ఎలా చెప్తే అర్థం అవుతుంది మీకు...ఈ మాట ఎన్ని సార్లు అన్నానో నాకే గుర్తు లేదు. ఎన్ని సార్లు అన్నా ఎలా చెప్తే ఆయనికి అర్థం అవుతుందో నాకు అర్థం కాలేదు. ఎలా చెప్పినా కొన్ని విషయాలు మగవాళ్ళకి అర్థంకావు అంతే.నేను మా వూరు వెళ్ళి వస్తాను. చెప్పాను ఆ రోజుసాయంత్రం.ఎందుకు అనవసర ఖర్చులు...మీ అన్నయ్యా వాళ్ళే హైదారాబాద్‌ మారిపోతున్నారు కదా...వాళ్ళు వచ్చిన తరువాత ఒకసారి కలిస్తే సరిపోదూ అన్నాడు మోహన్‌.అన్నయ్య వస్తున్నాడనే నా బాధ. అసలు అందుకే వెళ్ళాలి అని చెప్తామనుకున్నాను. అలా చెప్తే అర్థం కాదు. ఎలా చెప్తే అర్థం అవుతుంది అని ఆలోచించినా నాకు ఏ ఆలోచనా రాలేదు.నేను వెళ్ళాలి అంతే. అన్నాను గట్టిగా.సరే వెళ్దువులే...దానికి ఎందుకంత కోపం. అన్నాడు పేపర్‌ చదువుతూ. నాది నిజంగా కోపమే అయితే ఇలా పేపర్‌ చదువుతూ సమాధానం చెప్పేవాడా? అసలు కోపంగా అనడానికీ, స్థిరంగా అనడానికి చాలా తేడా ఉంది. అగ్రెషన్‌కీ అస్పెర్షన్‌కీ తేడా లేదూ...?ఎప్పుడు వెళ్ళను? అని మాత్రం అన్నాను.అది కూడా ఏదో అనుకొనే ఉంటావుగా...అదీ నువ్వే చెప్పు. ఆ గొంతులో నాకు అలవాటైన వెటకారం. అందుకే ఆ వెటకారానికి నేను స్పందించను. స్పందించకూడదు అని కూడా అనుకుంటూ వుంటాను. 

కానీ అంతలోనే నా గొంతులో నుంచి మాటలు దొర్లుకొస్తాయి.అవును...నువ్వే అంటావుగా దేనికైనా ప్లానింగ్‌ అవసరమనీ... చివర్లో దీర్ఘం తీస్తున్నప్పుడు మాటకి ప్రతి మాట చెప్పానని గుర్తొస్తుంది. నా మాటలు ఆగిపోతాయి. అతని చూపులు నాలో దిగబడతాయి.విసిగించకుండా విషయం చెప్పు...అంటాడు విసిగిపోయిన ముఖం పెట్టి. ఒక్కమాటకి విసిగిపోయిన ముఖాలే ఇలా ఉంటే, సంవత్సరాల తరబడి విసుగుని భరించే ముఖాలు ఇంకెంత ఛెండాలంగా ఉండాలి? మరి నా ముఖం అలా వుండదే?సరే వచ్చే బుధవారం వెళ్తున్నాను...రెండు రోజులు ఉంటాను. పిల్లల్ని ఇక్కడే వదిలేస్తున్నాను. సత్తెమ్మకి రోజూ రమ్మనమనీ, మీకు పిల్లలకీ బాక్స్‌ పెట్టమనీ చెప్పాను. గ్యాస్‌ వస్తుంది పెట్టించండి...గడగడా చెప్పేశాను. ఆయన దగ్గర్నుంచి సమాధానం రాదు. తల పేపర్లో నుంచి తీసి...ఏంటి...ఏం చెప్పావు...అన్నాడు. మళ్ళీ చెప్పాలా వద్దా?చెప్పలేదు.్‌్‌్‌బస్సు బయల్దేరింది. చీకటి గుహలో నుంచి బయటపడ్డ చిలకలా రెక్కల్లా నా చీర చెంగు గాలిలోకి ఎగురుతోంది. ఏసీ గదిలోనుంచి ప్రకృతి వడిలోకి పరిగెత్తుతున్నట్టు వీస్తోంది గాలి. దారం తెగిన గాలి పటంలా రెపరెపలాడుతున్న జుట్టు.కిటికి పక్కన సీటు.ఎప్పుడూ అన్నయ్య సొంత ఆస్థిలా ఆక్రమించిన స్థలం స్కూల్‌ బస్‌లో బడికి వెళ్ళినంత కాలం. నాకు కాకుండా పోయిన నాకు ఇష్టమైన స్థలం. వాడు నాకు అన్నయ్య కాకుండా ఉంటే? తమ్ముడై ఉంటే? ఈ సీటు మీద ముందు నేనే అధికారం చెయలాయించే దానినా?