రైలు రైట్టయానికి ఎక్కడ తగలబడి చస్తుందోనని భయం. అది దాదాపు అసంభవమని తెలిసినా వెళుతున్న పని అలాటిది గాబట్టి ఆందోళన. గడప దాటి బయట అడుగేస్తూనే చంటిది తుమ్మింది.‘వెనక తుమ్ము కీడు చేయదులెండి’. మా ఆవిడ భరోసా ఇచ్చింది.చంటిది; ఏడాది పిల్ల; దాని తుమ్ము ఏపాటిది? ధైర్యం చేసి వీధి మలుపు చేరుకున్నాను. ఎంతసేపటికి రిక్షా దొరకదు! ఆర్‌.టి.సి. బస్టాండు ఊరవతల తగలబడింది. తుమ్ము ప్రభావం అప్పుడే సూచిస్తూంది. ప్రయాణం మానటానికి వీలులేదు. వాయిదా రోజు కోర్టులో కనిపించకపోతే వకీలు మండిపోతాడు. జడ్జి చిందులేస్తాడు. జడ్జి గారంటే వెన్నుపూసలో వణుకు పుట్టుకొస్తుంది. చెయ్యందిస్తే కాటేసేలా ఉంటుంది అతని చూపు.‘వస్తారా బాబూ?’ఎదుట ఆగిన రిక్షాను చూసి ప్రాణం లేచొచ్చింది. బేరం కుదుర్చుకుని బండెక్కాను. ముందు గమనించలేదు రిక్షావాడు ముసలిపీనుగని, ఎంత సేపటికి బస్టాండు రాదు. వాడు తొక్కుతుంటే చక్రాలు తిరుగు తున్నాయా అని అనుమానమొచ్చింది. తొందరపెడితే మొండికెత్తి ఆపేస్తా డని భయం.నేనెక్కవలసిన బస్సు స్టాండులో కనబడగానే మనసు కుదుట పడింది. 

మా ఊరికి రైల్వేస్టేషన్‌ లేదు. రైలెక్కాలంటే పది కిలోమీటర్లలో వున్న పక్కూరి కెల్లాలి. రిక్షా బాడుగ చెల్లించి, సగం పరుగుతో బస్సు దగ్గర చేరాను. బస్సులో పరిస్థితిచూసి నా ఆత్రుత గాలితీసిన బుడగలా తుస్సుమంది. సీట్లలో అక్కడొకరు అక్కడొక్కరు పల్చగావున్నారు ప్యాసింజర్లు. అంతాకలిసి పదిమంది గూడా లేరు. డ్రైవరు సీటు, కండక్టరు సీటు ఖాలీగా ఉన్నాయి. వాచి చూసుకున్నాను. బస్సు కదలటానికి అరగంట మాత్రమే ఉంది. నాకు తొందరగావుంటే ప్రపంచానికంతా తొందరౌతుందా? ప్రయాణికులు నింపాదిగా వొక్కొక్కరే వస్తున్నారు.ఖాకీ బట్టలపైన తోలుసంచి తగిలించుకుని బస్సులో కొచ్చిన మనిషిని కండక్టరుగా గుర్తించాను. అతని వాలకం చూసినకొద్దీ అసలు కండక్టరు కాదేమోననే అనుమానం కలిగిస్తూంది. కండక్టర్లకు గూడా నకిలీ లుంటారా? అతడు కారాకిల్లీ నమలడం లేదు; సిగరెట్‌ వెలిగించలేదు. ఆర్‌.టి.సి. కండక్టరు కుండవలసిన దర్జాగానీ, దర్పంగానీ అతనిలో ఏ కోశానా కనబడటం లేదు. వెనకసీట్ల నుండి నెమ్మదిగా టికెట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. డ్రైవరు సీటుమీది కెక్కాడు. రిక్షావాడిలాగే ముసలి పీనుగు దాపురించాడేమోనని చూశాను. కాదు; చాకులాటి కుర్రాడు. ప్రమాదమేదీ జరక్కపోతే పది నిమిషాల్లో గమ్యం చేర్చేలా ఉన్నాడు. ప్రస్తుతం అలాటివాడే అవసరం. రైలు దాటిపోకుండా అందించాలి.స్టీరింగ్‌ను రెండు చేతులతో ముట్టి కళ్ళకద్దుకున్నాడు. తన సీటు కెదురుగా బిగించుకున్న చిన్న దేవుడిపటానికి దండం పెట్టుకున్నాడు. ప్రయాణికులకు అల్టిమేటం ఇస్తున్నట్టుగా హారన్‌ బయ్యిమని వాయించాడు. హారన్‌ మోత వినగానే, బాతాఖానీ కొడుతూ ప్లాట్‌ఫారం మీద నిలబడిన ప్యాసింజర్లు, కిల్లీకొట్టు దగ్గర డిటెక్టివ్‌ పుస్తకాల ముఖచిత్రాలు ఆస్వాదిస్తున్న ప్యాసింజర్లూ వొక్కసారిగా ఎగబడ్డారు.