‘‘సుశీల, జయదేవకి మళ్లీ హెల్త్‌ బాగా లేదట. నేను ఆఫీసు నుంచి రావడం లేటవుతుంది. ప్లీజ్‌, ఒక్కసారి నువ్వెళ్లి చూస్తావా’’‘‘అయ్యో, మళ్లీ ఏమైంది?’’‘‘నిన్నట్నుంచీ జ్వరమట. షుగర్‌ కూడా డౌనైనట్టుంది, ఆఫీసుకెళ్దామని తయారైనవాడు స్పృహ తప్పిపోయాడట. మెలకువొచ్చేక నాకు ఫోన్‌ చేశాడు. లేవ లేకపోతున్నానని, ఇన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆ ట్రాఫిక్‌ జాముల్ని ఈదుకుంటూ నేనెప్పటికి రాగలను? ఏం చేయాలో తోచని సమయంలో నువ్వే గుర్తుకొచ్చావు. వీలవుతుందా?‘‘అవుతుంది, ఇప్పుడే వెళ్తున్నా’’‘‘థ్యాంకూ’’ అభయ్‌ ఫోన్‌ కట్‌ చేసాడు.బాక్సులో మిగిలిన రెండు చెంచాల అన్నాన్ని గబగబా నోట్లో కుక్కుకుని, బాక్సు అక్కడ పడేసి లేచింది సుశీల. షాపు మూసేసి, తాళం వేసి గలగలా జయదేవ ఇంటివైపు నడిచింది.‘థ్యాంక్‌గాడ్‌, మొన్నట్లాగ హార్ట్‌పెయిన్‌ కాదు’కాలనీలో ముగ్గురూ తలా ఒక మూల ఉంటున్నారు. ప్రస్తుతం తను కాలనీ మధ్యలో షాపులో ఉంది కాబట్టి వెంటనే వెళ్లగలుగుతోంది. ఎప్పుడంటే అప్పుడు ఆటోలు దొరకని పరిస్థితి. మెయిన్‌ రోడ్డుకి వెళ్లడానికి దొరుకుతాయి, కానీ కాలనీలో తిరగడానికి దొరకవు.ఎండ నడినెత్తిన పడుతోంది. గబగబా పరుగెత్తినట్టే నడుస్తోంది సుశీల.మొదటి అంతస్తులో ఉంటున్నాడు జయదేవ. మెట్లెక్కేసరికి ఆయసం వచ్చింది. రెండు నిమిషాలు గసపోస్తూ నిల్చుండిపోయింది. ‘పెద్దదాన్నైపోయానా...?’‘కాదులే, ఇప్పుడే అన్నం తిని ఎండలో నడిచి వచ్చేను కదా!’ తనకి తానే నచ్చ చెప్పుకుంటూ నవ్వుకుంది.

 ‘నలభైకి దగ్గర కావట్లేదూ...’తలుపు మీద రెండు సార్లు సన్నగా తట్టి, లోపలికి నెట్టింది. తలుపు తెరుచుకుంది.బెడ్‌రూంలో నిస్త్రాణంగా పడుకుని ఉన్నాడు జయదేవ. నుదుటి మీద చెయ్యి వేసేసరికి ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు.‘‘నువ్వేంటి...నువ్వెలా వచ్చేవ్‌...’’‘‘కంగారుపడక, అభయ్‌ చెప్పేడు, అవునూ ఇంత జ్వరం తో ఉండి ఎక్కడో ఉన్న అభయ్‌కా ఫోన్‌ చేస్తావు?’’‘‘అది కాదూ...’’‘‘ఏది కాదు? నాకు తెలుసులే నీ సంగతి, మాట్లాడకు’’నీరసంగా చూస్తూ నవ్వేడు. ‘‘ఎన్ని సార్లిలా వచ్చి దేవతలా ఆదుకుంటావు? ఏడాదిగా నీకిదే పనైపోయింది.’’మంచం పక్కన టీపాయ్‌ మీద తింటూ వదిలేసిన ఇడ్లీప్లేటు తీసి సింకులో పడేసి వచ్చింది.పవరు కట్టైనట్టుంది...ఫేన్‌ తిరగడం లేదు.ఇప్పుడిప్పుడే పల్చబడుతున్న జుట్టు చెమటకు తడిచి నుదిటికి అంటుకుపోయింది. కళ్లు లోపలికిపోయి పది లంఖణాలు చేసిన వాడిలా ఉన్నాడు. ఆఫీసుకి వెళ్దామని రెడీ అయినట్టున్నాడు. ఇస్త్రీ బట్టలు వేసుకుని ఉన్నాడు.ఒక్క నిమిషం అతన్ని నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూసి, వంటింట్లోకెళ్లింది సుశీల.పనిమనిషి రాలేదల్లే ఉంది. రాత్రి తిన్న కంచం సింకులో అలాగే ఉంది.ఫ్రిజ్‌లోంచి బ్రెడ్‌ తీసి పెనం మీద కాల్చి, గ్లాసు నిండా కాఫీ కలిపి పట్టుకెళ్లింది.లేవబోతే వారించి, పక్కనే కూర్చుని బ్రెడ్‌ని కాఫీలో ముంచి తిన్పించింది.