‘‘ఆర్ యు సాటిస్‌ఫ్యాక్టరీ విత్ యువర్ డే-టు-డే లైఫ్...?’’ చాలాకాలం తరువాత పరిచయమున్న ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్‌తో రాత్రి తొమ్మిది గంటలకు ఒక విందు పార్టీలో అడిగాను.‘‘ఏ విషయంలో సాటిస్‌ఫాక్టరీ...?’’ ఎదురు ప్రశ్నించాడు అతను.‘‘నాకైతే ఈ జీవితం పరమబోరుగా వుంది. పిల్లల చదువులు, వాళ్ళ సెటిల్‌మెంట్లు, భార్య ఉదయాన్నే ఉద్యోగానికెళ్ళడం, నేనూ ఇంత ఉడకేసుకుని ఆఫీసుకెళ్ళడం - రాత్రికి ఎపడో అందరం ఒక దగ్గర కలవడం - అలా కాసేపు నిద్రపోతామో లేదో - తిరిగి తెల్లవారడం ... మళ్ళీ అదే రొటీన్ జీవితం.’’‘‘అందరం అంతేగా మరి’’ నా సోదరి కట్ చేస్తూ అన్నాడు. ‘‘ఎవరు తృప్తిగా వున్నారు ఈ జీవితంలో. నాకు మాత్రం లేవా సమస్యలు’’ టమాటా సూప్‌ను చప్పరిస్తూ అన్నాడు అధికారి.‘‘మీరే గవర్నమెంట్. మీకేం సమస్యలుంటాయి సార్...?’’నా ప్రశ్నకు ఒక్కసారి భళ్ళుమని నవ్వాడు అతను.‘‘అందరూ అనుకుంటున్నది అదే. సెక్రటేరియట్‌లో కూర్చునే ప్రతివాడు గవర్నమెంట్. అందరూ ఆర్డర్లు వేసేవారే. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే వున్నాయిగా’’ భోజనం చేయడానికి ప్లేట్ తీసుకుంటూ అన్నాడు అధికారి.‘‘ప్రజలకు ఏం మంచి జరుగుతోంది. ఏ పని చేద్దామన్నా ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. కోర్టులు, చట్టాలు, సిఎం దగ్గర నుంచి మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, ప్రతిపక్షాలను అందరినీ ఒప్పించాలంటే కష్టసాధ్యమైన పని. అందర్నీ ఒప్పించే కార్యక్రమం అమలు చేయాలంటే క్రిందిస్థాయిలో జరిగే అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాల వలన ప్రజలకు ఫలితం అందడం లేదు. అందుకే ఒక్కోసారి నా ఉద్యోగానికి రాజీనామా చేయాలనిపిస్తుంటుంది.
జీవితం పట్ల తృప్తి అంటూ నాకు లేదు’’ - భోజనం ముగించి కారు ఎక్కుతూ అన్నాడు అధికారి.సంసార చక్రంలో నలిగిపోయిన నాకు జీవితం పట్ల తృప్తి లేదంటే అర్థముంది గానీ, ఒక్క కలంపోటుతో లక్షలమందికి లాభం చేకూర్చే పథకాల అమలు తీరు సరిగా లేక బాధపడే ఉన్నతాధికారి కూడా తృప్తిగా లేడంటే లోపం ఎక్కడో వుంది.లైఫ్ పట్ల ఒక డిప్రెషన్, యాంత్రిక జీవితం, మెకానికల్... ఏదో అసంతృప్తి, అసహనం, ఏమీ చేయలేని చేతకాని తనం నాకు ఈమధ్య ఎక్కువైపోయింది.అయిదేళ్ళు ఎమ్మెల్యేగా వుండి, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వాడు నా క్లోజ్ ఫ్రెండ్. ఎమ్మెల్యే కాకముందు రోడ్లమీద మిర్చి బజ్జీలమ్మే బండి పక్కన నిలబడి ఎన్నోసార్లు వేడివేడి మిర్చీలకు ఉల్లిపాయ నంజుకుంటూ కొసరికొసరి మరికొంచెం చట్నీ వేయించుకుంటూ తిన్నాం ఇద్దరం కూడా.ఎమ్మెల్యేగా వున్న అయిదేళ్ళలో వాడు అనంతంగా సంపాదించాడు. అనేక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాడు. ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఇప్పటికీ ప్రజలు వీడిని అనేక మీటింగులకు ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తుంటారు.