మంచుతో తడిసిన మల్లెలు వెదజల్లుతుంటే భలే ముద్దొస్తాయి. చల్లగాలి చెలికాడు ముద్దాడుతుంటే తన్మయానికి లోనైన గులాబీలు అందంగా వికసిస్తూ తమ పరిమళాల్ని నలుదిశలా వ్యాపింపజేస్తుంటే.. భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. చేమంతులు.. పొగడపూలు.. మరుమల్లెలు.. పూబంతులు ఇవన్నీ ప్రకృతిలోని అందాలు..అద్బుతాలు. వీటన్నిటిని మించిన అద్బుత సౌందర్యం.. సుకుమార సోయగం సంధ్య స్వంతం.సంధ్యను చూసిన తొలిక్షణంలోనే నా మనస్సుని తనకి ‘అంకితం’ చేశాను. తను పరిచయం అయిన తొలిక్షణాలు గుర్తొస్తే మనస్సు ఇప్పటికీ మాటల్లో చెప్పలేనంత ఆనందానికి లోనవుతుంది. ప్రపంచంలోని ఆనందం అంతా నా స్వంతమైనంత సంతోషంగా వుంటుంది.్‌ ్‌ ్‌చంద్ర బింబం లాంటి గుండ్రటి ముఖం... నవ్వితే గులాబీ రేకుల్లా విచ్చుకునే లేత అధరాలు.. సన్నగా మొనదేలిన సంపెంగ లాంటి ముక్కు.. తళుక్కున మెరిసే ముత్యాల్లాంటి పలువరస.. కాటుక కన్నుల మాటున దాగిన కోటి కాంతులు వింతగా వెలుగులు చిందిస్తుంటే అల్లరిగా నవ్వే మీనాల్లాంటి నయనాలు.. వయ్యారంగా ఉయ్యాలూగినట్టూ ఊగే సన్నని నడుము.. ఎరుపు రంగు లంగా జాకెట్టుపై.. నీలిరంగు ఓణీతో నడిచి వొస్తున్న ‘సంధ్య’ను చూస్తుంటే కొద్దిసేపు గుండె లయ తప్పింది.

ఉషోదయ సమయం.. దినకరుడు తూరుపుకొండల నడుమనుండి పైకి వస్తూ ప్రకృతి అంతటా అరుణవర్ణాన్ని పరుస్తుంటే.. పచ్చగా మెరుస్తున్న గడ్డిపూలపై సన్నగా మంచు కురుస్తోంది. ట్యూషన్‌కి టైం అయిందనుకుంటూ వడి వడిగా నడుచుకుంటూ వెళుతుంటే.. నా వేగానికి అడ్డుకట్ట వేస్తున్నట్లుగా ఎదురువచ్చింది తను.తనని చూసి కొద్ది క్షణాలు నన్ను నేను మర్చిపోయి రెప్పవేయకుండా చూడసాగాను.‘‘ఎక్స్‌క్యూజ్‌ మి!’’ అన్న పిలుపు వినిపించి ఈ లోకంలోకి వచ్చాను.‘‘మీ పేరు’’ తడబడుతూ అడిగాను.‘‘సంధ్య’’ వీణ మీటినట్లుగా చెప్పింది.మళ్ళీ తనే ‘‘శ్రీరామ్‌ లెక్చరర్‌గారి దగ్గర నిన్ననే ట్యూషన్‌లో చేరాను’’ అంటుంటే...‘‘ఓ అలాగా! శ్రీరామ్‌ మాస్టారు గారు కెమిస్ర్టీ చాలా బాగా చెబుతారు. నేను ఎంపిసి డిస్టింక్షన్‌లో పాస్‌ అవడానికి కారణం ఆయనే. నేను సెకండ్‌ ఇయర్‌ బి ఎస్సీ. మరి మీరు?’’ అంటూ అడిగాను.