‘‘వటపత్రశాయికి వరహాల లాలీ... రాజీవ నేత్రునికి రతనాల లాలీలాలీ లాలీ లాలీ లాలి.... లాలీ లాలీ లాలీ లాలి’’సిడి ప్లేయర్‌లోంచి హాయిగా జోలపాట వినిపిస్తోంది. నిద్రలోకి జారిన కొడుకు అనిరుద్ధ్‌ని వాడి మంచం మీద పడుకోబెట్టి, జాగ్రత్తగా కంఫర్టర్‌ కప్పి, సిడి ప్లేయర్‌ని ఆఫ్‌చేసి ఫామిలీరూమ్‌లో కొచ్చింది వసంత.జనవరి నెల. మొదటి వారం. షికాగో దగ్గర్లోని సబర్బ్‌లో వసంత ఇంటి ముందు లాన్‌ అంతా మంచుతో కప్పడిపోయింది. వీధి గుమ్మానికి పక్కగా వేసిన గులాబి, చామంతి మొక్కలపై మంచు పేరుకుపోయింది. అద్దాల్లోంచి పైనుంచి సన్నగా కురుస్తున్న మంచు కనిపించింది. ఒక్కసారి అమ్మ మాటలు గుర్తొచ్చాయి. క్రితం సంవత్సరం అనిరుద్ధ్‌ పుట్టినప్పుడు అమ్మ వచ్చింది. అప్పుడు ఇలాగే పడుతున్న మంచునిచూసి అమ్మ ‘‘సన్నజాజి రేకులు జలజలా రాల్తున్నట్టు యెంత బాగుందే ఈ మంచు వర్షం...’’ అంది. ఆ రోజు అమ్మలోని భావుకతకు ఎంత సంతోషించిందో, కాని ఈ రోజు, ఇలా గంటగంటకీ పేరుకుపోతున్న మంచును చూస్తుంటే యేంటో మనసంతా స్తబ్ధంగా అయిపోతోంది.ధనరాజ్‌ పొద్దున్నే లేచి, డ్రైవ్‌ వేలో వున్న మంచునంతట్నీ తవ్విపోసుకుని మరీ ఆఫీసుకెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పటికెలా వుంటుందో... ఆలోచిస్తూ కిచెన్‌వైపు నడిచింది వసంత.

 అలవాటుగా అన్నం తిందామనుకుంది. కాని ఈ చలికో యేమో పొద్దున్న తిన్న బ్రెడ్‌ స్లైస్‌లే ఇంకా కడుపులో పెట్టిలో పెట్టినట్టున్నాయి. అన్నం తినకపోతేనేం, యిప్పుడు నష్టమేంటి... అనుకుంది. అంతగా అయితే ధనరాజ్‌ రాగానే తొందరగా డిన్నర్‌ తినేస్తే సరి అని కూడా అనుకుంది. అన్నం తినకపోతే నష్టం లేకపోగా మరింత లాభం కూడా కనిపించింది వసంతకి. అదేమిటంటే అన్నం తిన్న కంచం కడుక్కోనఖ్ఖర్లేదు. హమ్మయ్య అనిపించి ఫ్రిజ్‌లో వున్న డయట్‌ కోక్‌ కేన్‌ తీసుకుని బ్రేక్‌ ఫాస్ట్‌ టేబిల్‌ ముందు కూర్చుంది.ఇంతలో ఫోన్‌మోగింది. యెవరా అనిచూస్తే జయ. జయ వసంతతో కలిసి ఇండియాలో ఇంటర్‌ చదివింది. హైదరాబాదులోనే ఇంజనీరింగు చేసి వసంత లాగే ఒక హెచ్‌.వన్‌ వీసాలో వున్న అబ్బాయిని పెళ్ళాడి అమెరికా వచ్చింది. వసంతకి రెండుగంటల డ్రైవ్‌లో వుంటోంది. యెప్పుడో యేడాది కొకసారైనా కల్సుకుంటారో లేదో కాని ఇద్దరూ ఫోన్లో మటుకు తరుచు మాట్లాడుకుంటూనే వుంటారు. ఆమె కూతురు ప్రశాంతి కూడా ఇంచుమించు అనిరుద్ధ్‌ ఈడుదే. అందుకే ఇద్దరూ పిల్లల్ని పెంచడంలో వున్న సాధక బాధకాలు మాట్లాడుకుంటుంటారు.ఫోన్‌ యెత్తడం ఆలస్యం చేస్తే ఆ శబ్దానికి అనిరుద్ధ్‌ లేస్తాడేమోనని వెంటనే తీసి మాట్లాడింది వసంత.‘‘హాయ్‌ జయా, యేవిటి కబుర్లు. ప్రశాంతి పడుకుందా..’’