ఆ సాయంకాలం గిరాకీ లేక రత్నగర్భ మెడికల్‌ షాపు ఖాళీగా వుంది. ఒకసారి అటూ ఇటూ చూసి ఆనంద్‌ హడావిడిగా షాపులో ప్రవేశించాడు. క్యాష్‌బల్ల దగ్గరున్న ఓనర్‌ని చూసి అచ్చు హిందీ విలన్‌ సాయాజీ షిండేలా వున్నాడనుకున్నాడు.‘‘ఏం కావాలబ్బాయి’’ షాపతను లాలనగా అడిగాడు. చూసీ చూడగానే ఇతన్ని కాలేజీ స్టూడెంటుగా సరిగ్గా అంచనా కట్టాడు.‘‘నాకూ.. నాకూ..’’ ఆనంద్‌ నసుగుతున్నాడు.‘‘నాకు తెలుసు. నీకు యాసిడ్‌ బాటిల్‌ కావాలి. మా షాపులో ఉంది. అయినా అది నీకు అమ్మొచ్చు అని పోలీసాఫర్‌నుంచో, మీ ప్రిన్సిపాల్‌నుంచో ఓ కాయితమ్ముక్క పట్టుకొస్తేనే నీకు అమ్మేది’’‘‘ఛా..ఛా..ఛా. యాసిడ్‌ వద్దు. అది ప్రేమ విఫలమయినప్పుడు. నేనూ.. నేనూ సఫల ప్రేమికుడిని. నాకూ.. నాకూ.. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. బైది బై మీరు అచ్చు సాయాజీ షిండేలా వున్నారు. మిమ్మల్ని షిండే అంకుల్‌ అని పిలవడానికి తహతహలాడుతున్నాను’’‘‘షిండే సాబ్‌ అను. అంకుల్‌ అంటే నాకు తిక్కరేగుద్ది. దాంతో నీ బొక్కలు విరగ్గొట్టి హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేస్తానో లేకుంటే నీ ముఖం మీద యాసిడే పోస్తానో నాకే తెలియదు. ముఖం కాలింతర్వాత అద్దంతో పని లేదబ్బాయి. ముందస్తుగా చెప్పేస్తున్నాను’’‘‘షిండే సాబ్‌.. నేను మాక్లాస్‌ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. 

ఆమె అచ్చు డెర్బీ మెరేవియాలాగుంటుంది’’‘‘డెర్బీ- అదెవత్తే’’‘‘ఎవరో నాకూ తెలియదు సార్‌. నాకు నచ్చిన అమ్మాయికి ఆ పేరు పెట్టుకుంటాను. పేరు బాగుందా సార్‌?’’‘‘ఏడ్చినట్టుంది’’‘‘డెర్బీ నన్ను ఘాటుగా ప్రేమిస్తోంది. నా సెల్‌ ఫోను కెమెరాతో ఆమెకు తెలిసి కొన్ని ఆమెకు తెలియక కొన్ని ఫోటోలు తీసి సేవ్‌ చేశాను. లేఖలు ఎక్స్చేంజి చేసుకున్నాం. ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుకున్నాం. అలాంటిది యాసిడ్తో నాకింక పని ఏముంది.’’‘‘మరి నీకు ఏం కావాలి?’’‘‘మరే.. మరే..నాకూ నాకూ’‘‘ఏంటబ్బాయి నానుస్తావు. ఢంకా బజాయించి మరీ అడుగు’’‘‘షిండే సాబ్‌. మీరు పెద్దవారు. ఎలా అడగాలో తెలియక సిగ్గుతో చితికి పోతున్నాను’’‘‘వయసు చూసి బెంబేలు పడకు. నీ ప్రేమ వృత్తాంతం దాచకుండా చెప్పు. చదువుకునే రోజుల్లో నేనూ ప్రేమించాలే. ఆవిడ ఒప్పుకోలేదు. అది వేరే విషయం. కాకపోతే మాకు అప్పటికి యాసిడ్‌ ఉపయోగాలు తెలియవు’’ఆనంద్‌కు ధైర్యం వచ్చింది. ‘‘డెర్బీ నా దేవత. నా కోసం వాళ్ల నాన్నకు బురిడీకొట్టి సిన్మాలకు షికార్లకు వచ్చేసేది. నేను ఏవో గిఫ్టులూ పాకెట్‌ మనీ.. సారీ. జాకెట్‌ మనీ ఇచ్చేవాడిని’’‘‘జేబులు కొట్టటం.. తాళాలేసిన ఇళ్లు దోచుకోవటం లాంటి చిల్లర మల్లర జాబులేమన్నా చేస్తున్నావా’’ షిండే అనుమానంగా అన్నాడు.‘‘చీ ఛీ.. అది మా ఇంటా వంటా లేదు. నన్ను డాక్టర్ని చేయాలని మానాన్న అడిగినంత డబ్బు పంపిస్తాడు’’