధరం. చలికాలం. నెమ్మదిగా చీకట్లుముసురుకుంటున్నాయి. ఆ చీకట్లను చూస్తుంటే ఎక్కడలేని దిగులు మనసునిండా ముసురుకుంది గంగాధరానికి. బిక్కముఖంతో ఆ చీకట్లను చూస్తూ అలాగే నుంచున్నాడు.‘ఇంటికి ఎందుకెళ్ళాలి? ఇంట్లో దుమ్మూ, బూజూ తప్ప ఏముందని? తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్లి ఒక్కడే కాఫీ పెట్టుకుని తాగడం అనే భయంకర క్షణాలను అనుభవించ డానికి పనిగట్టుకుని వెళ్ళటం ఎందుకు? ఆ కాఫీ ఏదో హోటల్లో సర్వర్‌ తెచ్చిపెడితే పది మంది మధ్యలో కూచుని తాగితే పోదూ!’నెలరోజుల నుంచీ నడుస్తున్నట్లుగానే ఆ రోజు కూడా ఆఫీసు నుంచి హోటలుకు నడిచాడు.సాయంత్రం వేళ. హోటలు కిటకిటలాడుతోంది. పది నిమిషాలపైన నిలబడితేగాని సీటు దొరకలేదు. అదైనా ఓ జంటకు ఎదురుగా ఉన్న సీటు. గంగాధరం వెళ్లి కూచుంటే వాళ్ళు ఇబ్బందిగా ముఖాలు పెట్టారు. ‘కాళ్ళు పీకుతున్నాయి బాబూ. నేనేం చెయ్యలేను’ అనుకుంటూ సీట్లో కూలబడి మంచినీళ్ళు తాగాడు. అప్పుడు చుట్టూచూశాడు అంతా హడావిడిగా ఉంది. ఆ కోలాహలాన్ని చూస్తున్న కొద్దీ గంగాధరం ఒంటరితనం పెరిగి పోయింది. తన కాయమంతటితో, కాలమంతటితో ఒంటరితనాన్ని పూర్తిగా అనుభవిస్తూ టిఫిన్‌ తిని కాఫీ తాగేశాడు. పార్కులో ఓ చెట్టు కింద రెండు గంటల కాలాన్ని ఆలోచనలకు ఆహుతిచ్చి మెల్లిగా ఇల్లు చేరాడు.ఆరంతస్తుల అపార్ట్‌మెంట్‌లో మూడవ అంతస్తులో గంగాధరం ఫ్లాట్‌. ‘ఇప్పుడు ఒక్క నిమిషంలో ఇంట్లో పడిపోయి ఏం బావుకోవాలి గనక’ అనుకుని లిప్టువైపు వెళ్లకుండా మెట్లు లెక్కపెడుతూ యాభై మెట్లనూ మెల్లిగా ఎక్కాడు. ఇక తప్పదన్నట్లు తలుపు తాళం తీయబోతుంటే, పక్క ఇంట్లోంచి ఏడుపు వినపడింది.ఏమయిందా అని అటువైపు హడావిడిగా నడిచాడు.పక్కింట్లో జనం నిండుగా మూగి ఉన్నారు.వాళ్ళందరినీ తోసుకుంటూ ముందుకెళ్ళాడు గంగాధరం.

ఆ ఇంటావిడ విజయలక్ష్మి ఏడుస్తోంది. కాసేపటికి చుట్టుపక్కల వాళ్ళవల్ల విషయం అర్థమయింది.విజయలక్ష్మి భర్త రాఘవరావు స్కూటర్‌ ఆక్సిడెంటయి రోడ్డుమీద అప్పటి కప్పుడు ప్రాణం విడిచాడట.విజయలక్ష్మిని చూస్తే జాలేసింది గంగాధరానికి.‘ఈ ఫ్లాట్‌లలో వాళ్ళకేదో శని పట్టినట్లుందేమిటి? రెండు నెలల క్రితం తన భార్య సుశీల బ్లడ్‌ కాన్సర్‌తో మరణించింది. కాన్సర్‌ అని బైటపడ్డ నెలకే మరణించింది ఇప్పుడీ అఘాయిత్యం!’విజయలక్ష్మిని చూస్తూ గంగాధరం చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు.ఇద్దరి ఇళ్ళూ పక్కపక్కనే కాదు. గంగాధరం కుటుంబానికీ, రాఘవరావు కుటుంబానికీ చాలా పోలికలున్నాయి. ఇద్దరిదీ ఇంచుమించు ఒకే వయసు. రాఘవరావు బ్యాంకు ఆఫీసరయితే, గంగాధరం ఎల్‌.ఐ.సిలో ఆఫీసరు. ఒకే హోదా, ఒకే జీతం. విజయలక్ష్మి ఒక ప్రైవేట్‌ స్కూల్లో టీచరుగా చేస్తుంటే, సుశీల ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసేది. ఇద్దరూ రెండేళ్ళనాడు ఈ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్‌ కొనుక్కున్నారు. గంగాధరం వెంటనే సొంత ఇంట్లో చేరాడు గానీ, రాఘవరావు ఏడాదిపాటు అద్దెకిచ్చి పోయినేడాదే చేరాడు. ఈ సంవత్సరంలో రెండు కుటుంబాల మధ్య ఒక మాదిరి పరిచయం ఏర్పడింది. ఒకరి వివరాలు ఒకరికి తెలుసు. అత్యవసరమైన చిన్నచిన్న సాయాలు చేసుకునేవారు. ఆడవాళ్ళ మధ్య కూడా కాస్త స్నేహం కుదిరింది. తమ భర్తల దగ్గర అవతలివారిని విమర్శించకుండా రెండు మంచి మాటలు చెప్పగల సంస్కారం ఇద్దరిలోనూ ఉండడం వల్ల, ఒకరిని చూసి ఒకరు కపటం లేకుండా నవ్వుకునే వారు. ఇద్దరూ ఉద్యోగస్తులవటంతో స్నేహం పెరగటానికి కావలసినంత ఖాళీ దొరకలేదు. పైగా, సుశీల అనారోగ్యం. రాఘవరావుకి ఇద్దరు కొడుకులు. ఒకడు బెంగుళూరులో, మరొకడు త్రివేండ్రంలో ఉద్యో గాలు చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. గంగాధరానికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కూతురు శ్యామలకు కూడా పోయినేడాది పెళ్లి చేసాడు. గంగాధరానికి ఇంకా మనవలూ, మనవరాళ్లూ లేరు. ఇద్దరికీ ఇంకో నాలుగేళ్ళ సర్వీసుంది. ఇంతలో రాఘవరావుకు ఇలా మృత్యువు ముంచుకొచ్చింది.